బెజవాడ విలేకరులు… ఫాదర్స్ కు ఆడవాళ్ల వల…
విజయవాడలో ఒక మతగురువుని బ్లాక్‌మెయిల్ చేసి కోట్లు సంపాదించాలని చూసింది ఒక క్రైమ్ ముఠా. ముఠా అంటే వారంతా నేరాలతో సహజీవనం చేసే కరడుగట్టిన నేరస్తులు కాదు. తమ రాతలతో ప్రజలను మేలుకొలిపే వృత్తిలో ఉన్న విలేకరులు, మీడియా ప్రతినిధులు. తమ తెలివతేటలు, నిఘా స్వభావం, ప్రజలతో పరిచయాలు, కెమెరా కన్నుతో దేన్నయినా ప్రపంచం ముందుకు తెచ్చే అవకాశం…వీటన్నింటినీ వారు అడ్డదారిలో డబ్బు సంపాదనకు ఉపయోగించుకున్నారు. పత్రికా స్వేచ్ఛ అనేది పిచ్చివాడిచేతిలో రాయి కాకూడదనేది ఎప్పటినుండో వినబడుతున్న […]
విజయవాడలో ఒక మతగురువుని బ్లాక్‌మెయిల్ చేసి కోట్లు సంపాదించాలని చూసింది ఒక క్రైమ్ ముఠా. ముఠా అంటే వారంతా నేరాలతో సహజీవనం చేసే కరడుగట్టిన నేరస్తులు కాదు. తమ రాతలతో ప్రజలను మేలుకొలిపే వృత్తిలో ఉన్న విలేకరులు, మీడియా ప్రతినిధులు. తమ తెలివతేటలు, నిఘా స్వభావం, ప్రజలతో పరిచయాలు, కెమెరా కన్నుతో దేన్నయినా ప్రపంచం ముందుకు తెచ్చే అవకాశం…వీటన్నింటినీ వారు అడ్డదారిలో డబ్బు సంపాదనకు ఉపయోగించుకున్నారు. పత్రికా స్వేచ్ఛ అనేది పిచ్చివాడిచేతిలో రాయి కాకూడదనేది ఎప్పటినుండో వినబడుతున్న మాట…కానీ కలం, మైకు, కెమెరా ఇవన్నీ బ్లాక్‌మెయిలింగ్ సరుగ్గా ఉపయోపడకూడదని ఇప్పుడు మనం కొత్త నానుడి చెప్పుకోవాలి. మీడియా అనే వ్యవస్థలో లోపం లేదు. అది సమాజానికి నిజంగా మేలుచేసేదే. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నవారితోనే సమస్య అంతా. ఈ నేర ఉదంతంలో అదే స్పష్టంగా కనబడుతోంది.
కృష్ణాజిల్లా పామర్రుకి చెందిన ఒక చర్చఫాదర్‌కి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా విజయవాడలో ఒక ఛానల్ ప్రతినిధికి తెలిసింది. ఆ విషయం సదరు ప్రతినిధికి ఒక వార్తలా కాకుండా తనకు డబ్బు సంపాదించి పెట్టే బ్లాక్‌మెయిలింగ్ సరుగ్గా కనబడింది. అంతే ఆ ఫాదర్‌ని బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. తన అసలు వృత్తికంటే ఈ దందా బాగుందనిపించింది. అంతే మరికొంతమంది మీడియా వ్యక్తులను పోగేసి ఒక ముఠాని ఏర్పాటు చేశాడు. ముందు వీరు క్రైస్తవ ఫాదర్‌లనే టార్గెట్ చేశారు. కంచికర్ల, నందిగామ తదితర ప్రాంతాల్లోని చర్చిఫాదర్లపై నిఘావేశారు. ఈ క్రమంలో ఒక చర్చి ఫాదర్‌కి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న సంగతి వారి దృష్టికి వచ్చింది. అయితే అతని నుండి డబ్బు ఎక్కువ రాలదని తెలుసుకుని ఆ వ్యక్తిని పక్కన పెట్టారు.
