అక్కడ పిల్లల్ని కంటే... ఉద్యోగం పోతుంది
మాతృత్వానికి మనం ఇచ్చే విలువ చాలా గొప్పగా ఉంటుంది. మాతృత్వం మీద మన దగ్గర ఉన్నంత సాహిత్యం మరెక్కడా ఉండదు. అందులో తప్పులేదు. మాతృత్వాన్ని గౌరవించడం అంటే మనిషి తన జన్మను తాను గౌరవించుకోవడమే మరి. కానీ అంత గొప్ప మాతృత్వానికి ఆలంబన, ఆధారం అయిన స్త్రీకి మాత్రం అదే మాతృత్వపు హక్కుని స్వేచ్ఛగా పొందే అవకాశం లేదు. ఇదొక వైరుధ్యం. అత్యంత ప్రాకృతికమైన ఈ స్త్రీ హక్కుకి, ఆధునిక సమాజాలు చెదలు పట్టించేస్తున్నాయి. ఆడవాళ్లు చదువుకోవాలి, […]
మాతృత్వానికి మనం ఇచ్చే విలువ చాలా గొప్పగా ఉంటుంది. మాతృత్వం మీద మన దగ్గర ఉన్నంత సాహిత్యం మరెక్కడా ఉండదు. అందులో తప్పులేదు. మాతృత్వాన్ని గౌరవించడం అంటే మనిషి తన జన్మను తాను గౌరవించుకోవడమే మరి. కానీ అంత గొప్ప మాతృత్వానికి ఆలంబన, ఆధారం అయిన స్త్రీకి మాత్రం అదే మాతృత్వపు హక్కుని స్వేచ్ఛగా పొందే అవకాశం లేదు. ఇదొక వైరుధ్యం. అత్యంత ప్రాకృతికమైన ఈ స్త్రీ హక్కుకి, ఆధునిక సమాజాలు చెదలు పట్టించేస్తున్నాయి.
ఆడవాళ్లు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఇంటికి ఆధారం కావాలి, కార్యాలయాల్లో ఊపిరి సలపని పనిచేయాలి…అన్నీ చేయాలి. కానీ అందుకు ప్రతిగా వారు పొందేది మాత్రం మగవారికన్నా తక్కువ వేతనాలు. మాతృత్వంపై నిబంధనలు. ఇటీవల నిమ్స్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గర్భందాల్చిన 13 మంది నర్సులు డెలివరీకి వెళ్లి వచ్చేసరికి వారి ఉద్యోగాలు హుష్ కాకీ అయిపోయాయి. దీనిపై ఎన్ని కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. నర్సులు రాత్రి పగలు తేడా లేకుండా రోగులకు సేవలు చేస్తుంటారు. అందులో అలాంటి సేవలు మహిళలు మాత్రమే చేయగలరు కనుక వారే ఆ ఉద్యోగాల్లో ఎక్కువగా ఉంటారు. ఉద్యోగం కోసం వారి జీవితాలు అంకితం కావచ్చు కానీ, వారికంటూ ఒక బిడ్డని కంటే మాత్రం వైద్య సంస్థలు ఉద్యోగాలు పీకేస్తామంటే అది ఎంత అన్యాయం. ఎంత అనుచితం. అదే జరిగింది నిమ్స్ నర్సుల విషయంలో. వారిప్పుడు మాతృత్వం అంటేనే భయపడుతున్నారు. గర్భిణులైన వారు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో ఉద్యోగం పోతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
బిడ్డని కనే హక్కుని కాలరాయడం అంటే, ఏ సందర్భమైనా, ఎవరైనా, ఎక్కడైనా….అది మనిషి ఉనికికి, మనుగడకు మనిషే ముప్పు తెచ్చుకోవడం అవుతుంది. స్త్రీల పట్ల ఉన్న వివక్షకు పరాకాష్ట ఇది. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న అవివేకం కూడా. ఇలాంటి దృక్పథాలు స్త్రీజాతిమీద తద్వారా మానవజాతిమీద కనిపించని ఉక్కుపాదం మోపుతూనే ఉంటాయి.
స్త్రీ పిల్లలను కంటుంది…కానీ ఆమెకు ఇష్టమైనప్పుడు కనే హక్కు, వద్దనుకున్నప్పుడు కాదనే హక్కు మన కుటుంబాల్లో లేదు. అత్యంత గొప్పదైన మాతృత్వం ఆమెకే సొంతం… కానీ దానిపై హక్కు మాత్రం భర్తకో, అత్తింటి వారికో ఉంటుంది. రికార్డుస్థాయిలో ఉంటున్న భ్రూణ హత్యలే ఇందుకు నిదర్శనం. కుటుంబమే కాదు, సమాజం, ఆమెకు ఉద్యోగం ఇచ్చిన సంస్థలు, ప్రభుత్వాలు…ఇలా ఎవరు బడితే వారు మాతృత్వ హక్కుపై అజమాయిషి చేయడం అనేది సకల ప్రాణుల్లో మన మనుషులకే చెల్లింది.
