కొడాలిపైనా వేటు తప్పదా?
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ ఊహించినట్టే నివేదికను సిద్ధం చేసింది. రోజా, నానిల ప్రవర్తన సభలో సరిగ్గా లేదంటూ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నిర్ధారించింది. కమిటీ తుది సమావేశం శుక్రవారం జరిగింది. ప్రవర్తన సరిగా లేని సభ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. తాజా నివేదిక ఆధారంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?. […]
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ ఊహించినట్టే నివేదికను సిద్ధం చేసింది. రోజా, నానిల ప్రవర్తన సభలో సరిగ్గా లేదంటూ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నిర్ధారించింది. కమిటీ తుది సమావేశం శుక్రవారం జరిగింది. ప్రవర్తన సరిగా లేని సభ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. తాజా నివేదిక ఆధారంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?. కొడాలి నానిపైనా రోజా తరహాలోనే చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి. నివేదికను తొలుత ఎథిక్స్ కమిటీకి, అనంతరం ప్రివిలేజ్ కమిటీకి సమర్పించనున్నారు.
అయితే కమిటీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసభ్యపదజాలం వాడినా వారిపై మాత్రం కమిటీ దృష్టి సారించలేదు. కేవలం రోజా, కొడాలి నానిపైనే ఫోకస్ పెట్టింది. కమిటీలో వైసీపీ తరపున సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ నివేదికపై తీవ్రంగా స్పందించారు. కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి వీడియోను బయటకు లీక్ అవడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామని తాను సూచించినా కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు.
వైసీపీ సభ్యులను టార్గెట్ చేసేందుకు కమిటీ పనిచేసిందని ఆరోపించారు. కమిటీ నివేదికతో విభేదిస్తూ తాను అసమ్మతి లేఖ ఇచ్చినట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మైకు ఇచ్చి, ప్రతిపక్ష నేతను దూషించే విధానానికి స్వస్తి పలికేలా నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కమిటీలో బుద్దప్రసాద్ నేతృత్వంలోని కమిటీలో టీడీపీ నుంచి శ్రావణ్ కుమార్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రావు, వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. కమిటీలో మిత్రపక్షమైన బీజేపీతో కలుపుకుంటే అధికారపక్షందే పైచేయి.