వీడియో గేమ్స్...ఆడేవారితో ఆడుకుంటున్నాయి!
అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని మనం నిత్యం ఒక మంత్రంలా జపించినా తక్కువే. అమృతమైనా మోతాదు దాటి సేవిస్తే వికటిస్తుంది. విషంలా మారుతుంది. పరిధి, పరిమితి…ఈ రెండే మనిషి జీవితానికి మూల సూత్రాలు. ఈ విషయం తెలియకే వీడియో గేమ్స్‌కి అడిక్టయిన ఇద్దరు అన్నదమ్ములు కొన్నాళ్ల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీకి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ములు పగలురాత్రి తేడాలేకుండా, అన్నం నీళ్లు మానేసి, కనీసం టాయ్‌లెట్‌కి వెళ్లటం కూడా మర్చిపోయి వీడియో గేమ్స్ ఆడేశారు. […]
అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని మనం నిత్యం ఒక మంత్రంలా జపించినా తక్కువే. అమృతమైనా మోతాదు దాటి సేవిస్తే వికటిస్తుంది. విషంలా మారుతుంది. పరిధి, పరిమితి…ఈ రెండే మనిషి జీవితానికి మూల సూత్రాలు. ఈ విషయం తెలియకే వీడియో గేమ్స్‌కి అడిక్టయిన ఇద్దరు అన్నదమ్ములు కొన్నాళ్ల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీకి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ములు పగలురాత్రి తేడాలేకుండా, అన్నం నీళ్లు మానేసి, కనీసం టాయ్‌లెట్‌కి వెళ్లటం కూడా మర్చిపోయి వీడియో గేమ్స్ ఆడేశారు. వారిని అందులోంచి బయటకు తేవడానికి ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. నెలపైగా ఆసుపత్రిలో ఉంటే గాని వారికి పట్టిన వీడియోగేముల అడిక్షన్ తగ్గలేదు. ఈ ఉదంతం ఇదే బాటలో వెళుతున్న వారికి చెంపదెబ్బ.
కంప్యూటర్లు, ప్లేస్టేషన్లు, ఫోన్లు…ఎందులోనైనా గంటల తరబడి వీడియోగేముల్లో మునిగి తేలుతున్నవారికి ఆ ఇద్దరు అన్నదమ్ములు పెద్ద గుణపాఠంగా నిలిచారు. ఏ అలవాటైనా, వ్యసనమైనా మొదలుపెట్టినపుడు అది మన చేతుల్లో ఉన్నట్టుగా ఉంటుంది. తరువాత మనమే దాని కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతాం. తెల్లవారి పరీక్షలు పెట్టుకుని రాత్రంతా వీడియో గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్న విద్యార్థులు ఉన్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎప్పుడు తెల్లారి, ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియనంతగా వీటికి దాసోహం అంటున్నవారు పెరుగుతున్నారు. గంటల సమయం అలా కూర్చుండిపోయి మరో వైపు చిప్స్‌లాంటివి నములుతూ ప్రపంచాన్ని మర్చిపోతున్నవారూ ఉన్నారు. పనిపాటా లేక కాదు, కాలేజీలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో చదువుని పక్కనపెట్టి మరీ చాలామంది ఈ ఆటలు ఆడుతున్నారు. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు నిస్సహాయంగా వారిని చూస్తూ ఉండిపోతున్నారు. ఒకసారి అడిక్షన్‌గా మారిపోయాక అందులోంచి బయటకు తేవడం, బయటకు రావడం అంత సులువు కాదు.
గంటల కొద్దీ వీడియో గేములతో గడిపేవారిలో మానసిక సంయమనం దెబ్బతింటుందని, వారిలో భావోద్వేగాల నియంత్రణ గాడి తప్పుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీరిలో చిరాకు, కోపం, అసహనం, ఆగ్రహం లాంటి లక్షణాలు పెరిగిపోతాయి. అంతే కాదు, హింసని ప్రేరేపించే వీడియోగేమ్‌లను ఆడేవారిలో సున్నితత్వ కోణం దెబ్బతింటున్నట్టుగా తెలుస్తోంది. వీడియోగేముల్లో ఉండే ఛాలెంజ్, దాన్ని తప్పించుకోవడం… అనే రెండు అంశాలు టీనేజి పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. వారి కళ్లు, మనసు రెంటిండినీ ఈ గేములు బిజీగా ఉంచడం వలన వారికి సమయం ఎలా గడుస్తుందో అర్థం కాదు. అందుకే గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.
పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కూడా వారు వీడియో గేముల ద్వారా తమ నుండి తాము పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది మానసిక నిపుణులు అంటున్నారు. ఇల్లు, స్కూళ్లు, కాలేజీలు ఎక్కడా ఒత్తిడి లేకుండా ఉంటే ఈ గేమ్స్ పట్ల అంతగా అడిక్ట్ కారనేది వారి అభిప్రాయం.
మొదటే హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు వీడియో గేమ్‌ల్లో హింసని చూసినపుడు మరింతగా దానిపట్ల ప్రేరేపితులు అవుతారని కూడా మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే సైకోపాత్ లక్షణాలు ఉన్నవారు హింసాత్మక వీడియోలు చూసిపుడు వారు నిజజీవితంలో హింసకు పాల్పడినట్టుగా కొన్ని అధ్యయనాల్లో గమనించారు. అలాంటివారు నిజమేదో, ఆటేదో కూడా తెలుసుకోలేనంతగా వాటికి అడిక్ట్స్ అయిపోయి ప్రవర్తించారు. ముఖ్యంగా హింసాత్మక గేములను చూస్తున్న వారు దయారహితంగా, ఇతరుల బాధలను అర్థం చేసులేనంత నిర్దయతో వ్యవహరించడం కూడా అధ్యయనాల్లో గమనించారు. మనిషి మనిషికీ వీటి ప్రభావం మారవచ్చు కానీ గంటల కొద్దీ మనసుని ఉత్తేజపూరిత స్థితిలో ఉంచితే అది ఉన్మాదమే అవుతుందని మాత్రం మర్చిపోకూడదు.