ఇద్దరు చంద్రులకు... నీటి పేచీలెందుకు?
తాగునీటి సమస్య కేవలం ఒక్క రాష్ర్టానికే పరిమితం కాదు. దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కుదరకుంటే న్యాయస్థానాల ద్వారా తేల్చుకోవాలి. అంతేకానీ, పరసప్పరం ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తే.. ప్రజల్లో విద్వేషాలు పెరగడం మినహా దక్కే ఫలితం ఏమీ ఉండదు. దేశంలో చాలా రాష్ర్టాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇందుకు ఏపీ,తెలంగాణ ఏమీ మినహాయింపుకాదు. ఇంతకాలం ఉమ్మడి రాష్ర్టంగా ఉన్న ఈ రెండు రాష్ర్టాలు […]
BY admin3 May 2016 7:08 AM IST
admin Updated On: 3 May 2016 7:08 AM IST
తాగునీటి సమస్య కేవలం ఒక్క రాష్ర్టానికే పరిమితం కాదు. దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కుదరకుంటే న్యాయస్థానాల ద్వారా తేల్చుకోవాలి. అంతేకానీ, పరసప్పరం ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తే.. ప్రజల్లో విద్వేషాలు పెరగడం మినహా దక్కే ఫలితం ఏమీ ఉండదు. దేశంలో చాలా రాష్ర్టాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇందుకు ఏపీ,తెలంగాణ ఏమీ మినహాయింపుకాదు. ఇంతకాలం ఉమ్మడి రాష్ర్టంగా ఉన్న ఈ రెండు రాష్ర్టాలు ఇప్పుడు సాగునీటి విషయంలో సిగపట్లు పడుతున్నాయి. చర్చలకు అవకాశమున్నా ఆ దిశగా ఎవరూ మొగ్గు చూపకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వేగంగా నిర్ణయంతీసుకోవడం, తరువాత వచ్చిన బీజేపీ పట్టించుకోకపోవడంతో రెండురాష్ర్టాల మధ్య అనేక సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే కొనసాగుతున్నాయి. కరెంటు, నీరు, ఉద్యోగుల విభజన, హైకోర్టు విభజన విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో నువ్వా- నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఏపీ- తెలంగాణ.
ఏపీ, తెలంగాణది ఒకేదారి..!
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా అభ్యంతరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఆ రాష్ర్టంతో సంప్రదింపులకు ఏపీసిద్ధంగా ఉన్నా.. ఏపీ ప్రాజెక్టు వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆ రాష్ట్రం కోర్టుకు వెళ్లింది. ఇక తెలంగాణ తాను చేపట్టబోయే ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ముందుజాగ్రత్తతో మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అవి సఫలీకృతం కావడంతో ఇప్పుడు తాను కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. కరువుతో అల్లాడుతున్న పాలమూరు జిల్లాకు తాగునీటిని మంజూరు చేయాలని భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీశ్ తాజాగా కర్ణాటకతోనూ చర్చలు జరిపి ఆ రాష్ర్టాన్ని ఒప్పించారు. ఇదేసమయంలో పాలమూరు విషజ్ఞంలో మాత్రం ఏపీతో చర్చలకు ఆసక్తి చూపడం లేదు.
ఈ వైరానికి మూలం అదేనా?
ఓటుకు నోటు కుంభకోణం బయటపడటం ఏపీ తెలంగాణ మధ్య దూరం మరింత పెంచింది. అప్పటి నుంచి ఏపీ సీఎం హైదరాబాద్ నుంచి మకాం మార్చాడు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మరోవైపు గులాబీ దండుమాత్రం సైకిల్ పార్టీ ఎదురుపడితే విమర్శలతో ఉతికి ఆరేస్తోంది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన పార్టీతో నెలకొన్న వైరం మూలంగా చర్చల విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదు. పాలమూరు ప్రాజెక్టు అక్రమమని వాదిస్తోన్న ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా పట్టిసీమను ఎలా చేపట్టిందని ప్రశ్నిస్తోన్న తెలంగాణ సర్కారు ప్రశ్నకు మాత్రం బదులివ్వడం లేదు. పాలమూరు పచ్చగా ఉండాలని అందరూ కోరుకుంటారు.. కృష్ణా నదిపారుతోన్న పాలమూరు జిల్లా ప్రజలకు ఆనది నీళ్లు ఇవ్వాలనడం న్యాయమే. అదేసమయంలో రాయలసీమ ఎండిపోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? చర్చలతో ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిష్కారానికి బదులు కలిసి జీవిస్తోన్న ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగడం మినహా ఎవరూ ఏమీ సాధించలేరు. ఒకరకంగా చూస్తే.. రెండు రాష్ర్టాల్లో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఈ విషయంలో అధికార పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ ఘనత తమ ఖాతాలో వేసుకునేందుకే ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు పక్కన బెట్టి ప్రజల గొంతుకలు, ఎండిన సాగుభూములను తడపాలని హితవు పలుకుతున్నారు.
Next Story