దేశం నుంచి కాదు..దేశంలోని సమస్యల నుంచి ఆజాదీ
(కన్నయ్య కుమార్ జైలు నుంచి విడుదలయ్యాక జేఎన్ యూ లో చేసిన హిందీ ప్రసంగానికి తెలుగు గ్లోబల్.కామ్ తెలుగు అనువాదం) స్నేహితులారా.. ముందుగా జేఎన్‌యూ విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు, దుకాణదారులు, అందులో పనిచేసే సిబ్బందికి నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా దేశవాసులకు, మీడియాకి అభివాదం చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన జేఎన్‌యు పూర్వవిద్యార్థులు, దేశ విదేశాల్లోని ప్రొఫెసర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయం కోసం నా పక్షాన నిలిచిన పాత్రికేయులకు, […]
(కన్నయ్య కుమార్ జైలు నుంచి విడుదలయ్యాక జేఎన్ యూ లో చేసిన హిందీ ప్రసంగానికి తెలుగు గ్లోబల్.కామ్ తెలుగు అనువాదం)
స్నేహితులారా..
ముందుగా జేఎన్‌యూ విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు, దుకాణదారులు, అందులో పనిచేసే సిబ్బందికి నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా దేశవాసులకు, మీడియాకి అభివాదం చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన జేఎన్‌యు పూర్వవిద్యార్థులు, దేశ విదేశాల్లోని ప్రొఫెసర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయం కోసం నా పక్షాన నిలిచిన పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు, పౌర సమాజ ప్రతినిధులకు కృతజ్ఞతలు. మరీ ప్రత్యేకంగా పార్లమెంటులో కూర్చొని ఇది సరైనదీ, ఇది కాదని నిర్ణయాలు తీసుకుంటున్న రాజకీయ నాయకులకు, వారి పోలీసులకు నా ధన్యవాదాలు చెబుతున్నాను. మరీ మరీ ముఖ్యంగా జేఎన్‌యూని అప్రతిష్టపాలు చేయడానికి వాళ్ల ప్రైమ్ టైమ్ స్లాట్‌లు ఇచ్చిన మీడియా సంస్థలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఎవ్వరిమీదా కోపం లేదు. మరీ ముఖ్యంగా ఏబీవీపీపై అస్సలు కోపం లేదు. అడగండి ఎందుకని..? (ఎందుకు? అంటూ విద్యార్థులు నవ్వూతూ ప్రశ్న) ఎందుకంటే..మన క్యాంపస్‌లోని ఏబీవీపీ బయట ఉన్న ఏబీవీపీ కంటే చాలా రేషనల్., అందుకని. (నవ్వులు-చప్పట్లు) ! తమను తాము రాజకీయ విద్వాంసులుగా, మేథావులుగా భావించే ఏబీవీపీ నాయకులు., జేఎన్‌యు అధ్యక్ష ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించామని వారు గుర్తుంచుకోవాలి. ఇక్కడే వారి పరిస్థితి ఇలా ఉంటే ఇక బయట ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
నిజానికి నాకు ఏబీవీపై ఎలాంటి ద్వేషం లేదు. ఎందుకంటే నేను అసలైన ప్రజాస్వామ్యవాదిని. మనకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. ఏబీవీపీని శత్రువుగా చూడము మనం. ప్రత్యర్థిలా మాత్రమే చూస్తాం. ఓ ఏబీవీపీ మిత్రులారా మీలా నిష్కారణంగా ఎవ్వరినీ టార్గెట్ చేయం.
ఎందుకంటే వేటాడటానికైనా ఓ స్థాయి ఉండాలి. నిజం చెబుతున్నాను..జేఎన్‌యు ఏ విలువలు మనకు నేర్పిందో..నిజాన్ని నిజంలా..అబద్ధాన్నిఅబద్ధంలా చూడాలని చెప్పిందో.. దేశం కోసం ఎలా నిలబడిందో..ఆ ఔన్నత్యానికి సెల్యూట్ చేస్తున్నాను. ఇక అన్నిటికంటే ప్రధానమైన విషయం..మనదంతా స్పాంటేనియస్. వాళ్లలా ప్లాన్డ్ కాదు(నవ్వులు, చప్పట్లు). పూర్త నమ్మకం ఉంది..మన శాసన వ్యవస్థపై, మన రాజ్యాంగంపై..ఇంకా మార్పుపై! మార్పు వచ్చి తీరుతుంది మిత్రులారా..అది తప్పదు! భారత రాజ్యాంగంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.
సమాజవాదం, ధర్మనిస్పేక్షత, సమానత్వం కోసం నిలబడివున్నాం. నేను ప్రసంగం ఇవ్వను. నా అనుభవాలు చెబుతాను. జేఎన్‌యులో చాలా రీసెర్చ్ జరుగుతుంటుంది. ఇది మన ప్రైమరీ డేటా అనుకుందాం మిత్రులారా! (చప్పట్లు..కేరింతలు)
అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగాన్ని ప్రేమించేవారికి నేను చెప్పేది అర్థమవుతుంది.
