పొగాకే కాదు...ఏటా లక్ష కోట్లు తగలబెట్టేస్తున్నారు!
భారతదేశంలో పెరిగిపోతున్న పొగాకు వినియోగం ప్రజా ఆరోగ్యాన్ని తగులబెట్టేయడమే కాదు, దేశానికి అదొక ఆర్థిక భారంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) హెచ్చరించింది. దేశంలో ఏటా 1,04,500 కోట్ల రూపాయలు, పొగాకు సంబంధిత వ్యాధుల బారిన పడిన వారి వైద్యానికి ఖర్చవుతోందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. అలాగే ఈ వ్యాధులతో ఏటా పదిలక్షల మంది మరణిస్తున్నారని డబ్ల్యు హెచ్ ఓ ప్రతినిధి హెంక్ బెక్‌డమ్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. సిగరెట్లు, బీడీలు తదితర […]
భారతదేశంలో పెరిగిపోతున్న పొగాకు వినియోగం ప్రజా ఆరోగ్యాన్ని తగులబెట్టేయడమే కాదు, దేశానికి అదొక ఆర్థిక భారంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) హెచ్చరించింది. దేశంలో ఏటా 1,04,500 కోట్ల రూపాయలు, పొగాకు సంబంధిత వ్యాధుల బారిన పడిన వారి వైద్యానికి ఖర్చవుతోందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. అలాగే ఈ వ్యాధులతో ఏటా పదిలక్షల మంది మరణిస్తున్నారని డబ్ల్యు హెచ్ ఓ ప్రతినిధి హెంక్ బెక్‌డమ్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. సిగరెట్లు, బీడీలు తదితర పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికలను పెద్ద సైజులో ముద్రించాలని హెంక్ అన్నారు.
పొగాకు వలన కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నా, పొగాకు వినియోగం తగ్గించాలన్నా అది తప్పనిసరి అని ఆయన అన్నారు. హెచ్చరికల ముద్రణ ఏ పరిమాణంలో ఉండాలి అన్న విషయంపై ఇంకా చర్చలు జరుపుతూ కాలయాపన చేయడం సరైంది కాదని హెంక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీడీలు, పొగ రాని, నమిలే పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికల ముద్రణ విషయంలో జరుగుతున్న తర్జనభర్జనలు ఆందోళన కరమని ఆయన అన్నారు.
పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికల ముద్రణ సైజు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన విధానాలను అమలుచేస్తున్నామని భారత్ అంటున్నా అది సక్రమంగా జరగటం లేదు. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల ఉపరితలంపై ఒకవైపు 40శాతం భాగంలో మాత్రమే హెచ్చరికని ముద్రిస్తున్నారు. అది మొత్తం ప్యాకెట్‌మీద బయటకు కనిపించే భాగంలో 20శాతం మాత్రమే ఉంటోంది. సిగరెట్ పెట్టెలు, బీడీ కట్టలపై 85శాతం పరిమాణంలో గ్రాఫిక్స్‌తో హెచ్చరికల ముద్రణ జరగాలంటూ కేంద్రం 2014 అక్టోబరులో జారీచేసిన నోటిఫికేషన్ వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రావాల్సి ఉంది. కాగా హెచ్చరికల ముద్రణ సైజుని పెంచడంపై సుప్రీం కోర్టులో అనేక ఫిర్యాదులు దాఖలు అయ్యాయి. పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికల ముద్రణ పరిమాణాన్ని పెంచనీయకుండా మనదేశంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్ల మీద అనారోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్న దేశాల్లో సరైన విధానాన్ని పాటిస్తున్న క్రమంలో చూస్తే మనదేశం 198 దేశాల్లో 136వ స్థానంలో ఉంది. ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ, పొగాకు వినియోగాన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో భారత్ మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.