Telugu Global
Cinema & Entertainment

ఈడోరకం ఆడోరకం సినిమా రివ్యూ

రేటింగ్: 2.25/5 తారాగణం: మంచు విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హెబ్బాపటేల్ దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి సంగీతం: సాయి కార్తీక్ నిర్మాతలు: రామ భ్రమ్మం సుంకర విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2016 కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌తో వున్న చిక్కేమిటంటే, పండితే సూపర్‌, పండకపోతే టెర్రర్‌. ఒకే పోలికతో వున్న ఇద్దరిని చూసి కన్‌ఫ్యూజ్ కావడం షేక్‌స్పియర్‌ తరహా కామెడీ. ఒక మనిషిని ఇంకో మనిషిగా పొరపడ్డం గొగోల్‌ తరహా కామెడీ. 125 ఏళ్ళక్రితం నికొలాయ్‌ గొగోల్‌ రాసిన […]

ఈడోరకం ఆడోరకం సినిమా రివ్యూ
X

రేటింగ్: 2.25/5
తారాగణం:
మంచు విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హెబ్బాపటేల్
దర్శకత్వం: నాగేశ్వర రెడ్డి
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు: రామ భ్రమ్మం సుంకర
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2016

కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌తో వున్న చిక్కేమిటంటే, పండితే సూపర్‌, పండకపోతే టెర్రర్‌. ఒకే పోలికతో వున్న ఇద్దరిని చూసి కన్‌ఫ్యూజ్ కావడం షేక్‌స్పియర్‌ తరహా కామెడీ. ఒక మనిషిని ఇంకో మనిషిగా పొరపడ్డం గొగోల్‌ తరహా కామెడీ. 125 ఏళ్ళక్రితం నికొలాయ్‌ గొగోల్‌ రాసిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నాటకం దీనికి ఉదాహరణ. అన్ని రకాల కామెడీలను ప్రపంచమంతా రుద్దిరుద్ది వదిలేసింది. కొత్త కథలను సృష్టించడం కష్టంగా మారిపోతోంది. సీన్స్‌ కాస్త కొత్తగా రాసుకుని చెయ్యితిరిగిన నటులతో సినిమాని పండించాలి.

ఈడోరకం, ఆడోరకం సినిమాకి కావాల్సినంత అంగబలం వుంది. కామెడీలు తీయడంలో ఆరితేరిన నాగేశ్వరరెడ్డి (దర్శకుడు), కామెడీలో గొప్పటైమింగ్‌ వున్న రాజేంద్రప్రసాద్‌, గతంలో కామెడీ హిట్స్‌ కొట్టిన విష్ణు, యూత్‌లో ఫాలోయింగ్‌ వున్న రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌, ప్రాసలు పంచ్‌లతో కామెడీ పండించే డైమండ్‌ రత్నబాబు (డైలాగ్స్‌), ఇంతమంది వున్నా ఈ సినిమా నత్తనడక ఎందుకు నడిచిందంటే క్యారెక్టర్స్‌ పండకపోవడం వల్ల.

ఏ ఒక్క క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి రిజిస్టర్‌ కాకపోతే డిస్కనెక్ట్‌ అవుతారు. కథ గురించి చెప్పాలంటే రాజేంద్రప్రసాద్‌ ఒక లాయర్‌. ఆయనకి రవిబాబు, విష్ణు ఇద్దరు కొడుకులు. విష్ణు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి ఒక అనాధని పెళ్ళి చేసుకోవాలని కోరిక. ఎందుకంటే ఆమె అక్కని అత్తామామలు హింసించి చంపుంటారు కాబట్టి. ఆ అమ్మాయి అన్న ఒక రౌడీ. అతని దగ్గర పెళ్ళి ప్రస్తావన తెచ్చిన వెంటనే అప్పటి కప్పుడే పెళ్ళి చేసేస్తాడు. విష్ణు భార్య ఇల్లు వెతికే క్రమంలో రాజేంద్రప్రసాద్‌ ఇంటినే అద్దెకు తీసుకుంటుంది.

ఈ గండం గట్టెక్కించడానికి రాజ్‌తరుణ్‌ని తన భార్యకి భర్తగా విష్ణు తన ఇంట్లో పరిచయం చేస్తాడు. పైన వున్నది తన కోడలని, రాజేంద్రప్రసాద్‌కి కిందవున్నది తన భర్త కుటుంబమని హీరోయిన్‌కి తెలియదు. ఇలావుంటే రాజ్‌తరుణ్‌ హెబ్బాపటేల్‌ని పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. హెబ్బా వాళ్ళ అన్నకూడా రౌడీ. వాడిని నమ్మించడానికి రాజ్‌తరుణ్‌ తన తండ్రి రాజేంద్రప్రసాదని బెబుతాడు. ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాడు కూడా.

రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో జరిగే కామెడీ ఆఫ్‌ ఎర్రర్సే సినిమా. వాస్తవానికి ఇలాంటి సినిమాలు ఇప్పటికే జనం చాలా చూసేసారు. మోహన్‌బాబు సినిమాలే రెండుమూడున్నాయి (అల్లరిమొగుడు, అప్పుచేసి తప్పుకూడు) పాతకథనే చెబుతున్నపుడు స్క్రీన్‌ప్లే అయినా కొత్తగా వుండాలి. కానీ అది మిస్సయ్యింది. ఇంటర్వెల్‌ వరకూ కథ సరిగా టేకాఫేకాదు. ఇద్దరు రౌడీలు సవాళ్ళు విసురుకునే ఓపెనింగ్‌ సీన్‌తోనే సినిమా చద్దివాసనొచ్చింది. రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో ఇరుక్కుపోవడంతో సినిమా పట్టు తప్పింది.

సినిమాకి లాజిక్‌లతో పనిలేదు. కానీ కిందవున్న విష్ణు నిచ్చెనతో తన భార్య దగ్గరికి చేరుకోవడం బానేవుంది. అయితే అంతసేపు రాజ్‌తరుణ్‌ సోనారిక కంటపడకుండా పై పోర్షన్‌లో ఎలా వున్నట్టు? దీన్నే సినిమా లిబర్టీ అంటారు. కథలో స్పీడ్‌లేకపోవడం వల్ల, నాటకీయంగా వుండడంవల్ల విష్ణు, రాజ్‌తరుణ్‌ ఎనర్జీస్‌ వేస్టయ్యాయి. కుమారి 21 F తో యూత్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న హెబ్బాపటేల్‌కి నటించే అవకాశమే లేదు. పాటలు బాగా చిత్రీకరించే డైరెక్టర్‌, ఎందుకో ఒక పాటనే బాగా తీశాడు. డైమండ్‌ రత్నబాబు డైలాగ్‌లు చాలాచోట్ల బావున్నాయి. (ఒకటి రెండుచోట్ల బూతు ధ్వనించినా) ఈ సినిమాలో వున్న ఫ్లస్‌పాయింట్‌ ఏమంటే నిడివి రెండుగంటలే వుండడం.

ఈ కథని పంజాబ్‌నుంచి తెచ్చుకున్నారని తెలిసింది. షేక్‌స్పియర్‌ నాటకాలు సరిగ్గా చదివితే కృష్ణానగర్‌లోనే బోలెడు తయారు చేయొచ్చు.

– జి ఆర్‌. మహర్షి

First Published:  14 April 2016 2:36 AM GMT
Next Story