నలుపురంగుతో.... ఆమె ఎంతో తెలుపుతోంది!
ఆశయాలు ఉండటం వేరు వాటిని ఆచరణలోకి తేవడం వేరు…అలాంటి ఆచరణ విధానాలే మనుషులను విభిన్నంగా నిలుపుతాయి. పీఎస్ జయ అనే 26ఏళ్ల యువతి ఇప్పుడు సమాజం నుండి అలాంటి గుర్తింపునే పొందుతోంది. సమాజంలో ఉన్న కులవ్యవస్థ, దళితుల పట్ల వివక్ష, అణచివేతలపై జయ నలుపు రంగుతో తన నిరసన బాణాన్ని ఎక్కుపెట్టింది. ఓ ప్రయివేటు ఆర్ట్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఆమె 70 రోజులుగా ముఖానికి నల్లని రంగుని వేసుకుని తిరుగుతోంది. దాన్ని గురించి ప్రశ్నించిన వారిని […]
ఆశయాలు ఉండటం వేరు వాటిని ఆచరణలోకి తేవడం వేరు…అలాంటి ఆచరణ విధానాలే మనుషులను విభిన్నంగా నిలుపుతాయి. పీఎస్ జయ అనే 26ఏళ్ల యువతి ఇప్పుడు సమాజం నుండి అలాంటి గుర్తింపునే పొందుతోంది. సమాజంలో ఉన్న కులవ్యవస్థ, దళితుల పట్ల వివక్ష, అణచివేతలపై జయ నలుపు రంగుతో తన నిరసన బాణాన్ని ఎక్కుపెట్టింది. ఓ ప్రయివేటు ఆర్ట్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్న ఆమె 70 రోజులుగా ముఖానికి నల్లని రంగుని వేసుకుని తిరుగుతోంది. దాన్ని గురించి ప్రశ్నించిన వారిని తన ప్రశ్నలతో కడిగేస్తోంది. నలుపురంగు వేసుకుంటే నష్టమేంటి, నలుపంటే చిన్నచూపేంటి, నల్లగా ఉన్నారని దళితులను దూరంగా పెడతారా…అది న్యాయమేనా… లాంటి ప్రశ్నలను గుప్పిస్తోంది.
దీనిపై స్పందిస్తున్న జనం అభిప్రాయాలను, వారి ఫొటోలను సేకరిస్తోంది. వీటన్నింటినీ కలిపి ఒక డాక్యుమెంటరీ తీసే ఉద్దేశ్యంతో ఉందామె. జయ, కళాకాక్షి అనే ఒక కళాకారుల బృందంలో సభ్యురాలు కూడా. వీరు పలుసామాజిక సమస్యలపై తమ కళారూపాలతో స్పందిస్తున్నారు. జయ ఫైనార్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. తన ఈ వినూత్ననిరసనతో ఆమె నలుపుపై ఉన్న వివక్ష గురించి విస్తృతంగా చర్చిస్తోంది. ఎంతోమంది చేదు అనుభవాలను, గాయాలను తెలుసుకుంటోంది. తెలుపురంగుపై ఉన్న వ్యామోహం ఎంత అర్థం లేనిదో వివరిస్తోంది. కాటుక, ఇతర రంగులతో జయ తన శరీరాన్ని నలుపురంగులోకి మార్చుకుంటోంది. ఆ రంగుని చూసి చాలామంది అది స్కిన్ ఎలర్జీనా, కాకపోతే ఎందుకలా రంగువేసుకున్నావ్ అని అడుగుతున్నారని, వారలా అడగాలన్నదే తన ఉద్దేశమని జయ చెబుతోంది. కేలండర్లలో సైతం తెలుపురంగులో ఉన్న మోడల్స్‌నే చూపిస్తుంటారని ఆ అబ్సెషన్ పోవాలని ఆమె నొక్కి చెబుతోంది.
భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నా సమాజంలో అనేక రకాల వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయని. వాటన్నింటికీ తాను నలుపు రంగుతో నిరసన తెలుపుతున్నానని జయ ప్రకటించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తనని కదిలించి వేసిందని, దళితులపై వివక్షని వ్యతిరేకిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నానని జయ తెలిపింది. దళిత పండుగలు, ఉద్యమాల వివరాలతో ఒక ప్రత్యేక దళిత కేలండర్‌ని తీసుకురానున్నట్టుగా ఆమె తెలిపింది. జనవరి 26న మొదలుపెట్టిన తన నలుపు రంగు ప్రచార కార్యక్రమాన్ని 100రోజుల పాటు అంటే మే 5 వరకు నిర్వహించాలని అనుకుంటున్నట్టుగా జయ తెలిపింది.