తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జగ్గారెడ్డి!
తరుచుగా వివాదాల్లో నిలిచే మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారన్న వార్తలే ఇందుకు కారణం. తెలంగాణలో కేసీఆర్ అన్నా.. ఆయన పార్టీ అన్నా ఒంటికాలిపై లేచే ఏకైక నేతగా గుర్తింపు పొందారు. అయితే, ఈ వార్తలను జగ్గారెడ్డి ఖండిస్తున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన టీఆర్ ఎస్‌లో కి చేరతారన్న ప్రచారం జోరుగా […]
తరుచుగా వివాదాల్లో నిలిచే మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారన్న వార్తలే ఇందుకు కారణం. తెలంగాణలో కేసీఆర్ అన్నా.. ఆయన పార్టీ అన్నా ఒంటికాలిపై లేచే ఏకైక నేతగా గుర్తింపు పొందారు. అయితే, ఈ వార్తలను జగ్గారెడ్డి ఖండిస్తున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన టీఆర్ ఎస్‌లో కి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్‌ను నానా మాటలు అన్న నేతను ఇప్పుడు పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
పార్టీలు మారడం ఆయనకు చిటికెలో పని!
తూర్పు జయప్రకాశ్ రెడ్డి.. ఉమ్మడి ఏపీలోనే వివాదాలతో సావాసం చేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీఆ ర్ ఎస్ పేరు చెబితే అంతెత్తున లేచే జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే మొదలైంది. తరువాత పార్టీ మారి 2004లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ నుంచి తిరుగుబాటు లేవదీసి అధికార కాంగ్రెస్ పంచన చేరిన తొలి ఎమ్మెల్యే కూడా ఇతనే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ టికెట్‌తో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. సమైక్య నినాదంతో పోటీ చేసి 2014 ఎన్నికల్లో మట్టికరిచారు. అవే ఎన్నికల్లో సికింద్రాబాద్ లో ఓటర్లకు కానుకలు పంచుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఆ తరువాత మెదక్ పార్లమెంటు స్థానానికి సీఎం కేసీఆర్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి పోటీ చేయాలని అనుకున్నారు. వెంటనే వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాన్ ద్వారా బీజేపీలో చేరారు. తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెబుతూ ఎంపీ టికెట్ సాధించారు. కానీ, ఓడిపోయారు. తరువాత, వెంటనే కాంగ్రెస్‌లోకి మరోసారి జంప్ చేశారు. తరువాత నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానానికి కూడా పోటీ చేస్తారని.. అనుకున్నారంతా. కానీ అలా ఏం జరగలేదు. ఇప్పుడు ఆయన టీఆ ర్ ఎస్‌లో కి వెళతారన్నా.. ప్రజలకు వింతగా ఏమీ అనిపించడం లేదు. కాకుంటే సీఎంను ఇష్టానుసారంగా దూషించి ఇప్పుడు పార్టీలోకి వస్తానంటే.. సహించేది లేదని కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.