ఆధార్ చాలు... అందం అక్కర్లేదు!
ప్రభుత్వం ప్రకటించే పథకాలు, విధానాలు ఏవైనా… అవి ప్రజల వరకు చేరేసరికి వాటి చుట్టూ పలు అనవసరమైన అనుమానాలు, సందేహాలు చేరతాయి. అలాగే జనంలో ఏర్పడిన భయాలను సొమ్ము చేసుకునేవారూ బయలుదేరతారు. ఆధార్ కార్డుల విషయంలోనూ ఇలాంటి ఒక అపోహ జనంలో ఉంది. దాని గురించి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) డైరక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండే. ఆధార్ గుర్తింపు పత్రం…తప్పనిసరిగా ప్లాస్టిక్ కార్డుమీదే ఉండాలని, లామినేషన్ చేయించి ఉండాలని… […]
ప్రభుత్వం ప్రకటించే పథకాలు, విధానాలు ఏవైనా… అవి ప్రజల వరకు చేరేసరికి వాటి చుట్టూ పలు అనవసరమైన అనుమానాలు, సందేహాలు చేరతాయి. అలాగే జనంలో ఏర్పడిన భయాలను సొమ్ము చేసుకునేవారూ బయలుదేరతారు. ఆధార్ కార్డుల విషయంలోనూ ఇలాంటి ఒక అపోహ జనంలో ఉంది. దాని గురించి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) డైరక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండే.
ఆధార్ గుర్తింపు పత్రం…తప్పనిసరిగా ప్లాస్టిక్ కార్డుమీదే ఉండాలని, లామినేషన్ చేయించి ఉండాలని… చెబుతూ కొంతమంది దాన్ని విస్తృత వ్యాపారంగా మార్చేశారు. ప్లాస్టిక్ కార్డుమీద ఆధార్ ఐడిని ముద్రించి 200 రూ.ల వరకు వసూలు చేయడం జరుగుతోంది. దీనిపై స్పందించిన అజయ్ భూషణ్, ఆధార్ గుర్తింపు పత్రం అనేది నలుపు తెలుపు రంగుల్లో ఒక తెల్ల పేపరుమీద ఉన్నా అది అధికారికంగా చెల్లుబాటు అవుతుందని, రంగుల్లో, ప్లాస్టిక్ కార్డుల మీద ముద్రించడం, లామినేషన్ చేయించడం లాంటివి అవసరం లేదని అన్నారు. ఇలా చేసి వాటిని స్మార్ట్ ఆధార్ కార్డులుగా పిలుస్తున్నారని, ఆధార్ కార్డుల్లో స్మార్ట్ కార్డులంటూ వేరే లేవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకవేళ ఎవరన్నా తమ ఆధార్ కార్డుకి అలాంటి హంగులు కావాలని అనుకున్నా వారు అధికారిక ధృవీకరణ ఉన్న సర్వీస్ సెంటర్లలో లేదా ఆధార్ పర్మనెంట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో చేయించుకోవాలని, అక్కడ ఇందుకోసం 30 రూ.లకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చి, వీటికి 50 నుండి 200 రూ.ల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈబే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థల పేర్లని ఉపయోగించుకుని కొంతమంది వ్యాపారులు ఈ పని చేస్తున్నారని, ఆయా సంస్థలు అలాంటి వారికి సహకరించవద్దని, అలా చేస్తే చట్ట విరుద్ధమవుతుందని, ఇందుకు తగిన శిక్ష ఉంటుందని అజయ్ భూషణ్ పాండ్యా హెచ్చరించారు.