కేసు కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి నేనేమీ మాట్లాడను. మన ప్రధాని కూడా ట్వీట్ చేశారు..సత్యమేవ జయతే అని. (నవ్వులు)
మీ ఆలోచనలతో విభేదించే నేను కూడా అదే చెబుతున్నాను మోదీ జీ..సత్యమేవ జయతే! ఎందుకంటే అది మీ నినాదం కాదు. మన రాజ్యాంగ మూల సూత్రం! (చప్పట్లు..నవ్వులు..కేరింత
మిత్రులారా..ఓ విద్యార్థిని రాజకీయ పావుగా వాడి దేశద్రోహం కేసు పెట్టారని అనుకోవద్దు. జేఎన్‌యూపై జరిగిన దాడి కుట్రపూరితంగా జరిగింది. యూజీసీకి వ్యతిరేకంగా మన పోరాటాన్ని అణగదొక్కడానికి ఈ దాడి జరిగింది. రోహిత్ వేములకు న్యాయం జరగాలని మనం చేస్తున్న పోరాటాన్ని తొక్కేయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగ చేయించిన దాడి అది. (..షేమ్)
ఆ విషయాలను కప్పిపుచ్చడానికే జేఎన్‌యు అంశాన్నిప్రైమ్ టైమ్‌లో నడుపుతున్నారు ఆ మాననీయ ఎక్స్ ఆర్ఎస్ఎస్. కీలకమైన విషయాలను దేశ ప్రజలు మరచిపోయేవిధంగా చేయాలనుకుంటున్నారు. కానీ జేఎన్‌యూని ఎవ్వరూ మరిపించలేరు. వాటిని మీకు పదేపదే గుర్తుచేస్తూనే ఉంటాం. ఈ దేశంలో అధికార మదంతో ఎప్పుడు అకృత్యాలకు పాల్పడినా..జేఎన్‌యూ తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుంది. చూడండి..మీరు మా పోరాటాన్ని నీరుగార్చలేరు. (చప్పట్లు)
ఈ దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. అదేం చేస్తుంది? ప‌్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై సైబర్ సెల్‌ని ప్రయోగిస్తుంది. అదేం చేస్తుంది? మీకో నకిలీ వీడియో పంపుతుంది. బూతులు పంపిస్తుంది. మీ డస్ట్‌బిన్‌లో ఎన్ని కండోమ్స్ ఉన్నాయో లెక్కపెడుతుంది.(కేకలు, అరుపులు)
మిత్రులారా..ఇది చాలా గంభీరమైన సమయం! సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం. మీరు మా ఆందోళనను డైల్యూట్ చేయలేరు. ..ఏమన్నారు? ఓవైపు సరిహద్దుల్లో సైనికులు చనిపోతున్నారనా..?! దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన వీర సైనికులకు నేను
సెల్యూట్ చేస్తున్నాను. పేరెందుకుగాని..బీజేపీకి చెందిన ఓ ఎంపీ అన్నారు..సరిహద్దుల్లో యువకులు చనిపోతున్నారని! నేను అడుగుతున్నాను..దేశం లోపల చనిపోతున్నకోట్లాదిమంది రైతుల మాటేమిటని? పంటలు పండించి, సరిహద్దుల్లో సైనికులకు కూడా రోటీ పెడుతున్నరైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరెందుకు మాట్లాడరని?? దయచేసి అసంబద్ధ చర్చలు తీసుకురావద్దు. దేశం కోసం సైనికులేకాదు, దేశం లోపల మన తండ్రులు, సోదరుల్లాంటి రైతులు కూడా చనిపోతున్నారు. మరి పార్లమెంటులో నిలబడి వారి కోసం మీరెం రాజకీయం చేస్తున్నారు? రైతుల ఆత్మహత్యలకు ఎందుకు బాధ్యత తీసుకోరు? అని ప‌్రైమ్ టైమ్‌లో ఆవేశపడే స్పీకర్లను అడుగుతున్నాను..నా తండ్రి, సోదరుల్లాంటి రైతుల ఆత్మహత్యలకు బాధ్యత ఎవరిదని? పోరాడేవాళ్లది తప్పకాదు., పోరాటాలు చేయించేవాళ్లది తప్పు. (చప్పట్లు..కేరింతలు) …మిత్రులారా! సమస్యల నుంచి విముక్తి కోరుకోవడం తప్పా? మనం కోరుతున్నది దేశం నుంచి విముక్తి కాదు., దేశంలోని సమస్యల నుంచి విముక్తి!
ఇక జైల్లో నా అనుభవం గురించి చెబుతాను. అసలే మనం బ్రహ్మపుత్ర బ్లాక్‌కి చెందినవాళ్లం. ఎక్కడికి వెళ్లినా మాట్లాడకుండా ఉండేదెట్లా? భోజనం, మెడికల్ టెస్టులకు వెళ్లేటప్పుడు పోలీసులతో మాట్లాడేవాడిని. ఓరోజు ఓ జవాను నన్ను అడిగాడు..ఈ లాల్ సలామ్ ఏమిటని? లాల్ అంట్ క్రాంతి.,మార్పు!.. ఆ క్రాంతికి సలామ్ అని! చెప్పాను. కానీ ఆ జవానుకు అర్థం కాలేదు. సరే, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న మాట విన్నావా? అని అడిగాను. విన్నాను అన్నాడు. అరే భాయ్..క్రాంతిని ఉర్దూలో ఇంక్విలాబ్ అంటారని చెప్పాను. ..ఓ అలాగా ఈ నినాదం ఏబీవీపీ వాళ్లు కూడా చేస్తారన్నాడు…హమ్మయ్య అర్థమైందా? కానీ వాళ్లది నకిలీ ఇంక్విలాబ్, మాది అసలైన ఇంక్విలాబ్ అని చెప్పాను. (క్యాంపస్ అంతా నవ్వులు)