కన్నయ్య కుమార్ పై రాజద్రోహ నేరం మోపింది ఈ ఉపన్యాసానికే
(‘రాజద్రోహం’ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడానికి కొద్ది ముందు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటర్నెట్‌పై యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.) …వాళ్లు త్రివర్ణ పతాకాన్ని కాల బెట్టే వాళ్లు. బ్రిటిష్ వాళ్లను క్షమాభిక్ష వేడు కున్న సావర్కర్‌కు శిష్యులు వాళ్లు. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్ ప్రభుత్వం వాళ్లదే. ఈ ప్రభుత్వం షహీద్ భగత్‌సింగ్ పేరుతో ఉన్న విమానాశ్రయానికి ఒక ‘సంఘీయుడి’ […]
(‘రాజద్రోహం’ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడానికి కొద్ది ముందు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటర్నెట్‌పై యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.)
…వాళ్లు త్రివర్ణ పతాకాన్ని కాల బెట్టే వాళ్లు. బ్రిటిష్ వాళ్లను క్షమాభిక్ష వేడు కున్న సావర్కర్‌కు శిష్యులు వాళ్లు. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్ ప్రభుత్వం వాళ్లదే. ఈ ప్రభుత్వం షహీద్ భగత్‌సింగ్ పేరుతో ఉన్న విమానాశ్రయానికి ఒక ‘సంఘీయుడి’ పేరు పెట్టింది. వీళ్లా మాకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పేది? దేశం గురించి, దేశభక్తి గురించి ఆర్‌ఎస్‌ఎస్‌తో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం…. మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం. మా దష్టిలో దేశభక్తి అంటే ఇదే. మాకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే వాళ్లను మేం సహించబోమని కూడా స్పష్టం చేస్తున్నాం. ‘సంఘీయులే’ కానివ్వండి, లేదా మరెవరైనా సరే…
అయితే, ‘ఝండేవాలా’ (ఆర్‌ఎస్‌ఎస్ ఢిల్లీ కార్యాల యం)లో, ‘నాగపూర్’ (ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం)లో నిర్వచించే రాజ్యాంగంపై మాత్రం మాకెలాంటి విశ్వాసం లేదు! మాకు మనుస్మతిపై ఎలాంటి విశ్వాసం లేదు. ఈ దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థపై మాకు విశ్వాసం లేదు! అట్లాగే, ఇదే రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ‘రాజ్యాంగ పరిహారం’ గురించి కూడా చెప్పారన్న విషయం మరచిపోవద్దు. మరణశిక్షను రద్దు చేయాలని కూడా అంబేద్కర్ అభిప్రాయపడ్డారన్న విషయం మర్చిపోవద్దు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆయన సర్వోన్నత స్థానం ఇచ్చారన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నింటితో సహా, మన మౌలిక హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను నిలబెట్టుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.
కానీ ఈరోజు ఏబీవీపీ తనకున్న మీడియా అండతో ఈ విషయాన్ని పూర్తిగానే తారుమారు చేయడం చాలా సిగ్గుచేటు.. బాధాకరం కూడా. విషయాన్ని అది పూర్తిగా నీరు గారుస్తోంది. నిన్న ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మాట్లాడు తూ, ‘మేం ఫెలోషిప్ కోసం పోరాడుతామ’ని చెప్పాడు. ఎంత హాస్యాస్పదం ఇది! ఇప్పటికే వీళ్ల ప్రభుత్వం, మేడం ‘మను’స్మతి ఇరానీ ఫెలోషిప్‌లు లేకుండా చేసేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్లో వీళ్ల ప్రభుత్వం 17 శాతం కోత విధించారు. దాంతో మన హాస్టళ్లు గత నాలుగేండ్లుగా అఘోరిస్తున్నాయి. మనకు వై-ఫై లభ్యం కాలేదు. బీహెచ్‌ఈఎల్ ఒక బస్సుని వ్వగా, దాంట్లో చమురు పోయడానికి అధికారుల వద్ద డబ్బు లేదు! ఏబీవీపీ వాళ్లు మాత్రం మేం హాస్టళ్లు నిర్మింపజేస్తా మని, వై-ఫై తెప్పిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తున్నారు.
