ప్రేమకు వాసనుందట!
ప్రేమించినవారు వెనుక నిలబడితే, వెనక్కుతిరిగి చూడకుండానే ముందున్నవారికి తెలిసిపోతుందని, ప్రేమికులు కళ్లతో మాట్లాడుకుంటారని…ఇలాంటి కబుర్లు ఇప్పటివరకు చాలా వింటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ వరుసలో బయటకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం… ప్రేమకు కళ్లు, నోరు సంగతేమో కానీ ముక్కు మాత్రం ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటే ఒక డేటింగ్ సైట్ ఇదేమాట చెబుతోంది. శరీర వాసనను బట్టి మీకు సరిగ్గా సరిపోయే జోడీని వెతికి పెడతామని ఈ వైబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్నారు. న్యూయార్క్‌కి చెందిన ఇద్దరు కళాకారులు ఈ […]
ప్రేమించినవారు వెనుక నిలబడితే, వెనక్కుతిరిగి చూడకుండానే ముందున్నవారికి తెలిసిపోతుందని, ప్రేమికులు కళ్లతో మాట్లాడుకుంటారని…ఇలాంటి కబుర్లు ఇప్పటివరకు చాలా వింటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ వరుసలో బయటకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం… ప్రేమకు కళ్లు, నోరు సంగతేమో కానీ ముక్కు మాత్రం ఉంటుందనిపిస్తోంది. ఎందుకంటే ఒక డేటింగ్ సైట్ ఇదేమాట చెబుతోంది. శరీర వాసనను బట్టి మీకు సరిగ్గా సరిపోయే జోడీని వెతికి పెడతామని ఈ వైబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.
న్యూయార్క్‌కి చెందిన ఇద్దరు కళాకారులు ఈ సరికొత్త డేటింగ్ సర్వీస్‌ని మొదలుపెట్టారు. వారు టెగా బ్రెయిన్, సామ్ లావిన్. ఇందులో ఆసక్తి ఉన్నవారు చేయాల్సిన పని…పెద్దగా ఏమీ లేదు. ఈ సైట్‌లో పేరు నమోదు చేసుకుని 25డాలర్లను ఫీజుగా చెల్లించాలి. దాంతో వారికి ఒక టీషర్టుని వెబ్‌సైట్ పంపుతుంది. ఆ టీషర్టుని మూడురోజులపాటు వదలకుండా ధరించాల్సి ఉంటుంది. అయితే టీ షర్టుకి ఆ వ్యక్తి వాడే డియోడరెంట్, సెంట్, టాల్కం పౌడర్ తదితర వాసనలేమీ అంటకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే శరీర సహజవాసనలు దానికి పడతాయట. మూడురోజుల తరువాత తిరిగి దాన్ని అదే అడ్రస్‌కి పంపాలి. తరువాత ఆ వ్యక్తికి డేటింగ్ వెబ్‌సైట్ నుండి పది టీషర్టులు అందుతాయి.
వాటన్నింటినీ ఈ సభ్యుడు, లేదా సభ్యురాలు జాగ్రత్తగా వాసన చూడాలి. తనకు దేని వాసన నచ్చుతుందో ఆ వివరాలు వెబ్‌సైట్ వారికి తెలపాలి. ఒకవేళ ఇతను పంపిన టీషర్టు వాసనలు నచ్చిన అమ్మాయి, తనకు అందినవాటిలో తాను మెచ్చిన టీషర్టు తాలూకూ అమ్మాయి ఒక్కరే అయి ఉంటే ఇద్దరికీ ఒకరి చిరునామాలు ఒకరికి వెబ్‌సైట్ అందిస్తుంది.
చూపు, శబ్దం కంటే వాసన పురాతనమైనదని, జ్ఞాపకాలను తట్టిలేపడంలో, భావోద్వేగాలను పలికించడంలో వాసనకు అధిక ప్రాధాన్యత ఉందని ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు అంటున్నారు.
ఫొటోలు మార్చి ఫేస్‌బుక్కుల్లో ఒకరినొకరు మోసం చేసుకోవడం కంటే ఇది నిజాయితీగా దగ్గరయ్యే పద్దతని వీరు వివరిస్తున్నారు. ఇందులో ఉన్న విచిత్రం ఏమిటంటే స్మెల్ డేటింగ్‌లో పాల్గొంటున్నవారి ఇతర వివరాలేమీ ఈ వెబ్‌సైట్ వద్ద ఉండవు. ఆ వ్యక్తి స్త్రీయా, పురుషుడా, వయసెంత లాంటి కనీస వివరాలు సైతం ఉండవు. ఇందులో పాల్గొంటున్నవారు తమ అంతరాత్మని, మనసుని నమ్ముకుని ముందుకు వెళ్లాల్సిందే. అయితే ఇది కళాత్మకమైన ప్రాజెక్టు అని, న్యూయార్క్ ప్రాంతంలో నివసిస్తున్న వందమందిని మాత్రమే ఇందులో ఎంపిక చేస్తున్నామని స్మెల్ డేటింగ్ సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.