ప్రమాద సమయంలో... ప్రాణాలు నిలుపుదాం!
హఠాత్తుగా మనముందే ఎవరైనా గుండెపోటుకి గురికావడం లేదా రోడ్డు ప్రమాదాల్లో మన కళ్లముందే ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం…ఇవి గుండెలను పిండేసే సంఘటనలు. ఇలాంటపుడు నిస్సహాయంగా అలా చూస్తూ ఉండటం నరకంలా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో దగ్గరున్నవారు సరిగ్గా స్పందిస్తే ప్రమాదంలో ఉన్నవారికి ఆపద్బాంధవులే అవుతారు. అందుకే అలాంటి నైపుణ్యాలు ఏవైనా సరే ప్రతి మనిషీ నేర్చుకుని ఉండాలి. తప్పనిసరిగా వాటిపై అవగాహన కలిగి ఉండాలి. ఇదే ఆశయంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు లలితా రఘురామ్. […]
హఠాత్తుగా మనముందే ఎవరైనా గుండెపోటుకి గురికావడం లేదా రోడ్డు ప్రమాదాల్లో మన కళ్లముందే ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం…ఇవి గుండెలను పిండేసే సంఘటనలు. ఇలాంటపుడు నిస్సహాయంగా అలా చూస్తూ ఉండటం నరకంలా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో దగ్గరున్నవారు సరిగ్గా స్పందిస్తే ప్రమాదంలో ఉన్నవారికి ఆపద్బాంధవులే అవుతారు. అందుకే అలాంటి నైపుణ్యాలు ఏవైనా సరే ప్రతి మనిషీ నేర్చుకుని ఉండాలి. తప్పనిసరిగా వాటిపై అవగాహన కలిగి ఉండాలి. ఇదే ఆశయంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు లలితా రఘురామ్. ‘స్వామినారాయణ్ లైఫ్ సేవర్స్’ అనే కార్యక్రమం ద్వారా ప్రజలను అప్రమత్తులను చేస్తున్నారామె. 22ఏళ్ల కన్నకొడుకుని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆమె ఇతరుల కన్నీళ్లు తుడుస్తూ జీవన ప్రయాణం చేస్తున్నారు. మోహన్ ఫౌండేషన్ ద్వారా అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రయత్నాల ద్వారా ఎంతోమంది పునర్జన్మను పొందేందుకు తమవంతు సహాయం అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె 2013లో తన కుమారుని పేరుమీద ”స్వామినారాయణ్ లైఫ్ సేవర్స్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు తదితర సందర్భాల్లో అక్కడ ఉన్నవారు బాధితుల పట్ల స్పందించాల్సిన విధానాలను, నైపుణ్యాలను ఈ కార్యక్రమం ద్వారా నేర్పుతున్నారు. ప్రమాదం జరిగినవారికి మరింత హాని కలగకుండా చాలా జాగ్రత్తగా ఈ విధానాలను ప్రయోగించాల్సి ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు ఇలా పలు కేంద్రాలను ఎంపిక చేసుకుని వీరు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తున్నారు. చైన్నైలో కూడా లలితా రఘురామ్ తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రథమ చికిత్సలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన విధానాలను ఆమె వివరించారు.
- హార్ట్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి ప్రప్రథంగా అందించాల్సిన చికిత్స ఆస్పిరిన్ మాత్రను నాలుక కింద ఉంచడం.
- పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటే, కదలిక లేకుండా ఉంటే, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు బాధితుడికి నోటిలో నోరుపెట్టి గాలిని అందించాలి. దీన్నే మౌత్ రెస్పిరేషన్ అంటారు. ఇలా చేస్తూనే గుండెలపై చేతులతో ఒత్తుతూ ఉండాలి. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి పక్కటెముకలపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని చెస్ట్ కంప్రెషన్స్ అంటారు.
- రోడ్డు ప్రమాదాలకు గురైనవారు ఎక్కువగా షాక్ అవుతుంటారు. దానివల్లనే గుండె ఆగిపోవడం, బ్రెయిన్ డెడ్ సంభవిస్తుంటాయి. ఇలాంటిసమయాల్లో కూడా బాధితులకు వెంటనే మౌత్ రిస్పిరేషన్, చెస్ట్ కంప్రెషన్స్ అందించాలి.
- రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి తలకింద ఎలాంటి ఎత్తుని, అంటే దిండులాంటివి ఉంచకూడదు. నీళ్లు మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే నీరు ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది.
- ప్రమాదస్థలం నుండి ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో బాధితుడి మెడ, తల వద్ద పట్టుకునే విధానాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తన కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నా ఇతరుల ప్రాణాలు కాపాడాలనే తాపత్రయంతో పనిచేస్తున్న లలితా రఘురామ్ ఎంతైనా అభినందనీయురాలు.