వారి టార్గెట్ డబ్బు సంపాదనే కాబట్టి ఆ స్థాయిలో తమకు డబ్బు ముట్టచెప్పగలరనుకున్న వారిపై దృష్టి పెట్టారు. దాతో విజయవాడలోని గుణదల మేరీమాత చర్చికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఫాదర్‌ని తమ టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఆయనను ఈ రొంపిలోకి ఎలా లాగాలా అని ప్లాన్ వేస్తుండగా నందిగామ, కంచికచర్ల చర్చి ఫాదర్‌ని సంబంధిత సంస్థ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారాన్ని గుణదల చర్చి ఇన్‌ఛార్జి ఫాదర్ దృష్టికి తీసుకువచ్చిన మీడియా ముఠా…కంచికచర్లకు వచ్చి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలని కోరారు. ఆ మహిళకు ఎలాగైనా న్యాయం చేద్దాం..మీరొస్తే బాగుంటుంది అన్నారు…అలాగే ఒక మహిళకు తీవ్రమైన అనారోగ్యంగా ఉంది, వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరారు.
ఆయన వారి మాటలను పూర్తిగా నమ్మారు. మాట్లాడటం, ప్రార్థనలు ముగిశాక అక్కడే భోజనం చేశారు. ఆ భోజనంలో మత్తుమందు కలిపిన ముఠా, నగ్నంగా ఉన్న ఓ మహిళను ఫాదర్ పక్కన ఉంచి ఫొటోలు, వీడియోలు తీసింది. అవన్నీ దగ్గరపెట్టుకుని ఒక పెద్ద బ్లాక్‌మెయిల్ దందాకి ముఠా తెరలేపింది. చర్చి ఫాదర్‌ని ఏకంగా ఐదుకోట్లు డిమాండ్ చేసింది. లేకపోతే వ్యవహారం మొత్తం, ఛానళ్లలో ప్రసారం అవుతుందని బెదిరించింది. భయపడిపోయిన ఫాదర్ వారు చెప్పినట్టుగా డబ్బు ఇస్తానన్నారు.
ఐదుకోట్లను వాయిదాల మొత్తంలో చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇందులో 1.34కోట్లను ఆయన చెల్లించారు కూడా. ఇదంతా సంవత్సరం క్రితం జరిగిన వ్యవహారం. ఇప్పుడు మిగిలిన డబ్బు మొత్తాన్ని వెంటనే ఇచ్చేయాలని పట్టుబట్టి తమ గుట్టు తామే బయటపెట్టుకుంది మీడియా ముఠా. ఫాదర్‌ని మరింత భయపెట్టడానికి కంచికచెర్ల ఫాదర్ వ్యవహారాన్ని మొహానికి ముసుగు వేసుకున్న ఒక మహిళతో చెప్పించి ఓ ఛానల్‌లో ప్రసారం చేశారు.
ఇక ఈ బెదిరింపులను తట్టుకోలేకపోయిన ఫాదర్ విషయం మొత్తాన్ని కేథలిక్ మత పెద్దలకు చెప్పారు. విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యం గొలిపే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే కేసులో ఉన్నదంతా మీడియా ప్రతినిధులు కావడంతో విచారణను బహిర్గత పరచడం లేదు. ఫాదర్‌నుండి వారు వసూలు చేసిన డబ్బుని రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వి6 ఛానల్ ప్రతినిధితో పాటు ఓ లాయరుని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. మరొక మూడు ఛానళ్ల ప్రతినిధులతో పాటు మొత్తం 12మందిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరో లాయరుకోసం గాలిస్తున్నారు. ఈ కేసుతోపాటు మరికొన్ని కేసులతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ దినపత్రిక విలేకరిని ఆ సంస్థ విధులనుండి తొలగించినట్టుగా సమాచారం.
వృత్తులు గొప్పవి కావచ్చు…అవి సమాజ హితం కోసం పోరాడేవి కావచ్చు…కానీ ఆయా వృత్తుల్లో ఉన్నవారూ మనుషులేనని, మంచి వృత్తుల్లో ఉన్నవారంతా మంచిగా ప్రవర్తించలేరని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. సమాజంమీద మీడియా నిఘా ఉంటే…మీడియా మీద పోలీస్ నిఘా, ప్రజల అప్రమత్తత అవసరం అని కూడా ఈ దందా రుజువు చేసింది.
Click on Image to Read: