Telugu Global
Cinema & Entertainment

కళ్యాణ వైభోగమే సినిమా రివ్యూ

రేటింగ్‌ :3/5 విడుదల తేదీ : 4 మార్చి 2016 దర్శకత్వం :  బి.వి. నందిని రెడ్డి ప్రొడ్యూసర్ : కె.ఎల్. దామోదర్ ప్రసాద్ బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్ సంగీతం :  కళ్యాణీ మాలిక్ నటీనటులు : నాగ శౌర్య, మాళవిక, పేర్లి మన్నె, రాసి, ఆనంద్, ప్రగతి కళ్యాణ వైభోగమే పేరువిని, ట్రయిలర్‌ చూడగానే అర్ధమైపోతుంది. ఇది పెళ్ళికి సంబంధించిన కథ అని. విదేశాల్లో ఇప్పటికే వివాహ వ్యవస్థ పలచబడింది. విడాకులు అక్కడ సర్వసాధారణం. మనదేశంలో కూడా గత పదేళ్ళనుంచి విడాకులు […]

కళ్యాణ వైభోగమే సినిమా రివ్యూ
X

రేటింగ్‌ :3/5
విడుదల తేదీ : 4 మార్చి 2016
దర్శకత్వం : బి.వి. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్
సంగీతం : కళ్యాణీ మాలిక్
నటీనటులు : నాగ శౌర్య, మాళవిక, పేర్లి మన్నె, రాసి, ఆనంద్, ప్రగతి

కళ్యాణ వైభోగమే పేరువిని, ట్రయిలర్‌ చూడగానే అర్ధమైపోతుంది. ఇది పెళ్ళికి సంబంధించిన కథ అని. విదేశాల్లో ఇప్పటికే వివాహ వ్యవస్థ పలచబడింది. విడాకులు అక్కడ సర్వసాధారణం. మనదేశంలో కూడా గత పదేళ్ళనుంచి విడాకులు పెరిగాయి. పెళ్ళయిన ఏడాదికే విడిపోతున్నవాళ్ళు ఎక్కువయ్యారు.

అరెంజ్‌డ్‌ పెళ్ళిల్లోనే కాదు, ప్రేమ వివాహాల్లో కూడా విడాకులు అదే సంఖ్యలో ఉన్నాయి. సహజంగా మగవాళ్లలో ఉండే ఆధిపత్యధోరణిని అమ్మాయిలు ఇష్టపడకపోవడం. అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా వ్యవహరించడాన్ని అబ్బాయిలు అర్ధం చేసుకోకపోవడం ఒక కారణమైతే, పెళ్ళంటేనే గుదిబండగా భావించే ఆలోచనా ధోరణి పెరగడం ఇంకోకారణం.

ఈ అంశాన్ని దర్శకురాలు నందిని రెడ్డి డీల్‌ చేయడానికి ప్రయత్నించి కొంత సక్సెసయ్యారు. కథని వేగంగా నడపడంలో శ్రద్ధవహించివుంటే పూర్తిగా విజయం సాధించేవారు. హీరో నాగశౌర్యకి పెళ్ళంటే సదభిప్రాయం వుండదు. కానీ ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు చేస్తూవుంటారు. హీరోయిన్‌ మాళవిక నాయర్‌ కూడా సేమ్‌. వీళ్ళిద్దరికి పెళ్ళి చూపులు జరుగుతాయి. ఒకరికొకరు నచ్చరు. అయితే ఇంట్లోవాళ్ళ బెడద తప్పించుకోడానికి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. తరువాత వెంటనే విడాకులు తీసేసుకుని ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా జీవించాలనుకుంటారు.

ఆ తరువాత ఒకే అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న వాళ్ళిద్దరి మధ్య ఏంజరిగింది? కథ ఎలా సుఖాంతమైందనేది తెరపై చూడాల్సిందే. ఇది డైరెక్టర్‌ సినిమా. నందినిరెడ్డి మార్క్‌ కనిపిస్తుంది. అయితే కథా గమనంలోనే కొన్ని ఇబ్బందులున్నాయి. తండ్రికి తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేని అమ్మాయి, ఆ తరువాతైనా తండ్రికి నిజం తెలుస్తుందని ఎందుకు అనుకోదు?

సినిమాలో అక్కడక్కడ హాస్యసన్నివేశాలు తళుక్కుమంటాయి. అయితే డైలాగులు ఇంకా కామెడిగా వుంటే బావుండేది. హీరో కోడిని పెంచుకోవడం చాలా బావుంది. కోడి దురదృష్టమేమంటే అది కనిపించగానే మన కళ్ళముందు నాన్‌వెజ్‌ డిషెస్‌ కదులుతాయి తప్ప అదొక ప్రాణమని ఎవరూ గుర్తించరు.

యువతరం ప్రధానంగా ఎదుర్కుంటున్న గందరగోళాన్ని చిత్రిస్తూనే, పెళ్ళి అనేది గొప్ప భావన అని దర్శకురాలు చెప్పకనే చెప్పారు. హీరోపై హీరోయిన్‌కి ఇష్టం పెరుగుతున్న క్రమాన్ని కూడా చాలా సెన్సిటివ్‌గా తీశారు. నాగశౌర్య నటన బావుంది. డైలాగ్‌ డెలివరిలో ఇంకొంచెం మెచ్యూరిటీ సాధించాలి.

సినిమాలోముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌ మాళవిక గురించి. దివ్య పాత్రకు ప్రాణం పోసింది. ఎవడే సుబ్రమణ్యంలో అందరిని ఆకట్టుకన్న మాళవిక ఈ సినిమాలో ఈతరం అమ్మాయిగా ఒదిగిపోయింది. హీరోయిన్‌ని మూర్ఖురాలిగా చూపిస్తున్న ఇప్పటి సినిమాలకు భిన్నంగా ఈసినిమా ఉంది. సినిమా మొదలైన కాసేపటికే దివ్య క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప మాళవిక కాదు.

తాగుబోతు రమేష్‌ ట్విస్ట్‌ కొంచెం నాటకీయంగా వున్నా సరదాగానే వుంది. పాటలు పరవాలేదు. ఈ సినిమాని కనీసం 20 నిమిషాలు నిడివి తగ్గించివుంటే బావుండేది. సినిమా తీసేసిన తరువాత తగ్గించాలంటే మమకారం ఒప్పుకోదు. నందిని సినిమా కొత్తగా వుంటుంది, రొటీన్‌కి భిన్నంగా వుంటుందని ఆశించిన వాళ్ళకు కళ్యాణవైభోగమే నిరాశ కలిగించదు. యూత్‌ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.

– జి ఆర్‌. మహర్షి.

First Published:  4 March 2016 11:30 AM IST
Next Story