టెక్కీ హత్యలో ఆ కారే కీలకం!
గురువారం తెల్లవారు జామున సికిందరాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సంజయ్ జంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యాడు. అర్థరాత్రి వరకు మియాపూర్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సంజయ్‌ని అతని స్నేహితుడు పంజాగుట్ట వద్ద దింపి వెళ్లిపోయాడు. అక్కడి నుండి హత్య జరిగిన ప్రదేశానికి సంజయ్‌ని చేరవేసిన కారే హత్యలో కీలకంగా మారింది. పంజాగుట్టలో నాలుగున్నరకు దిగిన సంజయ్ తాను పెరేడ్ గ్రౌండ్‌కి చేరితే అక్కడి నుండి ఐదున్నరకు తన కొలీగ్ బాస్కర్ తనను తీసుకుని […]
గురువారం తెల్లవారు జామున సికిందరాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సంజయ్ జంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యాడు. అర్థరాత్రి వరకు మియాపూర్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సంజయ్‌ని అతని స్నేహితుడు పంజాగుట్ట వద్ద దింపి వెళ్లిపోయాడు. అక్కడి నుండి హత్య జరిగిన ప్రదేశానికి సంజయ్‌ని చేరవేసిన కారే హత్యలో కీలకంగా మారింది. పంజాగుట్టలో నాలుగున్నరకు దిగిన సంజయ్ తాను పెరేడ్ గ్రౌండ్‌కి చేరితే అక్కడి నుండి ఐదున్నరకు తన కొలీగ్ బాస్కర్ తనను తీసుకుని ప్యాట్నీ వెళ్లాలని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. అయితే భాస్కర్‌కి తిరిగి ఫోన్ చేసి ప్యాట్నీ వద్దకే నేరుగా రావాల్సిందిగా అక్కడే కలుసుకుందామని చెప్పాడు.
కాల్‌సెంటర్ ఉద్యోగే అయిన భాస్కర్ నాలుగున్నరకి డ్యూటీ దిగి సంజయ్ చెప్పిన ప్రాంతానికి వచ్చాడు. కానీ భాస్కర్ అక్కడికి చేరుకునేలోపునే దాదాపు 4.50 ప్రాంతంలో సంజయ్ హత్యకి గురయ్యాడు.
అయితే స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సేకరించిన సిసిటివి ఫుటేజిని బట్టి హత్యచేసిన దుండగులు వచ్చిన స్విఫ్ట్ కారులోంచే సంజయ్ దిగడం పోలీసులు గుర్తించారు. కారులోంచి దిగిన దుండగులు సంజయ్‌ని పొడిచి అదే కారులో పారిపోయినట్టుగా తెలుస్తోంది. ట్యాంక్ బండ్‌వైపు దుండగుల కారు 150 నుండి 160 కిలోమీటర్ల వేగంతో రాంగ్ రూట్లో వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. స్విఫ్ట్ కారు నెంబరుని 8055గా చెబుతున్న పోలీసులు 14 మంది స్విఫ్ట్ కార్ల యజమానులను పిలిచి వివరాలు సేకరించారు. అలాగే సంజయ్ స్నేహితులు, అతని తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. సంజయ్ కుటుంబం పార్శీగుట్టలో నివాసం ఉంటోంది. ఆరునెలల క్రితం మాదాపూర్‌లోని సదర్లాండ్ కంపెనీలో అతను ఉద్యోగంలో చేరాడు. అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడిందని పోలీసుల విచారణలో తేలింది. సంజయ్‌కి శత్రువులు ఎవరూ లేరని అతని తల్లిదండ్రులు, స్నేహితులు చెబుతున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమవ్యవహారం కాకపోతే సంజయ్ ఎక్కిన కారులోని సహ ప్రయాణికులతో గొడవేమైనా జరిగి అది హత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.