సీటు గొడవ... ఎమ్మెల్యే గారు గంట రైలు ఆపారు!
సీటు అనే పదానికి రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే నాయకుల దృష్టిలో సీటు అంటే పదవే. అందుకేనేమో శివసేవ ఎమ్మెల్యే ఒకరు రైల్లో తాను కోరుకున్న సీటుని ఇవ్వనందుకు అలిగి దాదాపు గంటపాటు రైలుని ఆపేశారు. ఆ ఒక్క సీటు కారణంగా మొత్తం 2వేలమంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో బుధవారం రాత్రి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కి ఈ చిక్కులు ఎదురయ్యాయి. ఈ బండికి విఐపీల కోసం ప్రత్యేకంగా రెండవ ఎసి […]
సీటు అనే పదానికి రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే నాయకుల దృష్టిలో సీటు అంటే పదవే. అందుకేనేమో శివసేవ ఎమ్మెల్యే ఒకరు రైల్లో తాను కోరుకున్న సీటుని ఇవ్వనందుకు అలిగి దాదాపు గంటపాటు రైలుని ఆపేశారు. ఆ ఒక్క సీటు కారణంగా మొత్తం 2వేలమంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో బుధవారం రాత్రి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కి ఈ చిక్కులు ఎదురయ్యాయి. ఈ బండికి విఐపీల కోసం ప్రత్యేకంగా రెండవ ఎసి కోచ్‌ని తగిలించి, అందులో శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్‌కి ఆయన అనుచరుడికి బెర్తులు ఇచ్చారు. అయితే తమకు కేటాయించిన 35, 36 నెంబర్ల సైడు బెర్తులు వద్దంటూ హేమంత్ పాటిల్ భీష్మించడంతో గొడవ మొదలైంది. ఎవరో చైన్ లాగటంతో రైలు ఆగిపోయింది. అప్పటికే 9.10 కి బయలుదేరాల్సిన రైలు 9.57కి బయలుదేరింది. తిరిగి మరొకసారి ఆగి 10.06కి కదిలింది. ఈగొడవ కారణంగా మరో రెండు రైళ్లు మంగలూరు ఎక్స్‌ప్రెస్, సిద్ధేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా పావుగంటకంటే ఎక్కువ సమయం నిలిచిపోయాయి. ఫ్లాట్‌ఫాముల మీద దాదాపు 1000 మంది జనం గుమిగూడటంతో నాలుగు లోకల్ రైళ్లు కూడా ఆగిపోయాయి.
ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతామని సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ ప్రకటించారు. దీనిపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక మామూలు ప్రయాణీకుడు ఇలా చేస్తే జైలుకి పంపేవారు… కానీ ఒక ప్రజా ప్రతినిధి మాత్రం ఇలా చేయవచ్చా అంటూ కొందరు ప్రశ్నించారు. చట్టాలన్నీ సాధారణ మనుషులుకేనా వీరికి వర్తించవా…అంటూ మరికొందరు మండిపడ్డారు. దీనిపై స్పందించాల్సిందిగా శివసేన అధికార ప్రతినిధిని కోరగా ఆయన, ఇదంతా హేమంత్ పాటిల్ సొంత విషయం, దీనిపై పార్టీ ప్రతినిధిగా నేనెలా స్పందిస్తాను అంటూ బదులిచ్చారు.