ఆడపిల్ల పుట్టలేదని...కన్నకొడుకుని చంపేసింది!
పిల్లలకు ఇది గడ్డు కాలంలా ఉంది. కన్నతల్లులు, తండ్రులే వారిపాలిట కాలయములు అవుతున్నారు. పిల్లలపై ఊహకందని విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముద్దులు మూటగడుతున్నఇరవై అయిదురోజుల బాబుని కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ ప్రాంతంలో జరిగింది. ఆడపిల్లలు పుడితే గగ్గోలు పెడుతున్న తల్లిదండ్రులు ఉంటున్న ఈ రోజుల్లో పూర్ణిమ (30) ఆడపిల్ల కావాలని తపించింది. ఇద్దరు బాబుల తరువాత మూడో కానుపులోనూ అబ్బాయే పుట్టడంతో ఆమె తీవ్రమైన నిరాశానిస్పృహలకు గరయ్యింది. మగబిడ్డని ఎవరికైనా ఇచ్చేసి […]
పిల్లలకు ఇది గడ్డు కాలంలా ఉంది. కన్నతల్లులు, తండ్రులే వారిపాలిట కాలయములు అవుతున్నారు. పిల్లలపై ఊహకందని విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముద్దులు మూటగడుతున్నఇరవై అయిదురోజుల బాబుని కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ ప్రాంతంలో జరిగింది. ఆడపిల్లలు పుడితే గగ్గోలు పెడుతున్న తల్లిదండ్రులు ఉంటున్న ఈ రోజుల్లో పూర్ణిమ (30) ఆడపిల్ల కావాలని తపించింది. ఇద్దరు బాబుల తరువాత మూడో కానుపులోనూ అబ్బాయే పుట్టడంతో ఆమె తీవ్రమైన నిరాశానిస్పృహలకు గరయ్యింది. మగబిడ్డని ఎవరికైనా ఇచ్చేసి ఆడపిల్లను దత్తత తీసుకుందామని ఇంట్లోవారిని అడిగింది. ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఆ కోపాన్నిపసిగుడ్డుమీద చూపించింది. బ్లేడుతో గొంతుకోసం హత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే-
పూర్ణిమకు ధన్‌పాల్ శ్రీధర్ రాజుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి అయిదేళ్ల క్రితం తొలికాన్పులో మగపిల్లవాడు పుట్టి మరణించగా, ప్రస్తుతం నాలుగేళ్ల బాబున్నాడు. మూడో కానుపులో ఆడపిల్ల పుడుతుందని ఆశపడిన పూర్ణిమ… తిరిగి బాబు పుట్టడం, బాబుని మార్చి పాపని దత్తత చేసుకుందామంటే ఇంట్లోవారు ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా నిరాశచెందింది. దాంతో బాబుని చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. బాబుకి వాంతులవుతున్నాయని ఆసుపత్రికి తీసుకువెళదామని భర్తని అడిగింది. తాను బయలుదేరానని, వచ్చి మార్గమధ్యంలో తనను కలుసుకోవాలని కోరింది. అయితే శ్రీధర్ రాజు వచ్చేసరికి దారిలో ఆమె నడిరోడ్డుమీద కూలబడిపోయి కనిపించింది. గొలుసు దొంగలు వచ్చి, దొంగతనానికి ప్రయత్నించారని ఆ పెనుగులాటలో బాబు గొంతుకి గాయమైనట్టు చెప్పింది. శ్రీధర్ రాజు భార్యాబిడ్డలను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తార్నాకలోని ఓ ఆసుపత్రిలో బాబు చికిత్స పొందుతూ మరణించాడు. రాత్రి 11 గంటలకు ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పూర్ణిమ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ బాబు మెడపై ఉన్న గాయం పోలీసులకు అనుమానం కలిగించింది. దాంతో ఆ రాత్రే పూర్ణమ, శ్రీధర్ రాజుల ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో రక్తపు మరకలతో బ్లేడు పడిఉండటం, బాబు దుస్తులు నీళ్లలో నానబెట్టి ఉండటం గమనించారు. పూర్ణిమని విచారించగా నిజం ఒప్పుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఊహించని ఈ ఘాతుకంతో తీవ్రవేదనకు గురయ్యారు. పూర్ణమను పోలీసులు గురువారం అరెస్టు చేయనున్నట్టుగా తెలిసింది.
పసిపిల్లలను హతమార్చుతున్న తల్లులది క్షమించరాని నేరమే, అయితే…ప్రసవం తరువాత కొంతమంది మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాటిపై అవగాహన, వాటిని గుర్తించి, తల్లిని మానసిక సంఘర్షణకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన సంస్కృతిలో కన్నతల్లి అంటే దేవతతో సమానంగా భావిస్తుంటాం. ఇదొక ఉదాత్తభావనే కానీ, దీనివలన మనం వాస్తవాలను అంగీకరించలేకపోతున్నాం. తల్లి కూడా మనుషుల్లోని అన్ని లోపాలూ ఉన్న ఒక మామూలు మనిషన్న సంగతిని మనం అంగీకరిస్తే, కనీసం ఇలాంటి సందర్భాల్లో ఇతర కుటుంబ సభ్యులు కన్నతల్లిని అనుమానించి చిన్నారులను ఆమె నుండి కాపాడే వీలు ఉంటుంది.