చిట్టెం కారెక్కడం వెనక ఏం జరిగింది?
గులాబీ పార్టీలోకి మరో ఎమ్మెల్యే వచ్చి చేరాడు. ఈసారి కారెక్కింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడం విశేషం. మహబూబ్ నగర్ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం గులాబీ గూటికి చేరాడు. ఈయన టీఆర్ ఎస్ పార్టీ పేరు వింటేనే.. ఒంటికాలిపై లేచే.. కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణకు తమ్ముడు కావడం విశేషం. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నానని ఆయన వివరణ ఇచ్చుకున్నా.. తెరవెనక కథ వేరే ఏదో ఉందని […]
గులాబీ పార్టీలోకి మరో ఎమ్మెల్యే వచ్చి చేరాడు. ఈసారి కారెక్కింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడం విశేషం. మహబూబ్ నగర్ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం గులాబీ గూటికి చేరాడు. ఈయన టీఆర్ ఎస్ పార్టీ పేరు వింటేనే.. ఒంటికాలిపై లేచే.. కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణకు తమ్ముడు కావడం విశేషం. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నానని ఆయన వివరణ ఇచ్చుకున్నా.. తెరవెనక కథ వేరే ఏదో ఉందని చెప్పుకుంటున్నారు. చిట్టెం గెలిచినప్పటి నుంచి ఏనాడూ అధికార పార్టీని విమర్శించింది లేదు. గత రెండు నెలలుగా చిట్టెంతోపాటు, ఆయన సోదరి డీకే అరుణ కూడా పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. దీన్ని డీకే ఖండించగా.. చిట్టెం ఏమీ మాట్లాడకపోవడం అనుమానాలు అప్పట్లోనే తలెత్తాయి. తాజా చేరికతో ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది ఆగస్టు 15న నర్సిరెడ్డితోపాటు అతని చిన్న కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఏ పార్టీ పోటీకి దిగకపోవడంతో రామ్మోహన్ రెడ్డి సులభంగానే గెలిచారు. 2009లో ఓడినా.. 2014లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచినప్పటి నుంచి ఆయన ఏనాడు టీఆర్ ఎస్ ను గాని, కేసీఆర్‌ను విమర్శించలేదు. దీనికి కారణం మక్తల్ నియోజకవర్గ టీ ఆర్ ఎస్ ఇన్ ఛార్జి, కేసీఆర్‌కు ఆప్తుడు అయిన దేవర మల్లప్ప! అయన మొదటి నుంచి రామ్మోహన్ రెడ్డితో సఖ్యతతోనే మెదులుతున్నారు. ఆ సఖ్యతే రామ్మోహన్‌రెడ్డిని కారెక్కేలా చేసిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నారాయణ పేట టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి కారెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చిట్టెం చేరికతో పాలమూరులో కారు బలం 9కి చేరింది.