సూర్యుడు సుర సుర...మనం మల మల!
ఎప్పటికప్పుడు ఎండలు మండిపోతున్నాయి… అనుకుంటూనే ఉంటాం కానీ ఈ ఏడాది మాత్రం నిజంగానే ఎండలు మరింతగా మండుతున్నాయి. నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు భూమ్మీదే కాదు, మన ఒంట్లో ఉన్న నీటిని సైతం పీల్చేస్తున్నాడు. వడదెబ్బ కొట్టి ప్రాణాలనూ తీస్తున్నాడు. ఈ ఎండాకాలమన్నాళ్లూ మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండకతప్పదు. ఆ వివరాలివి- చమట ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లిపోయే నీటిని, లవణాలను తిరిగి భర్తీ చేస్తుండాలి. నీడలో ఉన్నా, దాహం వేయకపోయినా తరచుగా […]
ఎప్పటికప్పుడు ఎండలు మండిపోతున్నాయి… అనుకుంటూనే ఉంటాం కానీ ఈ ఏడాది మాత్రం నిజంగానే ఎండలు మరింతగా మండుతున్నాయి. నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు భూమ్మీదే కాదు, మన ఒంట్లో ఉన్న నీటిని సైతం పీల్చేస్తున్నాడు. వడదెబ్బ కొట్టి ప్రాణాలనూ తీస్తున్నాడు. ఈ ఎండాకాలమన్నాళ్లూ మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండకతప్పదు. ఆ వివరాలివి-
- చమట ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లిపోయే నీటిని, లవణాలను తిరిగి భర్తీ చేస్తుండాలి. నీడలో ఉన్నా, దాహం వేయకపోయినా తరచుగా మంచినీళ్లు తాగుతుండాలి.
- ఐదేళ్లలోపు చిన్నారులను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి.
- తీవ్రమైన ఎండ, వడగాలుల్లో తిరిగితే శరీరంలో ఉష్ణోగ్రతని నియంత్రించే వ్యవస్థ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు. శరీరంలో వేడి చమట రూపంలో బయటకు పోక పోవడం వలన శరీరం వేడి పెరిగిపోతుంది. దీన్నే వడదెబ్బ అంటాం
- వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చి, బాగా గాలి ఆడేలా చేయాలి. చల్లని నీళ్లతో ఒళ్లు తుడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్వరం తగ్గించే మాత్రలు ఇవ్వకూడదు, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.
- వేసవిలో కలుషిత నీరు, ఆహారం వ్యాధులను కలుగజేస్తాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి అవుతుంది. తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- ఎండాకాలంలో చమట ద్వారా బ్యాక్టీరియా చర్మం మీద చేరి చాలా ఇబ్బందులు పెడుతుంది. శరీరంలో గాలిఆడని ప్రదేశాల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. శరీరాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోవడం అవసరం.
- సాధ్యమైనంత వరకు బాగా ఎండగా ఉన్నపుడు బయట తిరగకూడదు. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
- ఎండలోకి వెళ్లేముందు సన్‌స్క్రీన్ లోషన్‌ను చర్మానికి రాసుకోవాలి. కూల్ డ్రింక్‌లను పక్కనపెట్టి సహజసిద్ధంగా లభించే నీరు, కొబ్బరినీరు తాగటం మంచిది.
- మానసిక చికిత్స, పార్కిన్‌సన్ వంటి నాడీ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల చెమట పట్టే గుణం తగ్గిపోతుంది. ఫలితంగా ఎండలోకి వెళ్లినప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. అలాగే బిపికి వాడే కొన్ని రకాల టాబ్‌లేట్లలో సైతం ఒంట్లోని నీటిని తగ్గించే గుణం ఉంది. ఇవి డీహైడ్రేషన్‌కి దారితీస్తాయి.
- మూడునుండి నాలుగు లీటర్ల వరకు మంచినీరు తాగాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
- ఎండలోకి వెళితే పలుచని కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లేత రంగులవి, శరీరాన్ని నిండుగా కవర్ చేసేవి ధరించాలి. తలకు టోపి పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
- వేసవిలో ముఖాన్ని తరచుగా చల్లని నీటితో కడుగుతుంటే జిడ్డు తగ్గుతుంది. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోవాలి.
- ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. స్క్రబ్బర్‌లను ఉపయోగించకూడదు. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.
- బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. పిల్లల మెదడులో దాన్ని నియంత్రించే కేంద్రం చాలా బలహీనం వలన వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ.
- ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.