ఇదిగో... దైవం చిరునామా!
దేవుడు ఎక్కడున్నాడు…అసలు ఉన్నాడా, లేడా… ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంటారు చాలామంది. కానీ సరిగ్గా చూస్తే దైవం అనే ఉన్నత భావానికి చిరునామాగా నిలిచే సంఘటనలు మనకళ్ల ముందే కనబడతాయి. రెండుకాళ్లు లేకపోయినా అష్టకష్టాలకు ఓర్చి చదువుకుని ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సాధించిన భూపతిని చూసినపుడు ఎవరికైనా అతని సంకల్పంలో దైవం కనబడుతుంది. అడుగడుగునా అతడిని ప్రోత్సహిస్తూ, సహాయం చేస్తూ వచ్చిన ఉపాధ్యాయులు, స్నేహితుల్లోనూ మనకు తప్పకుండా దైవం కనబడుతుంది. చిత్తూరు జిల్లా కెవిబి పురం, రాయపేడు గ్రామానికి […]
దేవుడు ఎక్కడున్నాడు…అసలు ఉన్నాడా, లేడా… ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంటారు చాలామంది. కానీ సరిగ్గా చూస్తే దైవం అనే ఉన్నత భావానికి చిరునామాగా నిలిచే సంఘటనలు మనకళ్ల ముందే కనబడతాయి. రెండుకాళ్లు లేకపోయినా అష్టకష్టాలకు ఓర్చి చదువుకుని ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సాధించిన భూపతిని చూసినపుడు ఎవరికైనా అతని సంకల్పంలో దైవం కనబడుతుంది. అడుగడుగునా అతడిని ప్రోత్సహిస్తూ, సహాయం చేస్తూ వచ్చిన ఉపాధ్యాయులు, స్నేహితుల్లోనూ మనకు తప్పకుండా దైవం కనబడుతుంది. చిత్తూరు జిల్లా కెవిబి పురం, రాయపేడు గ్రామానికి చెందిన భూపతికి ఏడాది వయసు ఉండగా పోలియో సోకి, రెండుకాళ్లు చచ్చుబడి పోయాయి. ఆ తరువాత ఒక యాక్సిడెంటు వలన మరింతగా ఇతరులపై ఆధారపడే పరిస్థితికి చేరాడు భూపతి. అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇన్ని ఆటంకాలు ఎదురైనా ఆలోచల్లో ఉద్భవించే సంకల్పానికి అంగవైకల్యం ఉండదని నిరూపిస్తూ, ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.
భూపతి అర్థకిలోమీటరు పాక్కుంటూ వెళ్లి ప్రాథమిక పాఠశాల చదువు పూర్తి చేశాడు. ఆ తరువాత బస్సులో స్కూలుకి వెళ్లాల్సి వచ్చింది. స్నేహితులు అతడిని బస్సు ఎక్కించడం, దించడం చేసేవారు. 2001లో ఒక యాక్సిడెంటులో అతని కుడికాలు విరిగిపోయింది. మరోకాలు పూర్తిగా స్పృహ కోల్పోయింది. అలాంటి నిస్సహాయ స్థితిలోనూ ట్యూషన్ చెప్పిన మాస్టార్లు, స్నేహితుల సహాయంతో చదువుని కొనసాగించాడు. 2006లో పదో తరగతి 520 మార్కులతో పాసయ్యాడు. ఇంటర్‌లో మరొక స్నేహితుడు మహేష్, భూపతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రెండేళ్ల పాటు భూపతిని వీపుమీద మోసుకుంటూ తీసుకువెళ్లి బస్సులో కూర్చోబెట్టటం, బస్సు దిగాక అదే విధంగా మోసుకువెళ్లి తరగతి గదిలో కూర్చోబెట్టడం, తిరిగి సాయంత్రం అదే విధంగా ఇంటికి తీసుకురావటం. ఇలా మహేష్ రెండేళ్లపాటు భూపతికి అండగా నిలిచాడు. ప్రార్ధించే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న…అన్న మదర్ థెరిస్సా మాటలకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. తరువాత డైట్, టిటిసీ పూర్తిచేసిన భూపతి, గత సంవత్సరం డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాడు. దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు పిజి చేస్తున్నాడు. గ్రూపు-2 అధికారి హోదా సాధించి, ఇతరులకు సహాయం చేయడమే తన ధ్యేయం అంటున్నాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరాశా నిస్పృహలకు గురికాకుండా ఒక మంచి సంకల్పంతో కృషి చేయడం, నిస్సహాయతలో ఉన్నవారికి అండగా నిలిచి సహాయం చేయడం…ఈ రెండూ మహేష్ జీవితాన్ని ముందుకు నడిపించాయి. ఇంతకు మించిన దివ్యత్వం, దైవం ఏముంటుంది.