గన్స్, గట్స్, ఫట్స్ " 2
రేటింగ్: 2/5 తారాగణం: పవన్‌కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ ఖేల్‌కర్, ముఖేష్ రిషి, అలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సంజన, ఊర్వశి తదితరులు దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ) సంగీతం: దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు: శరత్ మరార్, సునీల్ లుల్లా విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2016 కితోనే ఆద్మీతే పూరా బీస్ లాఖ్ సర్కార్ ఈ డైలాగ్ మీకేమైనా అర్థమైందా? రాసిననేరానికి అర్థాన్ని వివరించడం కూడా నేనే చేయాలి. మొత్తం ఎంతమంది? పూర్తిగా 20 లక్షలమంది అంటే ఈ […]
రేటింగ్: 2/5
తారాగణం: పవన్‌కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ ఖేల్‌కర్, ముఖేష్ రిషి, అలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సంజన, ఊర్వశి తదితరులు
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాతలు: శరత్ మరార్, సునీల్ లుల్లా
విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2016
కితోనే ఆద్మీతే
పూరా బీస్ లాఖ్ సర్కార్
ఈ డైలాగ్ మీకేమైనా అర్థమైందా? రాసిననేరానికి అర్థాన్ని వివరించడం కూడా నేనే చేయాలి.
మొత్తం ఎంతమంది?
పూర్తిగా 20 లక్షలమంది
అంటే ఈ రోజు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమంది చూసుంటారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా వుండొచ్చు. లేదా తగ్గచ్చు. బలైపోయిన వాళ్ళ సంఖ్యతో మనకెందుకు చర్చ? పవన్‌కళ్యాణ్ పైన ఇష్టంతో ప్రేమతో వెళ్ళిన వాళ్ళకి పూర్తి స్థాయి సినిమా చూపించి గన్‌తో ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేశాడు. ఉగాదిరోజు వేపాకు వేసి పచ్చడి తినిపించాడు.
ఏ సినిమా అయినా మొదటి 15 నిముషాల్లో ఆడియన్స్‌కి కనెక్ట్‌కావాలి. కాలేదంటే ఇక కాదని అర్థం. అప్పుడు తెరపైన ఏదో గోల నడుస్తూ వుంటుంది. మనం అసహనంగా కదులుతూ వుంటాం. పవన్‌కో తిక్కుంది, దానికో లెక్కుంది. ఈ సారి లెక్కతప్పి తిక్కే మిగిలింది.
సర్దార్‌లో ఒక్క కొత్త సీన్ కూడా లేదు. పాత వూరగాయని పాతసీసాలో పెట్టి పవన్ లేబిల్ అతికించి విడుదల చేశారు. 276 సినిమాల్లో చూసిన ఈ కథ ఏమంటే రత్తన్ పూర్ అనే ఒక ఊరిలో భైరవసింగ్ అనే దుర్మార్గుడు. వాడికి ఎదురే లేదు. ఆ ఊరికి పవన్ కొత్త సిపి. హీరో వాళ్ళందరిని ఎదుర్కొని విలన్‌ని ఫినిష్ చేస్తాడు. హీరోయిన్ ఆ ఊరి రాణి. హీరోని ప్రేమిస్తుంది. ఇదంతా ఓకే పవన్ స్వంతంగా రచించిన స్క్రీన్‌ప్లే అయినా బావుందా అంటే ఏ సీన్ ఎందుకొస్తుందో ఎవరికీ తెలియదు. స్క్రీన్ ప్రేక్షకులతో ఆడుకోవడమే స్క్రీన్‌ప్లేకి అర్థం కావచ్చు. బోలెడంతమంది విలన్ లు వుంటారు. కమేడియన్లు వుంటారు. అయితే పవన్‌దే షో అంతా. వన్‌మ్యాన్ షో.
ఆలీ, బ్రహ్మానందం, జర్దస్త్ టీం అంతా వున్నప్పటికీ కామెడీ కూడా పవనే చేసేవాడు. ఈ రతన్‌పూర్ స్పెషాలిటీ ఏమంటే అక్కడ యథేచ్చగా తుపాకులతో తిరుగుతూవుంటారు. తుపాకులు అమ్ముతూవుంటారు. కాలుస్తూ వుంటారు. అలాంటివారికి పవన్ సిపిగా వస్తే ఎంత కిక్, థ్రిల్, కామెడీ వుండాలి. అదేమీ లేకుండా స్క్రీన్‌పై ఏదో జరుగుతూ వుంటుంది. దానికితోడు సినిమాలో మూడ్ క్రియేట్‌కాకుండా బ్యాగ్రవుండ్ స్కోర్ దబదబ బాదుతూ వుంటుంది.
సినిమాలో ప్లస్‌పాయింట్లు లేవా అంటే మూడు పాటలు చాలా బావున్నాయి. సినిమా చాలా రిచ్‌గా వుంది. ప్రతి సన్నివేశంలోనూ బోలెడంతమంది జనం వుంటారు. యాక్ట్ చేయడానిక ఎవరికీ అవకాశం లేకపోయినా.
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌లు బావున్నాయి. బుర్రసాయి మాధవ్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. బాబీ దర్శకత్వం గురించి చెప్పేందుకేమీ లేదు. ఆయన ఉత్సవ విగ్రహమని అర్థమైపోతుంది. ఇంత భారీ బడ్జెట్ ఫిల్మ్‌లో సోల్ వుందో మిస్సయిపోయిందో చూసుకునే అవకాశం కూడా ఆయనకి వున్నట్టులేదు.
పవన్ క్రియేటివ్ వర్క్స్ అని టైటిల్స్‌లో వేస్తారుకానీ దీనిలోలేనిదే క్రియేటివిటీ. హీరోలే కథ, స్ర్కీన్‌ప్లే (బహుశా దర్శకత్వం కూడా) చేస్తే వాళ్ళు తమ పాయింట్ ఆఫ్‌వ్యూలో కథ ఆలోచిస్తారు కానీ మిగతా టీం గురించి ఆలోచించరు. ఇక్కడ కూడా అదే జరిగింది. సన్నివేశాలు అల్లుకుంటుపోయారే కానీ కథలో బలాన్ని గురించి పట్టించుకోలేదు.
పవన్‌లో ఒక నటుడేకాదు, ఆదర్శవాది కూడా వున్నారు. ఒక్కడు సమాజాన్ని సినిమాలో మార్చగలడు కానీ నిజ జీవితంలో కాదు. బుల్లెట్‌ని కాల్చడానికి ట్రిగ్గర్‌పై వేలు చాలు. కానీ ఆ తుపాకీని, బుల్లెట్‌ని ఎవరో తయారుచేసి మనకు అమ్మితే తప్ప వేలుని నొక్కలేం.
అభిమానులకు నచ్చితే నచ్చవచ్చుకానీ
ప్రేక్షకులకి మాత్రం ఇది చేదుపచ్చడే.
– జిఆర్. మహర్షి
Click on Image to Read: