జగన్‌పై రావెల ఆరోపణలు... ఒక విధంగా వైసీపీకి మంచిదే!
ఈ మధ్య సీఎం చంద్రబాబు నుంచి సాధారణ టీడీపీ కార్యకర్త వరకు ఒక సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నారు . అదేంటంటే… ఏపీలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక జగన్ హస్తముందని ఆరోపించి తప్పించుకోవడం. అలా చేయడం ద్వారా చంద్రబాబు తప్పేమీ లేదు అంతా జగనే చెడగొడుతున్నారన్న భావన జనంలో కల్పించడం వారి ఉద్దేశం. అయితే ఏ ఆరోపణ అయినా ఒక పరిధి దాటితే జనం నమ్మకం కష్టం. కాపు రిజర్వేషన్ల ఉద్యమం వెనుక జగన్ […]
ఈ మధ్య సీఎం చంద్రబాబు నుంచి సాధారణ టీడీపీ కార్యకర్త వరకు ఒక సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నారు . అదేంటంటే… ఏపీలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక జగన్ హస్తముందని ఆరోపించి తప్పించుకోవడం. అలా చేయడం ద్వారా చంద్రబాబు తప్పేమీ లేదు అంతా జగనే చెడగొడుతున్నారన్న భావన జనంలో కల్పించడం వారి ఉద్దేశం. అయితే ఏ ఆరోపణ అయినా ఒక పరిధి దాటితే జనం నమ్మకం కష్టం.
కాపు రిజర్వేషన్ల ఉద్యమం వెనుక జగన్ హస్తముందని టీడీపీ నేతలు ఆరోపించారు. ముద్రగడను రెచ్చగొడుతోందని జగనేనని బాబు బృందం చెప్పింది. తునిలో రైలు తగలబెట్టింది కూడా రాయలసీమ నుంచి వచ్చిన జగన్ మనుషులే అని ఆరోపించారు. అమరావతి భూకుంభకోణాలు బయటకు వస్తే… రాజధాని బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు జగనే ఇలా ప్రచారం చేయిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాదించారు. ఇప్పుడు తాజాగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ పోరాటానికి సిద్ధమవుతుంటే దాని వెనుక కూడా జగన్ హస్తముందని స్వయంగా ముఖ్యమంత్రే ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అమాయకులైన వారు నమ్మవచ్చునేమో!. కానీ…
తాజాగా మంత్రి రావెల కిషోర్ బాబు చేసిన ఆరోపణలతో టీడీపీ వ్యూహానికి మొదటికే ఎసరొచ్చేలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌లో ఓ మహిళను కారులోకి లాగబోయింది రావెల కుమారుడు. ఆ విషయంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆరోజు స్థానికులంతా కలిసి స్పాట్‌లోనే రావెల సుశీల్‌ను చితకొట్టారు. దీని వెనుక కూడా జగన్ హస్తముందని రావెల చెప్పడం ఆశ్చర్యరంగానే ఉంది.
జగన్ చెబితేనే రావెల సుశీల్ కారేసుకుని వెళ్లి మహిళ వెంటపడ్డారా?. అలా సుశీల్ కారులో వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడం వెనుక జగన్ హస్తం ఉందా?. స్థానికులంతా అక్కడే కలిసి కొట్టారు కదా… ఆ విషయాన్ని సుశీల్ కూడా ఫేస్ బుక్‌లో ఒప్పుకున్నారు. మరి అక్కడిక్కడ జరిగిన దానికి, జగన్‌కు ఏం సంబంధమో?. మరీ విచిత్రంగా తప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్‌ను తీసుకొచ్చి జగన్ మీడియా ప్రచారం చేస్తోందని రావెల ఆరోపించారు. అసలు విషయం ఏమీటంటే సీసీ కెమెరా ఫుటేజ్‌ను జగన్ మీడియానే కాదు మొత్తం అన్ని చానళ్లు(టీడీపీ అనుకూల మీడియాతో సహా) ప్రసారం చేశాయి. ఆ చానళ్లకు కూడా జగన్‌కు లొంగిపోయాయా?. తప్పుడు కేసుల పెట్టించారని రావెల చెబుతున్నారు. అంటే తెలంగాణ పోలీసులు కూడా జగన్‌కు లొంగిపోయారా?. కొడుకు చేసిన ఘనకార్యానికి బాధపడాల్సింది పోయి ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేయడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
రావెల ఆరోపణల తర్వాత టీడీపీ నిజాయితీ పదేపదే శీలపరీక్షకు నిలవడం ఖాయం. ఇకపై ముద్రగడ వెనుక, కాపు ఉద్యమం వెనుక, మందకృష్ణ వెనుక, తుని ఘటన వెనుక, రాజధాని కుంభకోణాల వెనుక జగన్ హస్తముందని టీడీపీ నేతలు ఆరోపణలు చేసినా నమ్మే పరిస్థితి ఉండదు. ఆ ఆరోపణలు కూడా రావెల తరహాలోనే కావాలని జగన్ మీద చేస్తున్న తప్పుడు ఆరోపణలేనని జనం భావించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో జగన్ నిజంగా ఏదైనా తప్పు చేసినా… దానిపై టీడీపీ నేతలు రచ్చ చేసినా జనం నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే వాస్తవం కాకపోయినా కనీసం జనం నమ్మేస్థితిలో ఉండే అంశాల ఆధారంగా ఎదుటి వారిపై ఆరోపణలు చేస్తే బాగుంటుంది గానీ… కళ్ల ముందు అసలు నిజాలు కనిపిస్తున్నా దాని వెనుక కూడా జగనే ఉన్నారంటే జనం నవ్వుకుంటారు. ఒక విధంగా రావెల జగన్‌పై చేసిన ఆరోపణల దెబ్బకు ఇంతకాలం టీడీపీ నేతలు వైసీపీ అధ్యక్షుడిపై చేస్తున్న ఆరోపణలపైనా జనంలో అనుమానాలు కలగడం ఖాయం.
Click on image to read: