Telugu Global
Cinema & Entertainment

ఫీల్ గుడ్ + కామెడి = కృష్ణాష్టమి

రేటింగ్‌ :3/5 విడుదల తేదీ : 19 ఫిబ్రవరి 2016 దర్శకత్వం :  వాసు వర్మ ప్రొడ్యూసర్ : దిల్ రాజు బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంగీతం :  దినేష్  నటీనటులు : సునీల్, నిక్కి గల్లాని, డింపుల్ చొపాడే ప్రముఖ కథా రచయిత ఓ. హెన్రీ వందేళ్ళ క్రితం ఒక కథ రాసాడు. ఒక పల్లెటూళ్ళో ఇద్దరి మధ్య శత్రుత్వం. అందులో ఒకడు పల్లెనుంచి పారిపోతాడు. వాడిని చంపాలని ఇంకొకడు చాలా ఏళ్ళు వెతుకుతాడు. చివరికి వాడు ఒక […]

ఫీల్ గుడ్ + కామెడి = కృష్ణాష్టమి
X

రేటింగ్‌ :3/5
విడుదల తేదీ : 19 ఫిబ్రవరి 2016
దర్శకత్వం : వాసు వర్మ
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
సంగీతం : దినేష్
నటీనటులు : సునీల్, నిక్కి గల్లాని, డింపుల్ చొపాడే

ప్రముఖ కథా రచయిత ఓ. హెన్రీ వందేళ్ళ క్రితం ఒక కథ రాసాడు. ఒక పల్లెటూళ్ళో ఇద్దరి మధ్య శత్రుత్వం. అందులో ఒకడు పల్లెనుంచి పారిపోతాడు. వాడిని చంపాలని ఇంకొకడు చాలా ఏళ్ళు వెతుకుతాడు. చివరికి వాడు ఒక సిటిలో వున్నాడని తెలుస్తుంది. కత్తిని పదును పెట్టుకుని పల్లెనుంచి నగరానికి బయలుదేరుతాడు. నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఎవడో పర్స్‌ కొట్టేస్తాడు. నగరంలో ఎవరూ తెలియదు. తిండిలేదు, ఆకలి. కాని శత్రువు ఎక్కడున్నాడో తెలుసు. వాడిని వెతుకుతూ వెళతాడు. ఒకచోట కనిపిస్తాడు.

పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకుంటాడు. “ఇంత పెద్ద సిటీలో నువ్వు ఒక్కడే నాకు తెలిసినోడు, మనూరోడివి. చార్జీలకు డబ్బులిచ్చి ఊరికి పంపిచెయ్‌రా” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. “నన్ను చంపుదామని వచ్చావు కదరా” అని శత్రువు అంటే “ఈ సిటీలో బతకడమే ఒక చావు, ఇక మళ్ళీ నిన్ను చంపడమెందుకురా” అని పల్లెకు వెళ్ళిపోతాడు.

ఈ కథకి కృష్ణాష్టమి సినిమాకి సంబంధమేంటి? సంబంధముంది. ఒక పల్లెటూరిలో నాలుగు గోడల మధ్య ఉంటేనే పగలు, ప్రతీకారాలు. అదే ఒకసారి జీవితం విలువ తెలిస్తే ఆ పదాలకు పెద్ద అర్ధముండదు. ఈ సినిమా క్లైమాక్స్‌లో దర్శకుడు వాసువర్మ చెప్పిన అందమైన కాన్సెప్ట్‌ ఇది.

కృష్ణాష్టమి కథలో పెద్ద విశేషమేంలేదు. కథ చెప్పిన విధానమే బాగుంది. మర్యాదరామన్న, సంతోషం సినిమాలను మిక్స్‌చేస్తే కృష్ణాష్టమి. ఈ టైటిల్‌కి సినిమాకి ఏమి సంబంధంలేదు. చివర్లో హీరోతో ఉట్టి కొట్టిస్తారు అదొకటే జస్టిఫికేషన్‌.

హీరో సునిల్‌ చిన్నప్పటినుంచి అమెరికాలో ఉంటాడు. అతనికి ఇండియాకి రావాలని కోరిక. అయితే పెదనాన్న ముఖేష్‌రుషి ఏదో ఒక కారణం చెప్పి ఆపుతూవుంటాడు. హీరో ఇండియాకి రావడం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఇండియా మీద ప్రేమతో ఎవరికీ చెప్పకుండా కమెడియన్‌ సప్తగిరితో కలిసి విమానం ఎక్కేస్తాడు. మధ్యలో విమానం కాన్సిల్‌ అయ్యి యూరప్‌లో మూడురోజులు ఆగాల్సి వస్తుంది. అప్పుడు పల్లవి (నిక్కిగల్లాని) ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమవుతుంది. పల్లవిజం అని తనకు తానే ఒక థియరీ తయారుచేసుకుని అందరి బుర్రలు తింటూవుంటుంది. పిచ్చికి పిచ్చే మందని హీరో గ్రహించి లేని క్యారెక్టర్‌ని ఒక దాన్ని సృష్టించి నేనొక్కడినే సినిమా థియరీతో ఆమెని ప్రేమలో పడేస్తాడు (స్త్రీకి ఒక మెదడు ఉంటుంది అని రచయిత చలం వందేళ్ళక్రితం అన్నాడు. కానీ హీరోయిన్‌కి మెదడు ఉండాల్సిన అవసరంలేదని మన సినిమావాళ్ళు వందేళ్ళ తరువాత కూడా స్పష్టంగా నమ్ముతున్నారు. ఇదో పరంపర).

