ఆ టీనేజీ కుర్రాడు... కెనడా ప్రధాని అయ్యాడు!
భారత్, పంజాబ్ కుటుంబానికి చెందిన ఒక కెనడా టీనేజి కుర్రాడు ఆ దేశానికి ఒక్కరోజు ప్రధానిగా రికార్డుల్లోకెక్కాడు. పిజె ( ప్రభ్‌జోత్ ) లఖన్‌పాల్ అనే ఈ కుర్రాడు క్యాన్సర్‌ని జయించాడు. పేషంటుగా ఉన్నపుడు మేకే విష్ ఫౌండేషన్, అతని కోరికకి ఓకే చెప్పడంతో అతను కెనడాకు ఒకరోజు ప్రధాని కావడం సాధ్యమైంది. ఒట్టావాలోని పార్లమెంటు భవనంలో తాను…ప్రధాన మంత్రిగా…. ఒకరోజంతా ఉండటం….కలలో కూడా ఊహించలేని అద్భుతమంటూ పిజె లఖన్‌పాల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తన ఆనందాన్ని ఫోన్ […]
భారత్, పంజాబ్ కుటుంబానికి చెందిన ఒక కెనడా టీనేజి కుర్రాడు ఆ దేశానికి ఒక్కరోజు ప్రధానిగా రికార్డుల్లోకెక్కాడు. పిజె ( ప్రభ్‌జోత్ ) లఖన్‌పాల్ అనే ఈ కుర్రాడు క్యాన్సర్‌ని జయించాడు. పేషంటుగా ఉన్నపుడు మేకే విష్ ఫౌండేషన్, అతని కోరికకి ఓకే చెప్పడంతో అతను కెనడాకు ఒకరోజు ప్రధాని కావడం సాధ్యమైంది. ఒట్టావాలోని పార్లమెంటు భవనంలో తాను…ప్రధాన మంత్రిగా…. ఒకరోజంతా ఉండటం….కలలో కూడా ఊహించలేని అద్భుతమంటూ పిజె లఖన్‌పాల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తన ఆనందాన్ని ఫోన్ ద్వారా ఇండియా మీడియాతో పంచుకున్నాడు.
తనకు ఓస్‌గుడ్ హాల్ లా స్కూల్లో లా చదవాలని ఉందని, తన జీవితాశయం రాజకీయ నేత అయ్యి తన దేశానికి సేవ చేయడమని పేర్కొన్నాడు. క్యాన్సర్ బారిన పడటం కంటే దురదృష్టకరమైన విషయం మరొకటి ఉండదని, తాను దాన్ని జయించానని చెబుతూ, భవిష్యత్తులో ఈ విషయంలోకూడా ఏదైనా చేయాలని ఉందని అన్నాడు.
పిజె లఖన్‌పాల్ కుటుంబం పంజాబ్‌లోని చిన్న పట్టణం, మండీ అహ్మద్‌ఘర్ నుండి 1988లో కెనడాకి వలస వెళ్లింది. అతని తండ్రి అక్కడ ఒక ఆటో మెకానిక్ షాపుని నడుపుతున్నాడు. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాటం చేసిన ఒత్తిడి నుండి బయటపడిన ఆ కుటుంబానికి అదనంగా ఈ సంతోషం దక్కింది. రెండున్నరేళ్ల క్రితం కెనడా మేకే విష్ ఫౌండేషన్ సభ్యులు పిజె లఖన్‌పాల్ చికిత్స పొందుతున్న హాస్పటల్‌కి వచ్చారు. వారు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఈ కుర్రాడు జీవితంలో ఈ అద్భుతాన్ని చవిచూశాడు.
తమ కుటుంబం మొత్తాన్ని పార్లమెంటు సమీపంలో ఉన్న ఒక హోటల్‌కి అధికార కాన్వాయ్‌లో తీసుకువెళ్లడం, తరువాత రోజు స్వయంగా కెనడా 28వ గవర్నర్ జనరల్ డేవిడ్ జాన్సన్ తమని ఆహ్వానించడం మర్చిపోలేని అనుభవంగా పిజె లఖన్‌పాల్ తండ్రి చెప్పాడు.
గవర్నర్ జనరల్ సైతం తన ట్విట్టర్లో మన దేశంలోని ఒక లీడర్ పిజె (ప్రభుజిత్)ని ప్రధానిగా చూడటం ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశాడు. పిజె లఖన్‌పాల్ సొంతూరు పంజాబ్‌లోని మండీ అహ్మద్‌ఘర్లో అతను తమ ఊరివాడని ఎవరికీ తెలియదు. అతని సన్నిహిత బంధువు బల్వీర్ సింగ్ ఒక రిపేర్ షాపుని నడుపుతున్నాడు. కెనెడా ఒకరోజు ప్రధాని కుటుంబంగా ఇప్పుడు తమకు పేరొచ్చిందని అతను సంబరపడుతున్నాడు.