ఇరవై ఏళ్లుగా తల్లిని మోస్తూ తీర్ధయాత్ర!
ఒక్కోసారి మనం నమ్మలేని నిజాలు కళ్లముందుకు వస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించుకుంటూ ఛారాధామ్ యాత్ర చేయాలని ఉందని తల్లి కోరగా ఆ కొడుకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆమె కాలినడకతో యాత్ర చేయాలని ఆశించింది. ముదిమి వయసులో ఉన్న ఆమె అంధురాలు కూడా. తల్లి నడవలేని స్థితిలో ఉన్నా ఆమె కోరిక నెరవేర్చడానికి కొడుకు నడుం బిగించాడు. తల్లిని భుజాన ఒక బుట్టలో మోస్తూ నడకతో యాత్ర మొదలుపెట్టాడు. రాయాయణంలోని ఆనాటి శ్రవణుడికి ఏమాత్రం […]
ఒక్కోసారి మనం నమ్మలేని నిజాలు కళ్లముందుకు వస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించుకుంటూ ఛారాధామ్ యాత్ర చేయాలని ఉందని తల్లి కోరగా ఆ కొడుకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆమె కాలినడకతో యాత్ర చేయాలని ఆశించింది. ముదిమి వయసులో ఉన్న ఆమె అంధురాలు కూడా. తల్లి నడవలేని స్థితిలో ఉన్నా ఆమె కోరిక నెరవేర్చడానికి కొడుకు నడుం బిగించాడు. తల్లిని భుజాన ఒక బుట్టలో మోస్తూ నడకతో యాత్ర మొదలుపెట్టాడు. రాయాయణంలోని ఆనాటి శ్రవణుడికి ఏమాత్రం తీసిపోడు ఈ ఆధునిక శ్రవణుడు. 20ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 36,582 కిలోమీటర్లు నడిచాడు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి చెందిన గిరి అనే వ్యక్తి కథ ఇది. 28 వయసులో ప్రయాణం మొదలుపెట్టిన గిరి ఇప్పుడు 48ఏళ్ల వాడయ్యాడు. ఆయన తల్లి 92 ఏళ్లకు చేరారు. ఎలాగైనా యాత్రని పూర్తి చేసి తల్లికోరిక నెరవేర్చుతానంటున్నాడు గిరి. ప్రస్తుతం వారు బుధవారం మధురలోని బంకే బిహారీ గుడిలో కృష్ణుడిని దర్శించుకుంటున్నారు. మీకు కుటుంబం, కెరీర్ లాంటి ఆశలు లేవా, అనే ప్రశ్నకు సమాధానంగా గిరి, తన రాత వేరుగా ఉందన్నాడు. తాను 14ఏళ్ల వయసులో చెట్టునుండి పడిపోయి తీవ్రంగా గాయపడ్డానని, తల్లి ప్రార్థనలతోనే కోలుకున్నానని, ఈ జన్మ ఆమెకే అంకితమని చెప్పాడు. తన సోదరుడు, సోదరి, తండ్రి అందరూ మరణించారని, తల్లికి తానొక్కడే మిగిలానని తెలిపాడు. అందరూ తనని శ్రవణుడు అని పిలుస్తారని, తనకది నచ్చదని అంటున్నాడతను. రోజుకి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల వరకు నడుస్తూ ఇప్పటివరకు కాశీ, అయోధ్య, చిత్రకూట్, రామేశ్వరం, తిరుపతి, పూరి, నేపాల్ లోని జనక్‌పూర్, కేదార్‌నాథ్, రిషేకేశ్వర్ హరిద్వార్ తదితర పుణ్యక్షేత్రాలను గిరి తల్లితో పాటు దర్శించాడు. ఈ దేశంలో మనుషులు అద్భుతమైన వారని, ఏ స్వార్థం లేకుండా తనకు సహాయం చేస్తున్నారని గిరి అంటున్నాడు. ఏది ఏమైనా అతని తల్లిది దైవభక్తి అయితే, అతనిది మాతృభక్తి అనక తప్పదు.