వెన్నతీయని పాలు...ఆరోగ్యానికి మంచివే!
ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పుకుంటున్నపుడు అందులో తప్పకుండా వెన్నతీసిన పాలు ఉంటాయి. పాలలో వెన్నని తీసేసి వాడితే కొలెస్ట్రాల్ పెరగదని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నమ్ముతుంటాం. కానీ అమెరికాలో నర్సులు తదితర ఆరోగ్య రంగ సిబ్బంది ఈ విషయంమీద నిర్వహించిన ఓ అధ్యయనంలో మన నమ్మకం తప్పని రుజువయ్యేలా ఫలితాలు వచ్చాయి. 3,333మంది మీద 15 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. ఇందులో…వెన్నతీయని పాల ఉత్పత్తులు మూడింటిని ఆహారంలో తీసుకునే అలవాటు ఉన్నవారిలో […]
ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పుకుంటున్నపుడు అందులో తప్పకుండా వెన్నతీసిన పాలు ఉంటాయి. పాలలో వెన్నని తీసేసి వాడితే కొలెస్ట్రాల్ పెరగదని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నమ్ముతుంటాం. కానీ అమెరికాలో నర్సులు తదితర ఆరోగ్య రంగ సిబ్బంది ఈ విషయంమీద నిర్వహించిన ఓ అధ్యయనంలో మన నమ్మకం తప్పని రుజువయ్యేలా ఫలితాలు వచ్చాయి. 3,333మంది మీద 15 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. ఇందులో…వెన్నతీయని పాల ఉత్పత్తులు మూడింటిని ఆహారంలో తీసుకునే అలవాటు ఉన్నవారిలో 46శాతం వరకు మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గిపోయినట్టుగా గుర్తించారు. వెన్నతీసిన కొవ్వు లేని పాలతో తయారైన ఆహారం తీసుకున్నవారిలో ఇలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీన్ని బట్టి ఇకపై కొవ్వులేని పాల ఉత్పత్తులు పూర్తిగా ఆరోగ్యకరమైనవని చెప్పలేమని ఈ అధ్యయన నిర్వాహకులు తెలిపారు.
కొవ్వు ఉత్పత్తులను తగ్గించేవారు ఆ మేరకు కార్బోహైడ్రేట్లు, షుగర్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటారని, అందుకే వారిలో మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకున్న వారిలో మధుమేహం రిస్క్ తగ్గటం గమనించాము కానీ, ఆ కారణంగా వారిలో బరువు పెరగటం చూడలేదని వారంటున్నారు. మరొక అధ్యయనంలో కొవ్వు ఎక్కువగా ఉన్న పాల ఉత్పత్తులను తీసుకున్న 18,438మంది మహిళల్లో అధిక బరువుకి గురయ్యే ప్రమాదం 8శాతం మేరకు తగ్గిపోయినట్టుగా గుర్తించారు. పాలు, వాటి ఉత్పత్తులు అనేవి ఆరోగ్యకరమైన ఆహారం కనుక….ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించే క్రమంలో వీటిని తగ్గించాల్సిన అవసరం లేదని అధ్యయనాన్ని నిర్వహించిన ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ లాంటి వాటి ద్వారా కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వీరు సలహా ఇస్తన్నారు. అయితే పాల ఉత్పత్తుల విషయంలో కల్తీ ప్రమాదం లేకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తుంచుకోవాలి.