ఏది జాతి వ్యతిరేకత...ఏది దేశద్రోహం!
ఆమె గళాన్ని, సంగీతాన్ని తన పోరాట పథంగా ఎంచుకున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి అందుబాటులోకి రావాలంటూ పాటతోనే ఉద్యమిస్తున్నారు. ఆమే శీతల్ సాథి. దళితుల హక్కులకోసం, ముఖ్యంగా దళిత మహిళలకోసం పోరాడుతున్నసాంస్కృతిక కార్యకర్త, కవి, గాయని. పుణెకి చెందిన శీతల్ మహారాష్ట్ర లోని కబీర్ కళా మంచ్ అనే సాంస్కృతిక సంస్థలో ప్రథాన పాత్ర పోషించారు. మావోయిజాన్ని, నక్సలిజాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో కళాకారుల మీద కూడా యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ తన ఉక్కుపాదం మోపినపుడు, కబీర్ […]
ఆమె గళాన్ని, సంగీతాన్ని తన పోరాట పథంగా ఎంచుకున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి అందుబాటులోకి రావాలంటూ పాటతోనే ఉద్యమిస్తున్నారు. ఆమే శీతల్ సాథి. దళితుల హక్కులకోసం, ముఖ్యంగా దళిత మహిళలకోసం పోరాడుతున్నసాంస్కృతిక కార్యకర్త, కవి, గాయని. పుణెకి చెందిన శీతల్ మహారాష్ట్ర లోని కబీర్ కళా మంచ్ అనే సాంస్కృతిక సంస్థలో ప్రథాన పాత్ర పోషించారు. మావోయిజాన్ని, నక్సలిజాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో కళాకారుల మీద కూడా యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ తన ఉక్కుపాదం మోపినపుడు, కబీర్ కళామంచ్ కళాకారులతో పాటు 2011లో ఆమె అజ్ఞాతంలోని వెళ్లారు. తోటి కళాకారుడైన సచిన్ మాలిని వివాహం చేసుకున్నారు. అజ్ఞాతం నుండి భర్తతో పాటు బయటకు వచ్చారు. అయితే తమది లొంగుబాటు కాదని, భావ ప్రకటన స్వేచ్ఛకోసం సత్యాగ్రహం చేసేందుకే బయటకు వచ్చామని ప్రకటించారు. ఆ సమయంలో భర్త సచిన్ మాలితో కలిసి జైలుకి కెళ్లారు. ఆమె భర్త రెండున్నర ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. శీతల్ 2013లో బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఈ దేశంలో ఎవరైతే కుల వివక్షమీద పోరాటం చేస్తారో, ఎవరైతే సమసమాజం కోసం ఆరాటపడతారో వారిమీదే జాతి వ్యతిరేకులనే ముద్రపడుతుందని, అదే విచిత్రమని అంటున్నారు శీతల్ సాథి. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య మీద ఢిల్లీలో తన గళం విప్పడానికి, గానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె దేశభక్తులు, దేశద్రోహులు, సాంస్కృతిక ఉద్యమాలు సమాజంలో మార్పులు తెస్తాయా… తదితర అంశాల మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు-
-ఈదేశంలో ఎవరైతే కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతి నిర్మాణం కోసం శ్రమిస్తుంటారో వారిపైనే జాతికి వ్యతిరేకులనే ముద్రని వేస్తారు. అలా చూస్తే మనమంతా జాతికి వ్యతిరేకులమే అనుకోవాలి. కబీర్ కళా మంచ్ కళాకారులను అరెస్టు చేసినపుడు ఇక ఎవరు నిజమైన దేశభక్తులు అనే ఆశ్చర్యం కలిగింది నాకు.