ఇదిలావుంటే అదే ఫ్లయిట్‌లో అజయ్‌ తన ఐదేళ్ళ కుమారుడితో ఇండియాకి వస్తూవుంటాడు. అప్పటికే హీరో ఇండియాకి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్‌ రావడంతో ఎయిర్‌ పోర్ట్‌లో విలన్‌మనుషులు ఎదురుచూస్తూవుంటారు. వాళ్ళు చిత్రం శీనుని టాయిలెట్‌లో చంపడం అజయ్‌ చూస్తాడు. తరువాత అజయ్‌, సునిల్‌ కలిసి చిత్తూరు బయలుదేరుతారు. దారిలో ఎటాక్‌ జరిగి అజయ్‌ గాయపడతాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్చి పిల్లవాడిని తాతగారింట్లో చేర్పడానికి హీరో బయలుదేరుతాడు. అయితే ఆ ఇంట్లోవాళ్ళు అతన్ని తమ అల్లుడని పొరబడుతారు. ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు చాలా ఏళ్ళుగా చంపాలని ఎదురు చూస్తున్న వ్యక్తి తానేనని హీరోకి తెలుస్తుంది. ఇది ఇంటర్వెల్‌బ్లాక్‌.

సెకెండాఫ్‌లో ఆ ఇంట్లోనే ఉండి హీరో ఏం చేశాడన్నది కథ. పగలు ప్రతీకారాలకు ఎలా పుల్‌స్టాఫ్‌ పెట్టాడన్నది తెరపై చూడాల్సిందే. చాలా గ్యాప్‌ తర్వాత కనిపించినా సునిల్‌ చాలా ఎనర్జిటిక్‌గా, గ్లామరస్‌గా ఉన్నాడు. డ్యాన్స్‌లు, ఫైట్లు బ్రహ్మాండంగా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన కన్నీళ్ళు పెట్టిస్తుంది. సప్తగిరి, పోసాని కామెడి పరవాలేదు. పంచ్‌ డైలాగులు పేలాయి. చివరి పదినిముషాల్లో బ్రహ్మానందం మిర్రర్‌ కామెడి వర్కవుట్‌ అయ్యింది. చెప్పుకోవాల్సిన విషయం ఛోటాకె నాయుడి కెమెరా పనితనం. పాటలు, ఫైట్లలో కెమెరా విజృంభించింది. కనీసం ఒకటిరెండు పాటలు తగ్గించి ఇంకో 15 నిముషాలు ట్రిమ్‌ చేసుంటే సినిమాకి బలం పెరిగేది. పృథ్వి వున్నా ఆయన మార్క్‌ కామెడి కనిపించలేదు. మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి.

దర్శకుడు వాసు వర్మ క్రియేటివిటి చాలా ఫ్రేమ్స్‌లో కనిపిస్తుంది. కానీ ప్రేమజంటకు పెళ్ళిచేయడం, ఫైట్‌ చేయడంతో హీరో ఇంట్రడక్షన్‌ అనేది చాలాపాత వూరగాయసీన్‌, క్రియేటివిటి వున్న దర్శకులు వూరగాయల జోలికి పోకుండా వుంటేనే ఆరోగ్యం.

హీరోయిన్‌ నిక్కి అందంగా ఉంది. మొహంపై భావాలు పలికించడానికి మాత్రం కష్టపడింది. ప్రేమలో పడి సెకెండాప్ లో పల్లవిజం మరిచిపోయింది. షేక్‌స్పియర్‌ కాలంలో ఫోన్లు, ఫొటోలు లేవుకాబట్టి ఒకర్ని చూసి ఇంకొకరిగా తికమకపడ్డారంటే అర్థముంది. వాట్సప్‌లకాలంలో కూడా ఒకర్ని చూసి ఇంకొకరిగా పొరపాటుపడతారా? ( హీరోను చూసి విలన్ కుటుంబమంతా తమ అల్లుడు అనుకోవడం) లాజిక్‌ జోలికెళితే మ్యాజిక్‌ పోతుంది.

గోవా చూపించి విలన్ అండ్ కోకి జీవితంమీద ప్రేమ కలిగించేలా చేయాలనుకోవడం బాగుంది. రాయలసీమలో సినిమాల్లో చూపిస్తున్నంత ఫ్యాక్షనిజం ఇప్పుడు లేదు. దీనికి కారణం జీవితంమీద ప్రేమ కలగడమే. కొత్తతరం ప్రపంచాన్ని చూడ్డానికి అలవాటుపడి కత్తులు, బాంబుల్ని విసిరికొట్టి చాలాకాలం అయింది. ఫ్యాక్షన్ కుటుంబాలకు చెందిన యువతరం బ్యాంకాక్ వెళ్లి తాయ్ మసాజ్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంది. అంతేకాని అనుచరులతో ఒళ్ళు పట్టించుకోవాలని కోరుకోవడం లేదు. ఇంకా ష్యాక్షనిస్టులు మిగిలివుంటే వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైన్ వేసి గోవా చూపించేస్తే వర్కవుట్ అవుతుంది.

సినిమా అక్కడక్కడ నత్తనడక నడిచినా వెంటనే లేచి నిలబడి గిత్తలా పరిగెత్తింది. మొత్తం మీద కృష్ణాష్టమి ఎంటర్‌టెయినర్‌ మాత్రమే కాదు ఫీల్‌గుడ్‌మూవీ. ఈ క్రెడిట్‌ సునీల్‌, వాసువర్మలకి దక్కుతుంది.

– జి ఆర్‌. మహర్షి

Click on image to read

Prabhas-NTR

Kona-Venkat

rajinikanth-333

sarainodu

kejriwal Suraj-Pancholi krish-varun

Click on image for Nikki Garlrani latest Stills Nikki-Garlrani-FI-Y

First Published:  19 Feb 2016 8:35 AM IST
Next Story