జానారెడ్డికి పొగ బెడుతున్న ఆ నేత ఎవరు?
సీఎల్పీ నేత జానారెడ్డిపై కొంతకాలంగా అధికార పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో మాత్రం ఆయన ఈ ప్రచారంపై సీరియస్ అయ్యారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి.. నేను తప్పుకుంటాను అని తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత అంత మాట అనే సరికి అక్కడున్నవారంతా ఒక్క నిముషంపాటు ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ, వెంటనే తేరుకుని మీరే మా నేతగా ఉండాలని […]
సీఎల్పీ నేత జానారెడ్డిపై కొంతకాలంగా అధికార పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో మాత్రం ఆయన ఈ ప్రచారంపై సీరియస్ అయ్యారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి.. నేను తప్పుకుంటాను అని తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత అంత మాట అనే సరికి అక్కడున్నవారంతా ఒక్క నిముషంపాటు ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ, వెంటనే తేరుకుని మీరే మా నేతగా ఉండాలని ఆయన్ను కోరారు. అయితే, కాంగ్రెస్ లో కీలకస్థానంలో ఉన్న ఓ నేత ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ఆ వ్యతిరేకతతోనే జానారెడ్డి అధికార పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం చేయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.
జానారెడ్డి పార్టీలో చాలా సీనియర్.. అధిష్టానానికి నమ్మినబంటు. అలాంటి నేతను పార్టీ నుంచి సాగనంపాల్సిన అవసరం ఆ నేతకు ఎందుకు వచ్చింది? అన్న విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో జానారెడ్డి లేకపోతే.. ఎక్కువగా లాభం పొందేది ఎవరు? అన్న చర్చ కూడా జోరందుకుంది. అసెంబ్లీలో ఆయన ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే.. నిర్మాణాత్మక సూచనలు చేస్తూ.. పెద్దమనిషిగా తన ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు జానారెడ్డి. అయితే, ఇది కొందరికి నచ్చడం లేదు. అదేవిధంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎవరికీ ఇవ్వనంత గౌరవం కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఇస్తున్నారన్నది అందరికీ తెలిసిందే! జానారెడ్డి వద్ద తాను పనిచేశానని కేసీఆర్ స్వయంగా చాలాసార్లు అసెంబ్లీలోనే చెప్పుకున్నారు. వీటన్నింటనీ బేరీజు వేసుకున్న ఓ కీలక నేత జానారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం మొదలుపెట్టారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు రాజధానిలో రూ.5ల భోజనం బాగుందని జానారెడ్డి స్వయంగా ప్రకటించడం పార్టీకి నష్టం చేకూర్చిందని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. వరుసగా వస్తోన్న ఇలాంటి విమర్శలతో విసిగిపోయిన జానారెడ్డి సదరు నేత తీరుపై ఆగ్రహంగా ఉనట్లు సమాచారం. ఈ విషయం ఇక్కడితో సద్దుమణుగుతుందా? లేదా అధిష్టానం దాకా పోతుందా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.