బస్ కండక్టర్‌తో వివాహేతర సంబంధం...కాటికి చేర్చింది!
రోజూ తాను ప్రయాణం చేస్తున్న బస్ తాలూకూ కండక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతని చేతుల్లోనే హత్యకు గురయింది. కేరళలోని తొప్పుంపాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు ఈ కేసుని ఛేదించి హంతకుని అరెస్టు చేశారు. 36ఏళ్ల సంధ్య అజిత్‌కి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఫోర్ట్ కొచ్చిలోని అమరావతిలో వాళ్లు నివాసం ఉంటున్నారు. చేర్తలలోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంటుగా ఉద్యోగం చేస్తున్న ఆమె సోమవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసింది. ఆ […]
రోజూ తాను ప్రయాణం చేస్తున్న బస్ తాలూకూ కండక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతని చేతుల్లోనే హత్యకు గురయింది. కేరళలోని తొప్పుంపాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు ఈ కేసుని ఛేదించి హంతకుని అరెస్టు చేశారు.
36ఏళ్ల సంధ్య అజిత్‌కి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఫోర్ట్ కొచ్చిలోని అమరావతిలో వాళ్లు నివాసం ఉంటున్నారు. చేర్తలలోని ఒక ప్రయివేటు సంస్థలో అకౌంటెంటుగా ఉద్యోగం చేస్తున్న ఆమె సోమవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసింది. ఆ తరువాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తుప్పుంపాడిలో లారీలు పార్క్ చేసే ప్రదేశంలో శవమై కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా మిస్టరీని విడగొట్టారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం సంధ్య తాను ఉద్యోగం చేసే చేర్తలకు ఒక ప్రయివేటు బస్‌లో వెళుతుండేది. ఆ బస్‌కి అన్వర్ (27) కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్యా పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండున్నరేళ్లుగా వారిద్దరి మధ్య ఈ బంధం కొనసాగుతోంది. దాంతో సంధ్య తనని వివాహం చేసుకొమ్మని అన్వర్‌ని బలవంతపెట్టడం మొదలుపెట్టింది. అందుకు సుముఖంగా లేని అన్వర్ సంధ్యని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. సోమవారం సాయంత్రం తన స్నేహితుని కారుని అడిగి తీసుకుని, చేర్తలలో సంధ్యని ఎక్కించుకుని తొప్పుంపాడి బ్రిడ్జి వద్దకు రాత్రి తొమ్మిదింటికి వచ్చాడు.
అక్కడ ఉన్న పార్కింగ్ యార్డ్‌లో లారీల మధ్యన కారుని పార్క్ చేశాడు. తరువాత ఆమెని గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని ఒక లారీకింద భాగంలో పడేసి అక్కడినుండి వెళ్లిపోయాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అన్వర్ ఈ వివరాలన్నీ వెల్లడించాడు. ఒక మహిళా ట్రాఫిక్ వార్డెన్ సంధ్య శవాన్ని చూసి, సోమవారం సాయంత్రం తెల్లని కారులో ఒక యువకునితో ఆమె వెళ్లడం తాను చూశానని పోలీసులకు తెలిపింది. ట్రాఫిక్ వార్డెన్ ఇచ్చిన సమాచారం, హత్య జరిగిన ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన కారు, హతురాలి ఫోన్ కాల్ రికార్డులను బట్టి పోలీసులు ఈ కేసుని తేలిగ్గానే ఛేదించారు. పల్లూరుతి అనే ఊళ్లో తన సోదరి ఇంట్లో ఉన్న అన్వర్‌ని బుధవారం అరెస్టు చేశారు.