అందుకే పెళ్లి కాని అమ్మాయిలు, పిల్లలు లేని మహిళలు…ఇవి కూడా చాలా సందర్భాల్లో మహిళలకు ఉద్యోగ అర్హతలుగా మారిపోతుంటాయి. అలాగే మాతృత్వం మహిళ ఎదుగుదలకు ఒక ఆటంకం అనేంతగా దాని చుట్టూ ముళ్లకంచెలు వేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు అందుతున్న సహకారం ఇది. ఎయిర్ హోస్టెస్‌లకు కూడా ఇలాంటి చిక్కులు ఉన్నట్టుగా వింటున్నాం. అలాగే ప్రయివేటు కంపెనీలు చాలావరకు పిల్లల్ని కనే వయసులో ఉన్న స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. 20 నుండి 30ఏళ్ల మధ్య వయసులో ఉన్న మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని మూడువంతుల మంది మేనేజర్లు ఒక సర్వేలో వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని స్లేటర్ గార్డన్ అనే న్యాయ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మెటర్నటీ లీవు ఇవ్వాల్సివస్తుందేమో అనే భయమే అందుకు కారణం. 500మందిని సర్వే చేస్తే అందులో నలభై శాతం మంది మేనేజర్లు, పిల్లల్ని కనే వయసులో ఉన్న మహిళలకు తాము ఉద్యోగం ఇవ్వడానికి అంత సుముఖంగా లేమని వెల్లడించారు. మెటర్నటీ లీవు, చైల్డ్ కేర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వెల్లడించారు. మాతృత్వంలోని తీయదనం వెనుక ఉన్న చేదు నిజాలు ఇవి. సమాజం స్త్రీ అభివృద్దికి ఏ మాత్రం సహకరిస్తుందో కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది.
మాతృత్వాన్ని కుటుంబ, ఆర్థిక, సామాజిక, రాజకీయ జాతీయ అంశంగా చూడటానికి మనకు సవాలక్ష కారణాలు కనబడుతున్నాయి కానీ, దాన్ని స్త్రీ హక్కుగా…. అది ఆమెకు ప్రకృతి నుండి లభించిన వరంగా, ఆమె ఆరోగ్యం, ఆనందం, ప్రేమ, ఆత్మవిశ్వాసం లాంటి ఎన్నో అంశాల సమ్మేళనంగా దాన్ని చూడటానికి మనకు శక్తి చాలడం లేదు. మనసు రావడం లేదు. ఎందుకంటే మాతృత్వానికి తగిన విలువ, గౌరవం ఇస్తే అది స్త్రీకి కూడా ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడున్న సమాజంలో మహిళల పట్ల వివక్ష రాజ్యమేలుతున్న కాలంలో అది అసలు సాధ్యమయ్యే పనికాదు. ఆ భావజాలమే….మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన మగానుభావుల్లో కూడా ఉంటుంది. దానికి కట్టుబడే వారు పనిచేస్తుంటారు.
ఒక పక్క ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు ఆరునెలల మెటర్నటీ లీవుని మంజూరు చేస్తుంటే మరొక పక్క ప్రయివేటు సంస్థల్లో పనిచేసే మహిళలు, ప్రభుత్వ సంస్థల్లోనే ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే ఉద్యోగులకు అది వర్తించకపోవడం…చూస్తుంటే మహిళల హక్కులు, ప్రయోజనాల పట్ల మన ప్రభుత్వాలకు ఎంత నిబద్దత ఉందో అర్థమవుతోంది.
మాతృత్వాన్ని జనాభాగా మార్చిచూసినపుడు దీనిలో మరిన్ని భిన్నకోణాలు కనబడతాయి. జనాభా పెరిగిపోతున్నదేశాల్లో ఒక్కరినే కనాలి, ఇద్దరినే కనాలి లాంటి నిబంధనలను మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గిపోతోంది ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఉద్భోదించారు. ఇలాంటి నిబంధనలు కూడా మహిళల వ్యక్తిగత జీవితాల్లో ఎన్నోఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. వారు వాటిని కూడా భరిస్తుంటారు. మానవజాతిని పెంచే క్రమంలో ఇన్ని భరిస్తున్న మహిళలకు ప్రతిగా ఏం దొరుకుతోంది.
మాతృత్వం ఇన్ని రకాలుగా రంగులు మారిపోతున్నా అది మహిళ శరీరంతో, మనసుతో, ఆరోగ్యంతో, ఆనందంతో, ప్రాణంతో, ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న విషయం. ఇంకా చెప్పాలంటే…ఈ భూమ్మీద మనిషన్న ప్రాణిని సృష్టిస్తున్న అంశం. మరి దానిపట్ల మన దృక్పథం ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఉదారంగా, ఎంత గొప్పగా ఉండాలి…ఆమెకు ఎన్ని మెటర్నటీ లీవులు ఇస్తే…ఆమె పట్ల ఎంత సహృదయంతో వ్యవహరిస్తే…ఆమె మానవ ప్రపంచానికి ఇస్తున్నదాంతో సమానం అవుతుంది…. అవేమీ ఇవ్వకపోగా చివరికి …పాపాయిని కనిరాగానే ఉద్యోగం నుండి తీసేస్తే….దాన్ని ఏమనాలి???
-వడ్లమూడి దుర్గాంబ