-దేశ భక్తి అనేది మనుషులను బట్టి, పార్టీలను బట్టి మారుతోంది. వర్ణవ్యవస్థ, పితృస్వామ్య భావజాలం నుండి పుట్టిన బిజెపిలో అలాంటి భావాలే ఉంటాయి. అది మహిళలను ఆ దృష్టిలోనే చూస్తుంది. అలాగే ఎవరైనా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారు దేశద్రోహులు అవుతారు. అందుకే రోహిత్ వేముల కూడా దేశద్రోహి అయ్యాడు. తాను ఎదుర్కొన్న వివక్షని ప్రశ్నించడమే అతను చేసిన తప్పు. ఇక్కడ ఆహారపు అలవాట్లు కూడా దేశద్రోహమే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అదెప్పుడూ దేశభక్తి విషయంలో తానేమిటన్నది స్పష్టం చేయలేదు. నేను చెబుతున్నా, నాలో దేశభక్తి ఉంది, అలాగే నేను రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను.
-అధికారంలో ఉన్న పార్టీకి బలం ఉంటుంది. అదివారిలో విశ్వాసాన్ని నింపుతుంది. అందుకే తామేం చేసినా కరెక్టే అనే ధోరణిలో ఉంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాంగ్రెస్ తాను సెక్యులర్ అని చెప్పినా అది తన స్టాండ్ ఏమిటో ఎప్పుడూ స్పష్టం చేయలేదు. బిజెపి అందుకు భిన్నం. ఎక్కువమంది దాని సిద్ధాంతాలను అనుసరించడం, అధికారం, శక్తి కలిగి ఉండటం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే దాని భావజాలమే రాజకీయ నేపథ్యంలోనూ పనిచేసింది. ఇప్పుడు ఆ బలంతోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకుంటున్నవారిని, భావ ప్రకటనా స్వేచ్ఛని కావాలంటున్నవారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.
-ఎవరైతే కులాల నిర్మూలనకు నడుం కడుతున్నారో వారంతా అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న వారే. కుల వ్యవస్థని ఆచరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఎప్పుడూ పోరాటం ఉంటుంది.
-కులం పుట్టుకతో వస్తుంది. కానీ ఆదర్శ భావజాలం అనేది అలా రాదు. బిజెపితో ఉంటూ కుల వ్యవస్థని నమ్మేవారు ఎప్పటికీ అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించేవారు కాబోరు.
-కుల వ్యవస్థ నిర్మూలనకు బిజెపి వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటో ప్రజలకు చెప్పాలి,
-కబీర్ కళా మంచ్ భావాలు మావోయిజంకి వ్యతిరేకం. మనకున్న రాజ్యాంగాన్ని దాని విధానాలను మేము నమ్ముతున్నాం.
-నేను శిక్షణ పొందిన గాయకురాలిని. నేను నమ్మిన సిద్ధాంతాలను బలపరచడానికి, నమ్మని వాటిని వ్యతిరేకించడానికి నాకున్న మార్గం ఇదే. సంగీతంతో సాంస్కృతిక విప్లవం సాధ్యమేనని నేను నమ్ముతున్నా. క్యాంపస్‌ల్లో పాడనీయకపోతే రోడ్లమీద పాడతా, ఎక్కడైనా పాడతా. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో, అంబేద్కర్ యూనివర్శిటీల్లో పాడా. ప్రెస్‌క్లబ్ ఆప్ ఇండియాలో పాడా. ప్రజలు నా పాటలు విన్నారు.
-రాజ్యాంగం మనకు మాట్లాడే హక్కుని ఇచ్చింది. అయితే అది అందరికీ దక్కడం లేదు. మహిళల్లో దళిత మహిళలు మరింత దిగువన ఉన్నారు. నేను దళిత మహిళనే. సమాజంలో వీరి స్థానం అట్టడుగున ఉంది. వారు తమ కులంలోనూ, బయటా కూడా పోరాటం చేస్తున్నారు. వారు కుల వివక్షమీదే కాదు, సమాజంలో తమస్థాయి మీద కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్లు నోరువిప్పే వరకు భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది కేవలం రాజ్యాంగంలో మాత్రమే ఉంటుంది. అందుకే నేను వారందరికీ ప్రాతినిథ్యం వహిస్తూ నా గళం వినిపిస్తున్నా. రోహిత్ వేముల గురించి పాటపడమని నన్ను కోరినపుడు నా పాటలో వాళ్లే ఉంటారు. ఎవరైతే యూనివర్శిటీల్లో పాతుకుపోయిన కులవ్యవస్థకు బలైపోతున్నారో వారే. వారిగురించే పాడుతున్నా.