మిత్రులారా! ఈ దేశంలో మౌలిక ప్రశ్నలపై చర్చ ప్రారంభిస్తే వీళ్ల ముసుగు తొలగిపోతుంది. మేం మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకు గర్విస్తున్నాం. వాటిపై చర్చ చాలా అవసరం…జేఎన్‌యూలో జెహాదీలున్నారని సుబ్రమ ణ్యస్వామి అన్నాడు. జేఎన్‌యూ వాళ్లు హింసను వ్యాపింప జేస్తున్నారని అంటున్నారు. నేనీ జేఎన్‌యూ గడ్డ మీది నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తలను సవాల్ చేస్తున్నాను. రండి, మాతో వాదించండి! మేమసలు ‘హింస’కు సంబంధించిన మౌలిక అవగాహనపైనే చర్చ చేయాలనుకుంటున్నాం. ‘ఖూన్ సే తిలక్ కరేంగే, గోలియోంసే ఆరతీ’ (నెత్తుటితో తిలకం దిద్దుకుంటాం, తుపాకీ గుళ్లతో హారతి) అని ఏబీవీపీ వాళ్లు చేస్తున్న నినాదాల గురించి కూడా మాట్లాడుకుందాం రండి. ఈ దేశంలో మీరెవరెవరి రక్తం పారించాలను కుంటున్నారో చెప్పండి. ఎవరిపై తూటాలు పేల్చాలను కుంటున్నారో చెప్పండి. అవును, మీరు తుపాకీ గుళ్లు కురిపించారు… బ్రిటిష్ వాళ్లతో చేయి కలిపి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే వాళ్లపై గుళ్లు కురిపించారు. దేశంలో పేదరికంతో, ఆకలితో పీడితులైన వాళ్లపై మీరు గుళ్లు కురిపించారు. మీరు ముస్లింలపై గుళ్లు కురిపించారు.
మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తే, ‘ఐదు వేళ్లు సమానమవుతాయా’ అని మీరంటారు. మహిళలు ‘సీత’ లాగా ఉండాలని, అగ్నిపరీక్షకు దిగాలని మీరంటారు. ఈ దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం కదా! ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కుండాలి కదా! విద్యార్థులైనా, ఉద్యోగులైనా, పేదలైనా, కార్మికులైనా, రైతులై నా… అంబానీ అయినా, అదానీలైనా అందరికీ హక్కులు సమానమే కదా! కానీ మహిళల సమాన హక్కుల గురించి మాట్లాడితే, భారతీయ సంస్క తిని నాశనం చేయాలను కుంటున్నారని మీరు గొంతు చించుకుంటారు. నిజమే, మేం మీ దోపిడీ సంస్కతిని నిజంగానే నాశనం చేయాలనుకుం టున్నాం! మీ కులతత్వ సంస్కతిని నాశనం చేయాలనుకుం టున్నాం. మీ మనువాద సంస్క తిని నాశనం చేయాలనుకుం టున్నాం. అసలు సంస్కతికి నిర్వచనాన్నే మర్చాలని మేమంటున్నాం. అసలు వీళ్లకు సమస్య ఎక్కడొస్తోంది? మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీరికి కడుపుమంటగా ఉంది. ‘లాల్ సలాం’తో పాటు ‘నీలా సలాం’ అని మనం నినదిస్తే, మార్క్స్‌తో పాటు బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడితే వీరికి మింగుడు పడకుండా ఉంది…. కుట్ర వీళ్లదే. వీళ్లసలు బ్రిటిష్ వాళ్ల తొత్తులు! కావాలంటే నాపై పరువు నష్టం కేసు పెట్టుకోండి. ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రే బ్రిటిష్ వాళ్లతో కుమ్మక్కయిన చరిత్రని మళ్లీ మళ్లీ అంటాను! ఈ దేశద్రోహులు మనల్ని దేశభక్తి సర్టిఫికేట్ చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
