Telugu Global
Others

పండ‌గ చేసుకుంటున్న మ‌ర్రి!

మ‌న‌కు ద‌క్కంది ప‌క్క‌వాడికి ద‌క్కితే.. అసూయ ప‌డ‌తాం..కానీ, మ‌న‌మంటే ప‌డ‌నివాడికి ప‌ర‌ప‌తి త‌గ్గితే పండ‌గ చేసుకుంటాం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నారు. ఇంత‌కీ మ‌ర్రి ఎందుకు పండ‌గ చేసుకున్నారో తెలుసా? ఇంకెందుకు ఇటీవ‌ల తెలంగాణ కేబినెట్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మ‌ర్రి ప్ర‌త్య‌ర్థి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ శాఖ‌లో కోత విధించారు కేసీఆర్‌. ఆయ‌న‌ను ఎంతో కీల‌క‌మైన వాణిజ్య ప‌న్నుల శాఖ నుంచి త‌ప్పించారు […]

పండ‌గ చేసుకుంటున్న మ‌ర్రి!
X
మ‌న‌కు ద‌క్కంది ప‌క్క‌వాడికి ద‌క్కితే.. అసూయ ప‌డ‌తాం..కానీ, మ‌న‌మంటే ప‌డ‌నివాడికి ప‌ర‌ప‌తి త‌గ్గితే పండ‌గ చేసుకుంటాం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నారు. ఇంత‌కీ మ‌ర్రి ఎందుకు పండ‌గ చేసుకున్నారో తెలుసా? ఇంకెందుకు ఇటీవ‌ల తెలంగాణ కేబినెట్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మ‌ర్రి ప్ర‌త్య‌ర్థి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ శాఖ‌లో కోత విధించారు కేసీఆర్‌. ఆయ‌న‌ను ఎంతో కీల‌క‌మైన వాణిజ్య ప‌న్నుల శాఖ నుంచి త‌ప్పించారు సీఎం. ఇప్పుడు ఇదే వార్త మ‌ర్రి శ‌శిధ‌ర్ ఆనందానికి కార‌ణం. ఈ విష‌యం ఆయ‌న చెవిన ప‌డిన వెంట‌నే ఆయ‌న విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులను వేధించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాఖ మార్చడం సంతోషకరమని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మర్రి హితవు పలికారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున తలసాని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి మంత్రి నుంచి ఆ శాఖను తీసేయడం ద్వారా వ్యాపారులకు మేలు చేసినట్లయిందన్నారు.
మ‌ర్రికి అంత కోపం ఎందుకంటే..?
2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి మ‌ర్రి, టీడీపీ నుంచి త‌ల‌సాని పోటీ చేశారు. ఈ పోటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మ‌ర్రిని త‌ల‌సాని ఓడించారు. త‌రువాత త‌ల‌సాని అధికార పార్టీలో చేరి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. దీంతో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పార్టీ మారి, మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ల‌సాని శాస‌న‌స‌భ అభ్య‌ర్థిత్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్ తో మ‌ర్రి ఓ ఉద్య‌మ‌మే న‌డిపార‌ని చెప్పుకోవాలి. ఇందుకోసం ఆయ‌న శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. స్పీక‌ర్‌, గ‌వ‌ర్న‌ర్‌.. ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ ఇలా త‌ల‌సానిని బ‌ర్త‌ర‌ఫ్ చేసేందుకు ఆయ‌న ఎక్క‌ని గ‌డ‌ప లేదు, చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయితే, మ‌ర్రి దుర‌దృష్ట‌మో.. త‌ల‌సాని అదృష్ట‌మో గానీ త‌ల‌సాని రాజీనామా చేసినా స్పీక‌ర్ ఆమోదించ‌లేదు. ఈలోపు టీటీడీపీ టీఆర్ ఎస్‌లో విలీనం పూర్త‌యింది. దీంతో త‌ల‌సాని రాజీనామా చేసే అవ‌స‌రం లేక‌పోయింది. ఈ ప‌రిణామం మ‌ర్రికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఒక‌వేళ స‌న‌త్‌న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక వ‌స్తే.. ఇక్క‌డ టీఆర్ ఎస్ గెల‌వ‌ద‌ని, టీడీపీ స‌రైన అభ్య‌ర్థులు లేర‌ని, కాబ‌ట్టి తిరిగి తాను ఎమ్మెల్యేగా గెలుస్తాన‌ని మ‌ర్రి బ‌లంగా విశ్వ‌సించ‌డ‌మే ఇందుకు కార‌ణం. పాపం! మ‌ర్రి క‌ల‌లు నెర‌వేక‌పోయినా.. త‌ల‌సాని శాఖ‌ల్లో కోత ప‌డ‌టం మాత్రం ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని ఆనందాన్ని ఇచ్చింది. అద‌న్న మాట అస‌లు సంగతి!
First Published:  27 April 2016 5:08 AM IST
Next Story