విషాద వదనాల్లో... రంగుల హాసం!
నాలుగువందల ఏళ్లుగా కొనసాగుతున్న ఒక పాత సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ వృందావన్‌లోని గోపీనాథ్ గుడి ఆవరణలో వందలమంది వితంతు మహిళలు రంగుల్లో మునిగి తేలారు. మునుపెన్నడూ జరగని విధంగా సంస్కృత స్కాలర్లు, ఆలయ అర్చకులతో కలిసి, రంగుల సంబరం జరుపుకున్నారు. ఒక్కసారిగా మనసులో గూడుకట్టుకున్న విషాదం, స్థబ్దత కరిగిపోగా ఆ మహిళలు ఓ కొత్త రంగుల ప్రపంచాన్ని హోలీ రూపంలో చూశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో వితంతులు నివాసం ఉండే వృందావన్‌లో ఈ సారి ఈ […]

నాలుగువందల ఏళ్లుగా కొనసాగుతున్న ఒక పాత సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ వృందావన్‌లోని గోపీనాథ్ గుడి ఆవరణలో వందలమంది వితంతు మహిళలు రంగుల్లో మునిగి తేలారు. మునుపెన్నడూ జరగని విధంగా సంస్కృత స్కాలర్లు, ఆలయ అర్చకులతో కలిసి, రంగుల సంబరం జరుపుకున్నారు. ఒక్కసారిగా మనసులో గూడుకట్టుకున్న విషాదం, స్థబ్దత కరిగిపోగా ఆ మహిళలు ఓ కొత్త రంగుల ప్రపంచాన్ని హోలీ రూపంలో చూశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో వితంతులు నివాసం ఉండే వృందావన్‌లో ఈ సారి ఈ చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తెల్లని చీరలతో హోలీకి దూరంగా ఉండే వితంతువులు ఈసారి గోపీనాథ్ ఆలయంలో రంగుల్లో మునిగితేలారు. ఎప్పుడూ అయితే హోలీ జరుగుతున్నంతసేపు వారు పాగల్ బాబా వితంతు ఆశ్రమంలో ఉండేవారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సామాజిక సేవాసంస్థ సులభ్, స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, ఇది సమాజంలో రాబోయే మార్పుని సూచిస్తుందని అన్నారు. వితంతులు తెలుపు చీరలే ధరించాలనే సనాతన ఆచారానికి దీంతో చరమగీతం పాడినట్టయిందని ఆయన అన్నారు. 1200కేజీల రంగులు, 1500కేజీల బంతిపూల రెక్కలతో ఆ ప్రాంతమంతా రంగులు, సుమాలతో సుమనోహరంగా మారిపోయింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సంస్కృత విద్యార్థులు పాల్గొన్నారు. ఏళ్లతరబడి నిస్సారంగా జీవితాలను గడుపుతున్న ఎంతోమంది వితుంతులు తాత్కాలికంగా అయినా తమ బాధలను మరచిపోయి ఆనందోత్సాహాలను అనుభవించారు. రైసా అనే 65ఏళ్ల మహిళ తన జీవితంలో ఒక మంచి ఆనందదాయకమైన, గుర్తుండిపోయే సందర్భంగా ఈ హోలీని పేర్కొన్నారు. ఆమెకు 17ఏళ్ల వయసులో భర్త మరణించాడు. రోజులు మారుతున్నాయని, ఇప్పుడు తమని శాపగ్రస్తులుగా చూడటం లేదని, చిన్నపిల్లలు వచ్చి తమతో కలిసిమెలసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె అన్నారు. విషాదం తప్ప మరొకటి లేని తమ జీవితాల్లో ఈ పండుగ తాత్కాలికంగా అయినా ఉత్సాహాన్ని నింపిందని పలువురు వితంతువులు తమ మనోభావాన్ని, భారాన్ని వ్యక్తం చేశారు.