నా మొబైల్‌ను పరిశీలించండి మిత్రులారా! మా తల్లిని నానా రకాల బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. వీళ్లేనా భారతమాత గురించి మాట్లాడేది? ఒకవేళ మీరు చెప్పే ‘భారతమాత’లో నా తల్లి భాగం కాకపోతే నేను ‘భారతమాత’ అనే మీ అవగాహనను నేనంగీకరించను. నా తల్లి ఆంగన్‌వాడీ సేవకురాలిగా పని చేస్తోంది. రూ. 3,000లతో మా కుటుంబం బతుకుతోంది. ఆమెను వీళ్లు బూతులు తిడుతున్నారు. వీళ్ల ‘భారతమాత’ నినాదానికి నేను సిగ్గు పడుతున్నాను. ఈ దేశంలో ఉన్న నిరుపేద, దళిత, రైతుకూలీల తల్లులెవరూ వీళ్ల ‘భారతమాత’ పరిధిలోకి రారు. నేనంటాను ‘జై’! దేశంలోని మాతలందరికీ జై! తండ్రులం దరికీ జై! అక్కాచెల్లెండ్లకు జై! రైతుకూలీలకు, కార్మికులకు, ఆదివాసీలకు, దళితులకు జై! వాళ్లకు ఇలా అనే దమ్ముందా? ఉంటే అనమనండి. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని అనమ నండి వీళ్లను. ‘భగత్‌సింగ్ జిందాబాద్’ అనమనండి. ‘సుఖ ్‌దేవ్ జిందాబాద్’ అనమనండి. ‘అష్ఫాఖుల్లా ఖాన్ జిందా బాద్’ అనమని అనండి. ‘బాబా సాహెబ్ అంబేద్కర్ జిందాబాద్’ అనమనండి.
బాబా సాహెబ్ 125వ జయంతి పేరుతో మీరాడిందంతా నాటకం! మీకు ధైర్యముంటే, బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ దేశంలో కులవాదమే అతి పెద్ద సమస్య అని ఒప్పుకోండి. కులతత్వం గురించి మాట్లాడండి. రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేయండి…. అప్పుడు నమ్ముతాం మీకు ఈ దేశంపై విశ్వాసం ఉందని. అసలు దేశమంటే ఏమిటి? దేశమంటే మనుషులు! దేశం గురించిన మీ అవగాహనలో పేదలకు, నిస్సహాయు లకు, రైతుకూలీలకు, ఆదివాసులకు, దళితులకు చోటే లేదు. నేను నిన్నొక టీవీ డిబేట్‌లో మాట్లాడాను. దీపక్ చౌరాసి యాతో చెప్పాను. ఇది చాలా సీరియస్ సమయం అనే విషయం గుర్తుంచుకోండని అన్నాను. దేశంలో పడగ విప్పుతున్న ఫాసిజంతో మీ మీడియాకు కూడా ముప్పేనని చెప్పాను. ఇకపై మీక్కూడా సంఫ్‌ు కార్యాలయం నుంచే స్క్రిప్టులు వస్తాయని అన్నాను. సరిగ్గా ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి వచ్చినట్టుగానే.
కొంత మంది మీడియా వాళ్లు అంటున్నారు. మా పన్నులతో, సబ్సిడీ డబ్బులతో జేఎన్‌యూ నడుస్తుంది అని. అవును నిజమే! అనుమానమేమీ లేదు. కానీ అసలు విశ్వ విద్యాలయాలు ఉన్నది దేని కోసం అని మేమడుగుతున్నాం. విశ్వవిద్యాలయాలుండేది సమాజంలోని ‘కామన్ కాన్సెన్స్’ (సామూహిక చేతన)ను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికే. అవి ఆ పని చేయకపోతే దేశమే సరిగా నడవదు. అలాంటి దేశం కేవలం పెట్టుబడిదారులకు నెలవుగా మాత్రమే మిగిలి పోతుంది. దోపిడీ, పీడనలకు మాత్రమే ఆలవాలంగా మారి పోతుంది. దేశ ప్రజల సంస్క తి, విశ్వాసాలకు, హక్కులకు స్థానం లేనప్పుడు అసలు దేశం అనే మాటలో అర్థమే లేదు.
