ముందు మాల్యా నుండి వసూలు చేయండి...తరువాత నేను ఫైన్ కడతా!
కడుపు మండిన సగటు మనిషి స్పందన ఎలా ఉంటుందో ఆ మహిళ చూపించింది. ముంబయిలోని ఒక లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన 44ఏళ్ల మహిళ ఒకరు టికెట్ తీసుకోలేదు. దీనిపై ప్రశ్నించిన రైల్వే పోలీస్‌కి ఆమె దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చారు. ముందు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగ్గొట్టిన 9వేల కోట్ల రూపాయలను వసూలు చేయండి…తరువాత నన్ను అడగండి అంటూ ఆమె 260 రూపాయల జరిమానా కట్టనంటూ మొండికేసింది. ఆ జరిమానా కట్టకపోతే ఆమె ఒక […]
కడుపు మండిన సగటు మనిషి స్పందన ఎలా ఉంటుందో ఆ మహిళ చూపించింది. ముంబయిలోని ఒక లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన 44ఏళ్ల మహిళ ఒకరు టికెట్ తీసుకోలేదు. దీనిపై ప్రశ్నించిన రైల్వే పోలీస్‌కి ఆమె దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చారు. ముందు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగ్గొట్టిన 9వేల కోట్ల రూపాయలను వసూలు చేయండి…తరువాత నన్ను అడగండి అంటూ ఆమె 260 రూపాయల జరిమానా కట్టనంటూ మొండికేసింది. ఆ జరిమానా కట్టకపోతే ఆమె ఒక వారం జైలుశిక్షని అనుభవించాల్సిఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ, ఆదివారం మహాలక్ష్మి స్టేషన్‌లో టికెట్ కొనకుండా పట్టుబడింది. ఆమె ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన మహిళేనని తెలుస్తోంది. అయితే రైల్వే అధికారులు ఎంతగా నచ్చచెప్పినా ఆ మహిళ ఫైన్ కట్టేందుకు ఒప్పుకోలేదు. చివరికి ఆమె భర్తని పిలిపించి ఆయనతో చెప్పించినా ఆమె వినలేదు. తన పట్టు వీడలేదు.
చేసేది లేక ఆమెని మంగళవారం మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచారు. అక్కడకూడా ఆమె జరిమానా కట్టేందుకు నిరాకరించిందని, వారం రోజులు జైలుకి వెళ్లేందుకే సిద్ధపడిందని పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్‌కి చెందిన సెక్యురిటీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఆమెని ఒప్పించడానికి 12 గంటలపాటు రైల్వే అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాధారణ ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు మాల్యా పట్ల అంత మెత్తగా ఎందుకు ఉన్నారని ఆమె ప్రశ్నించిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.