Telugu Global
NEWS

బాబు కొత్త రాగంపై కమలనాథుల అనుమానం

‘’జగన్ రాసి పెట్టుకో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తా… రాయలసీమకు నీరిచ్చి మీ ఊరిలో సన్మానం చేయించుకుంటా’’ ఇది అసెంబ్లీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చేసిన చాలెంజ్. ఉమ ఇంతసీరియస్‌గా శపథం చేసినా ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అందుకు కారణం 2018నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యమన్నది అందరికీ తెలుసు కాబట్టి. ఒకవేళ ఉమ చెప్పినట్టు 2018నాటికి పోలవరం పూర్తయితే ప్రపంచంలోనే మరో వింతగా నిలుస్తుంది. ఎందుకంటే 32 వేల కోట్ల […]

బాబు కొత్త రాగంపై కమలనాథుల అనుమానం
X

‘’జగన్ రాసి పెట్టుకో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తా… రాయలసీమకు నీరిచ్చి మీ ఊరిలో సన్మానం చేయించుకుంటా’’ ఇది అసెంబ్లీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చేసిన చాలెంజ్. ఉమ ఇంతసీరియస్‌గా శపథం చేసినా ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అందుకు కారణం 2018నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యమన్నది అందరికీ తెలుసు కాబట్టి. ఒకవేళ ఉమ చెప్పినట్టు 2018నాటికి పోలవరం పూర్తయితే ప్రపంచంలోనే మరో వింతగా నిలుస్తుంది. ఎందుకంటే 32 వేల కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం కేటాయింపులు వందల కోట్లు దాటడం లేదు. కాబట్టి పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 2019 ఎన్నికల నాటికి కూడా పోలవరం పరిస్థితి ఇలాగే ఉంటే టీడీపీకి గండం తప్పదు. అందుకే ఇప్పుడు పోలవరంపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేసినట్టుగా భావిస్తున్నారు.

పోలవరం నిర్మాణం తమకు బదిలీ చేయాలని ఆ మధ్య కేంద్రం కోరగా చంద్రబాబు ప్రభుత్వం ససేమిరా అంది. అవసరం లేదు.. మీరు డబ్బులిస్తే చాలు మేమే కడుతామంటూ చెప్పింది. ప్రాజెక్టు వ్యయాన్ని కూడా కేంద్రాన్ని సంప్రదించకుండానే రూ. 16 వేల కోట్ల నుంచి ఏకంగా రూ. 32 వేల కోట్లకు పెంచి అందరూ అవాక్కయ్యేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగానే పోలవరం నిధుల కేటాయింపులోనూ కేంద్రం ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరంను కేంద్ర మెడకు చుట్టేందుకు చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు.

మొన్న అసెంబ్లీలో ఈ విషయంపైనే చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడారు. పోలవరం కడుతామంటే కేంద్రానికే అప్పగిస్తా…ఈ క్షణమే బదిలీ చేస్తా.. కట్టమనండి అంటూ ఆవేశంగా ప్రకటించారు. అయితే ఒక్కసారిగా చంద్రబాబు ఇలా ప్లేట్ ఫిరాయించడంపై కమలనాథులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదన్న నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు… ఆ నెపాన్ని బీజేపీ మీదకు నెట్టేందుకే ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రానికి అప్పగిస్తామంటూ కొత్త రాగం అందుకున్నారని భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి ప్రాజెక్టు నిర్మాణం ఎవరు చేసినా 2019కి పూర్తయ్యే అవకాశం లేదంటున్నారు. కాబట్టి ప్రాజెక్టును కేంద్రం మెడకు చుట్టేసి 2019 ఎన్నికల్లో పోలవరానికి తమకు ఏం సంబంధం లేదని చెప్పుకునేందుకు బాబు ప్లాన్ చేశారని అంచనా వేస్తున్నారు. పోలవరం నిర్మాణం జరక్కపోతే… 2019 ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందులను బీజేపీ మెడకు చుట్టేయాలన్నది బాబు ఎత్తుగడ అని అనుమానిస్తున్నారు. ఈ మాటేదో రెండేళ్ల క్రితమే చెప్పి ఉండాల్సింది అంటున్నారు. కాబట్టి పోలవరంను కేంద్రానికి బదిలీ చేస్తా అంటున్న చంద్రబాబు కొత్త ఎత్తుపై జాగ్రత్తగా ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు.

First Published:  11 March 2016 4:07 AM IST
Next Story