కవలల కథ
పూర్వం గజరాత్‌లో విజయపాలుడనే రాజువుండేవాడు. అతనికి ఆరు మంది భార్యలు. కానీ వాళ్ళెవరికీ సంతానం లేదు. తనకు వారసుడు లేడన్న దిగులు రాజుకు పట్టుకుంది. ఒక రోజు మంత్రి వచ్చి మహారాజా! ఒక అందమైన అమ్మాయి వుంది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. మీరా అమ్మాయిని ఏడవ భర్యగా స్వీకరిస్తే దేవుడి దయవల్ల ఆమెకు సంతానం కలగవచ్చేమో. ఆలోచించండి’ అన్నాడు. కొన్నాళ్ళకు ఏడవరాణి పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఒకబ్బాయి ఒకమ్మాయి. వాళ్ళు పుట్టినపుడు రాజు రాజ్యంలో […]
పూర్వం గజరాత్‌లో విజయపాలుడనే రాజువుండేవాడు. అతనికి ఆరు మంది భార్యలు. కానీ వాళ్ళెవరికీ సంతానం లేదు. తనకు వారసుడు లేడన్న దిగులు రాజుకు పట్టుకుంది.
ఒక రోజు మంత్రి వచ్చి మహారాజా! ఒక అందమైన అమ్మాయి వుంది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. మీరా అమ్మాయిని ఏడవ భర్యగా స్వీకరిస్తే దేవుడి దయవల్ల ఆమెకు సంతానం కలగవచ్చేమో. ఆలోచించండి’ అన్నాడు.
కొన్నాళ్ళకు ఏడవరాణి పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఒకబ్బాయి ఒకమ్మాయి. వాళ్ళు పుట్టినపుడు రాజు రాజ్యంలో లేడు. ఏదోపనిమీద పొరుగుదేశం వెళ్ళాడు.
ఆరుమంది రాణులు ఏడవరాణి మీద కక్షపెంచుకున్నారు. ఆమె ప్రసవించినపుడు. ఆ బిడ్డల స్థానంలో రెండు కుక్కపిల్లల్ని పెట్టారు. రాజు తిరిగివచ్చి ఈ సంగతి తెలుసుకుని ఆ వివాహం కుదిర్చిన మంత్రిని పదవినించి తొలిగించాడు. ఏడవరాణిని, ఆమె తల్లిని యింటినించీ తరిమేశాడు.
ఆరుమంది రాణులు ఆ కవలల్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేశారు. నది తీరంలో ఒక సన్యాసివుండేవాడు. స్నానానికి నదిలో దిగినపుడు అతనికి పెట్టె దొరికింది. ఆశ్చర్యపడి పెట్టెలో వున్న యిద్దరు పసిపిల్లల్ని జాగ్రత్తగా పెంచాడు. అబ్బాయికి దిలారాం, అమ్మాయికి చంద్రిక అని పేర్లు పెట్టారు. వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పాడు. విలువిద్య నేర్పాడు. అంతే కాదు వాళ్ళు తనకు ఎలా దొరికారో కూడా చెప్పాడు.
కాలం ఆగదు కదా! ఆ కవలలిద్దరు పెరిగి పెద్దవాళ్లయ్యారు. సన్యాసి వృద్ధుడయ్యాడు. తాను ఎంతో కాలం బ్రతకనని ఆయనకు అనిపించింది. పిల్లలిద్దర్నీ ఒకరోజు దగ్గరికి పిలిచి ‘నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం వచ్చింది. మీ కోసం యిది యిస్తున్నా’ అని ఒక మట్టికుండను యిచ్చాడు.
‘మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కుండ ఆహారాన్నియిస్తుంది. అందువల్ల మీకు ఆకలి అంటూవుండదు.’ అన్నాడు.
ఇంకా ‘రెండు వజ్రాల నిచ్చి వీటిని రుద్దితే యిద్దరు దేవదూతలు ప్రత్యక్షమవుతారు మీరు ఏమనుకుంటే అదియిస్తారు.’ అన్నాడు. కొంత కాలానికి సన్యాసి కన్నుమూశాడు.
