చిక్కిపోవాలనుకుంటున్నారా...శనక్కాయలు తినండి!
బరువు తగ్గాలనుకుంటే వేరు శనక్కాయలను ఎక్కువగా తినండి అంటున్నారు పరిశోధకులు. వారానికి మూడు నుండి నాలుగుసార్లు పల్లీలు, పీనట్ బటర్‌ని స్నాక్స్‌గా తీసుకుంటూ ఉంటే అవి బరువుని తగ్గించడంలో సహాయం చేస్తాయని వారు చెబుతున్నారు. పల్లీలలో ప్రొటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన వాటిని తిన్నపుడు కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అంతేకాదు, ఇవి చాలా సమయంపాటు ఆకలిని నియంత్రిస్తాయి. పైగా వీటిలో పోషకవిలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. అధికబరువు, ఒబేసిటీకి గురయ్యే అవకాశం ఎక్కువగా […]
బరువు తగ్గాలనుకుంటే వేరు శనక్కాయలను ఎక్కువగా తినండి అంటున్నారు పరిశోధకులు. వారానికి మూడు నుండి నాలుగుసార్లు పల్లీలు, పీనట్ బటర్‌ని స్నాక్స్‌గా తీసుకుంటూ ఉంటే అవి బరువుని తగ్గించడంలో సహాయం చేస్తాయని వారు చెబుతున్నారు. పల్లీలలో ప్రొటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన వాటిని తిన్నపుడు కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అంతేకాదు, ఇవి చాలా సమయంపాటు ఆకలిని నియంత్రిస్తాయి. పైగా వీటిలో పోషకవిలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. అధికబరువు, ఒబేసిటీకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న టీనేజర్లు పల్లీలను అధికంగా తీసుకున్నపుడు వారి బాడీమాస్ ఇండెక్స్ గణనీయంగా తగ్గినట్టుగా గుర్తించారు. అమెరికాలోని హూస్టన్ యూనివర్శిటీకి చెందిన క్రింగ్ జాన్‌స్టన్ ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. టీనేజర్లలో చిరుతిండి అలవాటు ఎక్కువగా ఉంటుందని, ఆ చిరుతిండి ఆరోగ్యకరంగా ఉంటే ఒబేసిటీ సమస్యని నివారించవచ్చని ఈ పరిశోధకులు చెబుతున్నారు.
257మంది టీనేజి పిల్లలమీద 12 వారాలపాటు అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగంమందికి వారానికి మూడునుండి నాలుగుసార్లు స్నాక్స్‌గా పల్లీలు, పీనట్ బటర్ ఇచ్చారు. మిగిలినవారికి వారానికి ఒకసారి, అంతకంటే తక్కువ సార్లు వీటిని ఇచ్చారు. రెగ్యులర్‌గా పల్లీలను తిన్నపిల్లల్లో బాడీమాస్ ఇండెక్స్, మిగిలిన పిల్లల్లో కంటే ఎక్కువగా తగ్గినట్టుగా గుర్తించారు. అనారోగ్యకరమైన చిరుతిండికంటే పిల్లలకు వీటిని అలవాటు చేస్తే మంచి ప్రయోజనం పొందవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.