నా భర్త బెయిల్‌ని రద్దుచేయండి...!
తన భర్తకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ని రద్దుచేయమంటూ ఒక మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తనపై అత్యాచారం చేసి పెళ్లి చేసుకున్న అతను తిరిగి హింసించడం మొదలుపెట్టడంలో ఆమె కోర్టుకి తన బాధలను మొరపెట్టుకుంది. బాలికకు ప్రస్తుతం భర్తగా ఉన్న యువకుడు 2014 మార్చి నుండి ఆగస్టు వరకు ఆమెపై పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే బాలికను, ఆమె తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించి, […]
తన భర్తకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ని రద్దుచేయమంటూ ఒక మైనర్ బాలిక ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తనపై అత్యాచారం చేసి పెళ్లి చేసుకున్న అతను తిరిగి హింసించడం మొదలుపెట్టడంలో ఆమె కోర్టుకి తన బాధలను మొరపెట్టుకుంది.
బాలికకు ప్రస్తుతం భర్తగా ఉన్న యువకుడు 2014 మార్చి నుండి ఆగస్టు వరకు ఆమెపై పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే బాలికను, ఆమె తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించి, పెళ్లికోసం మధ్యంతర బెయిల్ పొందాడు తరువాత అదే ఏడాది సెప్టెంబరులో అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరయ్యింది.
అయితే పెళ్లి తరువాత అత్తింటివారు బాలికను హింసించడం మొదలు పెట్టారు. కట్నం తేవాలంటూ ఆమెను వేధించేవారు. కేసుని ఉపసంహరించుకోకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని బెదిరించేవారు. దాంతో బాలిక తిరిగి అత్తింటినుండి బయటకు వచ్చేసి కోర్టులో కేసు వేసింది. పెళ్లి తరువాత తాను భరించిన హింసను అందులో పేర్కొంది. తన భర్తకు ఇచ్చిన బెయిల్‌ని రద్దుచేయాల్సిందిగా కోరింది. ఈ కేసుని విచారించిన ట్రయల్ కోర్టు బాలిక భర్తకు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయలేమని తెలిపింది. వివాహ చట్టాల ప్రకారం ఆమె తన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలని, బెయిల్‌ని మాత్రం రద్దుచేయలేమని చెప్పింది. దీనిపై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన బాలిక, తాను మైనర్ అయినందున చట్టాల ప్రకారం చెల్లని తన వివాహాన్ని ట్రయల్ కోర్టు ఒప్పుకోవటం గురించి కూడ తన పిటీషన్లో ప్రశ్నించింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని పక్కకు పెట్టి, అతని బెయిల్‌ని రద్దుచేయాలని ఆమె ఢిల్లీ హైకోర్టుని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో ఇక రాజీపడే ప్రసక్తి లేదని ఆమె కోర్టుకి తెలిపింది. బెయిల్ పొందడానికే అతను తనను పెళ్లి చేసుకుని, బాగా చూసుకుంటాననే మాయమాటలు చెప్పాడని ఆ బాలిక పేర్కొంది.