దిలారాం, చంద్రిక ఆ వజ్రాల్ని రుద్దారు. దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. కవలలు ‘మమ్మల్ని మేము పుట్టిన చోటికి తీసుకెళ్ళండి’ అన్నారు.
తెల్లటి గుర్రాలు కట్టిన బంగారు రథం సిద్ధమయింది. కవలలు ఆ రథమెక్కారు. ఆ రథం ఆకాశమార్గాన ప్రయాణించింది. మేఘలగుండా సాగింది.
కవలలు ఆ మనోహర దృశ్యాల్ని చూస్తూ ఆహ్లాదకరంగా ప్రయాణించారు.
వాళ్ళనగరానికి వచ్చారు. దేవదూతల సాయంలో అద్భుతమైన భవనం నిర్మించుకుని ఆనందంగా అందులో నివసించారు.
ఒక రోజు దిలారాం రాజును సందర్శించాడు. నగరంలోని ప్రజలందరకు గొప్ప విందుయివ్వాలని సంకల్పించాడు.
‘రాజుగారూ! మీరు మీ ఆస్థానంలోని ప్రముఖలు, మీ నగర వాసులు అందరికీ నేను విందుయివ్వదలచుకున్నాను. దయచేసి మీరు అనుమతించాలి’ అన్నాడు.రాజు దిలారాంను చూసి తెలియని ఆనందాన్ని పొందాడు అతని కోరికను మన్నించాడు.
విందుకు అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. పేదవాడయినా ధనవంతుడయినా అందర్నీ ఆహ్వానించాడు. రకరకాల వంటకాలతో విందు వైభవోపేతంగా సాగింది. సన్యాసియిచ్చిన మట్టి కుండ అడిగినవన్నీ యిచ్చింది. రకరకాల రుచుల్తో విందు అందర్నీ ఆనందపెట్టింది.
సన్యాసి చిన్నప్పుడు నేర్పించిన అందమయిన పాటల్ని మధుర స్వరంతో చంద్రిక ఆలపించింది. ఆమె అద్భుతమయిన పాటలకు అందరూ ఎంతో సంతోషించారు. ఆశీర్వదించారు.
రాజు వచ్చినప్పటి నించీ కవలల్ని కన్నార్పకుండా చూస్తున్నాడు. కాసేపటికి దిలారాంతో ‘మీరెవరు? మీరు ఎక్కడి నించి వచ్చారు? మీ తల్లిదండ్రులెవరు?’ అని అడిగాడు.
దిలారం మా తల్లిదండ్రులెవరోమాకు తెలీదు. మాకు తెలిసిందల్లా మేము ఈ దగ్గర్లో వున్న నదీతీరంలో ఒక సన్యాసికి దొరకాము మేము ఒక పెట్టె లో దొరికామని ఆయన చెప్పారు. ఆయన మమ్మల్ని పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆయన యిటీవలే కన్నుమూశారు అని చెప్పాడు.
విందు ముగిసిన తరువాత రాజు తన అంత:పురానికి తిరిగి వచ్చాడు. తన మంత్రుల్ని పిలిపించి ‘మీరు ఆ కవలల పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు తగిన బహుమానం యిస్తాను’ అన్నాడు.
మంత్రుల పరిశోధన మొదలయింది. అప్పుడు ఏడవరాణి దగ్గర పనిచేసే ఒక చెలికత్తె వాళ్ళకు తటస్థించింది. ఆరుమంది రాణులు అప్పుట్లో ఆమెను పని నుండి తొలగించారు. ఆ చెలికత్తె పేరుచంపా. అప్పటికే ముసలిదయింది. ఆమె జరిగిన విషయమంతా వివరించింది. ఆరుగురు రాణుల కుట్రను బయటపెట్టింది.
కవలల యథార్థ గాథను తెలుసుకుని రాజు పరవశించాడు. వాళ్ళు తన బిడ్డలయినందుకు పొంగిపోయాడు. తను యింటి నుంచి తరిమేసిన భార్యను వెతికి రప్పించాడు. సభ ఏర్పాటు చేసి అందరిముందు తన కొడుక్కి పట్టాభిషేకం చేశాడు. ఆరుమంది రాణులకు దేశ బహిష్కార శిక్ష విధించాడు. దేశంలోని ప్రజలందరూ ఆనందించారు.
– సౌభాగ్య