మేం ఈ దేశంతో పాటుగా సంపూర్ణంగా నిలబడి ఉన్నాం. భగత్‌సింగ్, బాబాసాహెబ్ కన్న కలల కోసం నిలబడి ఉన్నాం. అందరికీ సమాన హక్కులుండాలన్న అవగాహనతో నిలబడ్డాం. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్ విషయంలో జరిగిట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని కోరే వాళ్లం మేం. ప్రపంచ మానవత వర్ధిల్లాలి. భారత మానవత వర్ధిల్లాలి అని మేమంటాం. మానవత్వానికి వ్యతిరేకంగా నిలబడిందెవరో మేం గుర్తిం చాం. మనువాదం, కులవాదం.. బ్రాహ్మణ వాదంతో కుమ్మక్కయిన పెట్టుబడిదారీ విధానం – ఇవే మానవత్వానికి శత్రువులు. వీటి ముఖాలను బట్టబయలు చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన స్వాతంత్య్రం దేశంలో నెలకొల్పాలి. ఆ స్వాతంత్య్రం రాజ్యాంగం ద్వారానే వస్తుంది. పార్లమెంటు ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యం ద్వారా వస్తుంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన మధ్య ఎన్ని విభేదాలున్నా, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, రాజ్యాంగం కోసం, దేశ సమగ్రత కోసం మనందరం ఐక్యంగా నిలబడదాం. సంఘీయులే మన దేశాన్ని చీలదీసే శక్తులు… ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులు.
ఇక చివరి ప్రశ్న. కసాబ్ ఎవరు? అఫ్జల్ గురు ఎవరు? శరీరాలపై బాంబులు కట్టుకొని హత్యలు చేయడానికి సిద్ధపడుతున్న ఆ పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నను విశ్వ విద్యాల యాల్లో చర్చించకపోతే అవి ఉండీ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. హింసను కూడా నిర్వచించుకుందాం. హింస అంటే ఏమిటి? తుపాకీ తీసుకొని ఒకరిని చంపడమే హింస కాదు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి నిరాకరిస్తే అది కూడా హింసే అవుతుంది. ఇది వ్యవస్థీకృత హింస. న్యాయం అంటే ఏమిటి? దీనిని నిర్ణయించేదెవరు? బ్రాహ్మణవాద వ్యవస్థలో దళితులకు మందిరంలోకి ప్రవేశం లేదు. ఆనాడు అదే న్యాయం. బ్రిటిష్ కాలంలో కుక్కలకు, భారతీయులకు రెస్టారెంట్లలోకి ప్రవేశం లేదనేవారు. అప్పటికి అదే న్యాయం. కానీ ఈ న్యాయాన్ని అప్పుడూ సవాలు చేశారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెప్పే న్యాయాన్ని మేం సవాల్ చేస్తున్నాం. మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం. ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హౌదాను కల్పించినప్పుడే, ఆ రోజునే మేం ఇది న్యాయమని ఒప్పుకుం టాం. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఏ రకమైన హింసనూ, ఏ ఉగ్రవాదినీ, ఏ ఉగ్రవాద సంఘటననూ, ఎలాంటి దేశ వ్యతిరేక చర్యనూ ఏ రకంగానూ సమర్థించదని నేను స్పష్టం చేస్తున్నాను. కొంత మంది… గుర్తు తెలియని వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. దానిని జేఎన్‌యూ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తోంది….
తెలుగు సేత: జి.వి.కె. ప్రసాద్