మీ అత్తగారితో ఈ మాటలు ఎప్పుడూ చెప్పకండి!
సినిమాల్లో, టివి సీరియల్స్‌లో చూపించినట్టుగా అత్తాకోడళ్లనగానే నిప్పు ఉప్పులాగే ఉండాలని లేదు. చాలా స్నేహంగా సామరస్యంగా కలిసిమెలసి ఉండేవారు, ఒకరిని ఒకరు గౌరవించుకునేవారూ ఇప్పుడు ఉంటున్నారు. ఆత్మగౌరవం అనే మాటకు అర్థం తెలిసిన ఏ మహిళా మరొక స్త్రీని కించపరచదు. ఈ విషయాలు పక్కన పెడితే ఎంతగా అర్థం చేసుకున్న అత్తగారితో అయినా కోడలు చెప్పకూడని విషయాలు, అత్తగారి సమక్షంలో మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. ఎంత పరిణితితో ఆలోచించే అత్తగారయినా సదరు విషయాలు కోడలినోటి వెంట […]
సినిమాల్లో, టివి సీరియల్స్‌లో చూపించినట్టుగా అత్తాకోడళ్లనగానే నిప్పు ఉప్పులాగే ఉండాలని లేదు. చాలా స్నేహంగా సామరస్యంగా కలిసిమెలసి ఉండేవారు, ఒకరిని ఒకరు గౌరవించుకునేవారూ ఇప్పుడు ఉంటున్నారు. ఆత్మగౌరవం అనే మాటకు అర్థం తెలిసిన ఏ మహిళా మరొక స్త్రీని కించపరచదు. ఈ విషయాలు పక్కన పెడితే ఎంతగా అర్థం చేసుకున్న అత్తగారితో అయినా కోడలు చెప్పకూడని విషయాలు, అత్తగారి సమక్షంలో మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. ఎంత పరిణితితో ఆలోచించే అత్తగారయినా సదరు విషయాలు కోడలినోటి వెంట విన్నపుడు కాస్తయినా ఉడుక్కుంటుంది. ఇక మానసిక పరిణతి లేని, అచ్చంగా సినిమా అత్తగారిలా ప్రవర్తించే అత్తగారి దగ్గర ఈ మాటలు మాట్లాడితే ఇల్లు రణరంగమే అవుతుంది. కాబట్టి ప్రతికోడలు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవి-
- మీ అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు..అనిమాత్రం అత్తగారితో ఏ కోడలూ అనకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా తన కొడుకు గురించి తనకే బాగా తెలుసునని అనుకుంటుంది. భార్యగా కోడలికి కొడుకు మనసులో ఒకప్రత్యేక స్థానం ఉంటుందని తెలిసినా, కొడుకుకి మానసికంగా తానే దగ్గర అనే భావం తల్లిలో ఉంటుంది. తమ సొంత ఆస్తిని కోడలుకి అప్పజెబుతున్నట్టే చాలామంది తల్లులు భావిస్తుంటారు. అది కొడుకుమీద ఉన్న ప్రేమే అనుకున్నా, అందులో ఒక అభద్రతా భావం కూడా ఉంటుంది. అందుకే అత్తగారి వద్ద ఈ మాట ఎప్పుడూ అనకండి.
- నాకు తెలుసు, మీ సలహాలు అక్కర్లేదు…అనకండి. ఏ విషయం గురించి అయినా ఆమె చెప్పేది వినండి. కొడుకు జీవితంలో తాను ముఖ్యమన్నభావంతోనూ, అతనికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అనే భయంతోనూ చాలామంది అత్తగార్లు కోడలికి చాలా సలహాలు ఇస్తుంటారు. ఏ తల్లికయినా పిల్లల జీవితాలు ఒక కొనసాగింపు…ఆ కొనసాగింపుని అర్ధంతరంగా కట్ చేసుకుని ఇక నాకేం సంబంధం లేదు అని ఏ తల్లి అనుకోలేదు. అందుకే ఆమె సలహాలు చెబుతుంది. వినడం, బాగుంటే ఆచరించడం, బాగోకపోతే సర్దిచెప్పడం కోడలి బాధ్యత.
- మా అమ్మ చాలా బాగా వండుతుంది…యధాలాపంగా ఇలా అన్నా, అత్తగారు తప్పకుండా ఎంతోకొంత నొచ్చుకుంటారు. కోడలు, ఆమె తల్లితో తనని పోల్చి చూస్తే, ఏ అత్తగారూ స్పోర్టివ్‌గా తీసుకోలేరు. అందులో నిజమున్నా ఒప్పుకోలేరు. మీ తల్లి చేసే వంట మీకు ఎంతగా నచ్చినా, అది మీ సొంత విషయంగా మనసులో ఉంచుకుంటే, మీకు మీరు మేలు చేసుకున్నవారు అవుతారు.
- మీరు తెచ్చిన ఈ చీర అసలు బాగోలేదు…ఇలాంటి మాటలు ఎప్పడూ అనకండి. అత్తగారి అభిరుచికి, షాపింగుకి వంకలు పెట్టకండి. ఆమె సెలక్షన్ మీకు నచ్చకపోయినా, ఇదేం సెలక్షన్…నాకసలు నచ్చలేదు…అనేయకండి. ఒక వ్యక్తి మనకోసం ఏదైనా తెచ్చారంటే వారికి మనమీద శ్రద్ధ ఉందని, మనం ఆనందంగా ఉండటం వారికి ఇష్టమని అర్థం. ఆ ప్రాథమిక విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇలాంటి సందర్భాల్లో స్పందించాలి. అత్తగారు ఇచ్చిన గిఫ్ట్‌ని ఆనందంగా స్వీకరించడం కూడా మంచి కోడలి లక్షణమే.
ఇలాంటి మెలకువలతో సర్దుకుని పోవడం అనేది రాజీపడటంగా ఆత్మగౌరవలోపంగా అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఏ బంధం సామరస్యంగా సాగాలన్నా ఈ సర్దుబాట్లు అత్యవసరాలు. వీటిని మినహాయించితే ఇక ఏ బంధమూ నిలబడదు మరి.