బెడిసికొట్టిన ప్లాన్...అడ్డంగా దొరికిపోయిన హంతకుడు!
ఒక మహిళపై ఆమె మాజీ ప్రియుడి పగ…అందులో ఏమాత్రం సంబంధం లేని ఓ అమాయకుడిని బలిచేసింది. చిత్రవిచిత్రమైన మలుపులతో కూడిన ఒక హత్యా రహస్యాన్ని పోలీసులు ఛేదించారు. గుజరాత్‌లోని వావోల్-ఉవర్సద్ రోడ్డు ప్రాంతంలో అతి భయానకంగా ముక్కలుగా చేసిన శవం ఉన్నట్టుగా గాంధీనగర్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఎంతో పగ ఉంటేగానీ అంత దారుణంగా హత్య జరగదు అనిపించేలా శరీరంలోని వివిధ భాగాలు చెల్లాచెదురయి ఉన్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మృతుడు భరత్ ఠాకూర్ (33) అని తేలింది. […]
ఒక మహిళపై ఆమె మాజీ ప్రియుడి పగ…అందులో ఏమాత్రం సంబంధం లేని ఓ అమాయకుడిని బలిచేసింది. చిత్రవిచిత్రమైన మలుపులతో కూడిన ఒక హత్యా రహస్యాన్ని పోలీసులు ఛేదించారు. గుజరాత్‌లోని వావోల్-ఉవర్సద్ రోడ్డు ప్రాంతంలో అతి భయానకంగా ముక్కలుగా చేసిన శవం ఉన్నట్టుగా గాంధీనగర్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఎంతో పగ ఉంటేగానీ అంత దారుణంగా హత్య జరగదు అనిపించేలా శరీరంలోని వివిధ భాగాలు చెల్లాచెదురయి ఉన్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మృతుడు భరత్ ఠాకూర్ (33) అని తేలింది.
గాంధీనగర్ జిల్లాలో మెహ్‌సానాలో అతను కూలిపని చేసుకుని బతుకుతుంటాడు. మృతుడి పర్సులో ఉన్న ఒక ఫోన్ నెంబరు ద్వారా పోలీసులు అతని వివరాలు తెలుసుకున్నారు. ఆ ఫోన్ నెంబరు ఒక ఎల్ఐసి ఏజంట్‌ది. పోలీసులకు మృతుడి పర్సులో ఒక మహిళ ఫొటో కూడా దొరికింది. ఆ ఫొటో వెనుక మరొక ఫోన్ నెంబరు ఉంది. అది దీప్‌సిన్హ్ గోల్ (45)ది. అతను వవోల్‌గోల్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. పోలీసులు అతడిని వెతుక్కుంటూ వెళ్లి విచారణ చేయగా ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి.
దీప్‌సిన్హ్ గోల్ హత్య తానే చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఆ హత్య తనకు తానుగా చేసింది కాదని, ఆ ఫొటోలోని మహిళ కోసం, ఆమె ఒత్తిడితోనే చేశానని చెప్పాడు. మృతుడి తలను పడేసిన ఒక పాడుబడిన బావిని చూపించాడు. అయితే మృతుడు స్థానికుడు కావడం, ఆ మహిళ పశ్చిమ బెంగాల్‌కి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారు మరింత లోతుగా విచారణ జరపడంతో ఆ మహిళను ఇరికించడానికే హత్య చేసినట్టుగా, అందులో ఆమెకు ఏమాత్రం సంబంధం లేదని దీప్‌సిన్హ్ గోల్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు హంతకుడు చేసిన ఫోన్‌కాల్స్ ముఖ్యమైన ఆధారంగా నిలిచాయి.
అత్యంత పాశవిక హత్యకు గురయిన భరత్ ఠాకూర్‌కి, హత్య చేసిన దీప్‌సిన్హ్ గోల్‌కి మధ్య ఎలాంటి పగ లేదు, అసలు సరైన పరిచయమే లేదు.
జరిగినదేమింటే దీప్‌సిన్హ్ గోల్ గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ల్లో అనేక నేరాలు చేశాడు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే గత ఏడాది మహారాష్ట్రలో ఉన్నపుడు పోలీసులకు పట్టుపడ్డాడు. పోలీసులకు తన సమాచారం అందడం వెనుక తన ప్రేయసి హస్తం ఉందని అతని అనుమానం. దాంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను ఒక పెద్ద నేరంలో ఇరికించాలనుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పక్కా తాగుబోతు అయి, వెనుకాముందు ఎవరూలేని భరత్ ఠాకూర్ తారసపడ్డాడు. అంతే, అతడినే తన ప్లాన్‌కి ఎరగా వాడుకున్నాడు.
ఒక హత్యానేరంలో ఆ మహిళను ఇరికించాలనుకుంటున్నట్టుగా దీప్‌సిన్హ్, పశ్చిమ బెంగాల్లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్లో చెప్పాడు. అయితే అందుకు వాడిన ఫోన్ అతని కొడుకుది. అ అబ్బాయి, ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి పెట్టుకున్నాడు. దాంతో పోలీసులకు హత్యా వివరాలన్నీ పూస గుచ్చినట్టు తెలిసిపోయాయి.
హతుడి పర్సులో మహిళ ఫొటోని ఉంచి, కావాలనే దానిమీద తన ఫోన్ నెంబరుని రాశాడు. పోలీసులకు ఆమెని పట్టించాలనుకున్నాడు కానీ, తానే పట్టుబడిపోయాడు. అయితే భరత్ ఠాగూర్, హంతకుడి ప్లాన్‌లో అన్యాయంగా బలై పోయిన అమాయకుడు. అతను బాగా తాగి ఉండటంతో హంతకుడి పని తేలికైంది. కొడవలితో మెడకోసి హత్యచేసి తరువాత అతని శరీరాన్ని ముక్కలుగా చేశాడు. పోలీసుల విచారణ కాస్త ఆలస్యంగా జరగాలని, శవాన్ని గుర్తించకూడదని అలా చేశానని అతను చెప్పాడు. కానీ మంగళవారం హత్య జరిగితే శుక్రవారం కల్లా పోలీసులు మొత్తం ఛేదించి దీప్‌సిన్హ్ ని అరెస్టు చేశారు.