పసితనంలోనే తెలిసిపోతుంది...ఆ సంగతి!
భవిష్యత్తులో పిల్లలు బరువు పెరుగుతారా లేదా అనే విషయాన్ని పసితనంలోనే గుర్తించవచ్చంటున్నారు మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన సిఎస్ మాట్ చిల్డ్రన్ హాస్పటల్ వైద్య నిపుణులు. ఈ విషయంపై అధ్యయనాన్ని నిర్వహించిన జూలీ సి లుమెంగ్ ఆ వివరాలను వెల్లడించారు. కడుపునిండా ఆహారం పెట్టినా, తిరిగి చిరుతిండి, అదీ తీపి చిరుతిండిని పిల్లలు ఇష్టంగా తింటున్నారంటే, వారు పెద్దయ్యాక ఒబేసిటీకి గురవుతారని చెప్పవచ్చని జూలీ అంటున్నారు. ఉప్పటి, రుచికరమైన ఆహారాన్ని కాదని, పిల్లలు పొట్ట నిండాక కూడా తీపి […]
భవిష్యత్తులో పిల్లలు బరువు పెరుగుతారా లేదా అనే విషయాన్ని పసితనంలోనే గుర్తించవచ్చంటున్నారు మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన సిఎస్ మాట్ చిల్డ్రన్ హాస్పటల్ వైద్య నిపుణులు. ఈ విషయంపై అధ్యయనాన్ని నిర్వహించిన జూలీ సి లుమెంగ్ ఆ వివరాలను వెల్లడించారు. కడుపునిండా ఆహారం పెట్టినా, తిరిగి చిరుతిండి, అదీ తీపి చిరుతిండిని పిల్లలు ఇష్టంగా తింటున్నారంటే, వారు పెద్దయ్యాక ఒబేసిటీకి గురవుతారని చెప్పవచ్చని జూలీ అంటున్నారు. ఉప్పటి, రుచికరమైన ఆహారాన్ని కాదని, పిల్లలు పొట్ట నిండాక కూడా తీపి పదార్థాలనే తింటుంటే వారిలో బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టేనని ఆమె తెలిపారు. ఆకలి లేకపోయినా తినటం అనేది ఇప్పటివరకు పెద్దపిల్లల్లోనే చూశామని, కానీ ఈ అలవాటు చాలా చిన్న వయసు నుండే పిల్లల్లో మొదలవుతుందని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ అధ్యయనం కోసం 209మంది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారికి ఆహారం ఇవ్వాల్సిన సమయం కంటే ఒక గంట ఆలస్యంగా కడుపు నిండా ఆహారం పెట్టి, తరువాత వారిముందు చాక్‌లెట్స్ లాంటి తీపి పదార్థాలు, ఆలూ చిప్స్ లాంటి మామూలు స్నాక్స్ ఉంచారు. పిల్లలు వాటిని తీసుకుని తినే విధంగా అందుబాటులో ఉంచారు. ఎక్కువగా తీపిపదార్థాలను తిని, వాటిని తీసేస్తే ఏడ్చి గోలపెట్టిన చిన్నారులు తరువాత కాలంలో నిదానంగా బరువు పెరిగినట్టుగా గుర్తించారు. మామూలు స్నాక్స్ తిన్న పిల్లల బరువులో అంతగా తేడా కనబడలేదని అధ్యయనంలో తేలింది. ఒకటి నుండి మూడేళ్ల వయసున్న చిన్నారులను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఆకలిలేకపోయినా తినటం అనే అలవాటు పసితనంలోనే ఉంటుందనీ, అది వయసుతోపాటు పెరుగుతుందని ఈ అధ్యయనవేత్తలు అంటున్నారు.
పిల్లల్లో ఆ అలవాటు పెరగకుండా చూసుకుంటే వారిలో ఒబేసిటీ సమస్యని చిన్నతనంలోనే అడ్డుకున్నవాళ్లమవుతామని జూలీ సలహా ఇస్తున్నారు. చాలా చిన్నవయసులోనే పిల్లల ఆహార అలవాట్లను, భవిష్యత్తు బరువు సమస్యని తెలుసుకునే వీలు కల్పించిన ఈ అధ్యయనం నిజంగా ప్రయోజనకరమైందే.