నేటి అరుపు...రేపటి మతిమరుపు!
ఇదేదో రైమింగ్ కోసం వాడిన పదాలు కావు….నిజాలు. ప్రతి విషయానికి కోపంతో అరుపులు, కేకలు పెట్టేవారికి భవిష్యత్తులో తప్పకుండా మతిమరుపు వస్తుందని ఒక నూతన అధ్యయనంలో తేలింది. యువతీ యువకులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రశాంతంగా ఉండమని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. వయసులో ఉన్నపుడు అత్యంత ఎక్కువగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే తరువాత కాలంలో జ్ఞాపకశక్తి సమస్యలు, ఆలోచనా లోపాలు తలెత్తుతాయని ఆ అధ్యయనంలో తేలింది. వయసులో ఉన్నపుడు ఎవరిలో అయితే సహనం, సమస్యలను తట్టుకునే […]
ఇదేదో రైమింగ్ కోసం వాడిన పదాలు కావు….నిజాలు. ప్రతి విషయానికి కోపంతో అరుపులు, కేకలు పెట్టేవారికి భవిష్యత్తులో తప్పకుండా మతిమరుపు వస్తుందని ఒక నూతన అధ్యయనంలో తేలింది. యువతీ యువకులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రశాంతంగా ఉండమని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. వయసులో ఉన్నపుడు అత్యంత ఎక్కువగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే తరువాత కాలంలో జ్ఞాపకశక్తి సమస్యలు, ఆలోచనా లోపాలు తలెత్తుతాయని ఆ అధ్యయనంలో తేలింది.
వయసులో ఉన్నపుడు ఎవరిలో అయితే సహనం, సమస్యలను తట్టుకునే శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉంటాయో, ఎవరైతే ఇతరుల పట్ల సానుకూలంగా స్పందించలేరో వారిలో మరో 25ఏళ్ల తరువాత ఆలోచనా శక్తి బాగా లోపించినట్టుగా, జ్ఞాపకశక్తి క్షీణించినట్టుగా పరిశోధకులు గుర్తించారు. వీరు తమ అసలు వయసుకంటే మరో పదేళ్లు వయసుమీరిన వారిలా తయారవుతారని కూడా అమెరికన్ ఎకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన అధ్యయన నిర్వాహకులు లినోర్ జె లానర్ వెల్లడించారు.
25 సంవత్సరాల సగటు వయసున్న 3,126 మందిపైన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిని నాలుగు భాగాలుగా విడగొట్టి వారి మానసిక లక్షణాలను పరిశీలించి నమోదుచేశారు. వారిలో సమస్యలను తట్టుకునే శక్తి ఎలా ఉంది, ఎంత సమర్ధవంతంగా ఆలోచిస్తున్నారు, ఒత్తిడిని ఎంతవరకు తట్టుకుంటున్నారు, కోపతాపాలు ఎలా ఉన్నాయి తదితర అంశాల స్థాయిలను బట్టి నాలుగు గ్రూపులుగా చేశారు.
25ఏళ్ల తరువాత వారి మెదడు శక్తి సామర్ధ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు.
కొన్ని ప్రశ్నల ద్వారా వారిలో కోపాన్ని తట్టుకునే శక్తి ఎలా ఉంది, ఇతరుల పట్ల నమ్మకాన్ని చూపుతున్నారా, సామాజిక బంధాల్లో సానుకూలంగా స్పందిస్తున్నారా…లాంటి విషయాలు గమనించారు. అలాగే సమస్యలను తట్టుకునే శక్తి ఉందోలేదో కూడా చూశారు.
ఆ తరువాత వీరికి 15 పదాలను ఇచ్చి వాటిని చూడకుండా చెప్పమన్నప్పుడు వయసులో ఉన్నపుడు కోపాన్ని తారాస్థాయిలో చూపినవారు కోపం లేనివారికంటే తక్కువ స్థాయిలో పదాలను గుర్తుంచుకోగలిగారు. అలాగే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నవారు అలాంటి సమర్ధత లేనివారికంటే ఎక్కువ పదాలు గుర్తుంచుకోగలిగారు.
అయితే దీన్ని చివరి ఫలితంగా చెప్పలేమని, ఈ రెండు అంశాలకు మధ్య సంబంధం ఉందని మాత్రమే ఈ అధ్యయనంలో గుర్తించామని, మున్మందు ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని లానెర్ చెబుతున్నారు.