మనీష్ సిసోడియాతో ఆ అమ్మాయిలు ఏం చెప్పారు?
నిర్భయ ఘటన తరువాత మహిళల భద్రత విషయంలో అనేకానేక చర్చలు, చర్యలు, వాదోపవాదాలు, పరిష్కారాలు, చట్టాల్లో మార్పులు లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నేరాల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల లేదు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఒక మంత్రుల బృందాన్ని నియమించారు. దీనికి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ క్రమంలో మనీష్ సిసోడియా స్వయంగా మహిళలను, విద్యార్థినులను […]
నిర్భయ ఘటన తరువాత మహిళల భద్రత విషయంలో అనేకానేక చర్చలు, చర్యలు, వాదోపవాదాలు, పరిష్కారాలు, చట్టాల్లో మార్పులు లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నేరాల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల లేదు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఒక మంత్రుల బృందాన్ని నియమించారు. దీనికి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ క్రమంలో మనీష్ సిసోడియా స్వయంగా మహిళలను, విద్యార్థినులను కలిసి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా సిసోడియా కొంతమంది విద్యార్థినులను వారి సమస్యల గురించి అడిగారు. మనీష్ సిసోడియా ఆశ్చర్యపోయేలా విద్యార్థినులు తీవ్రంగా స్పందించారు. తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. తాము ఢిల్లీలో అత్యంత అభద్రతా భావానికి గురవుతున్నామన్నారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలు, భయాలు, ఫీలింగ్స్‌ని విడమరచి చెప్పారు.
ఎనిమిది నుండి 12 మధ్యలో చదువుతున్నఆ బృందంలోని ప్రతి అమ్మాయి తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. అవి ఎన్నో రకాలుగా ఉన్నాయి. తమవైపు పోకిరీలు చూపుమరల్చకుండా చూడటం, వెంటపడి వేధించడం, బస్సుల్లో తాకే ప్రయత్నం చేయడం, డ్రగ్స్ తీసుకుని అనుచితంగా ప్రవర్తించడం, రోడ్డుమీద నడుస్తున్నా బండిమీద వెళుతూ అసభ్యంగా కామెంట్లు చేయడం, ఇళ్ల దగ్గర, మార్కెట్ స్థలాల్లో, బస్సుల్లో ఎక్కడబడితే అక్కడ తాము ఎదుర్కొంటున్న వేధింపులను అమ్మాయిలు ధైర్యంగా వివరంగా చెప్పారు. వాటిని ఎదుర్కొనే క్రమంలో ధైర్యంగా ఉంటామన్నారు.
మనీష్ సిసోడియా వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఆ పిల్లలకు తన మాటలతో ధైర్యం నూరిపోశారు. మీరు స్వేచ్ఛగా హాయిగా చదువుకోవడానికి, భయంలేని జీవితాన్ని గడపడానికి ఏం కావాలన్నా చేస్తానని, తనది పూచీ అని అన్నారు. ప్రభుత్వం తరపున అలాంటి చర్యలు తీసుకుంటామన్నారు. తరువాత అసలు మీ రక్షణకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి అని వారినే అడిగారు.
అమ్మాయిలు సిసోడియాకు తమ మనసులోని మాటలను డిమాండ్లుగా చెప్పారు
- తమ ఇళ్ల చుట్టుపక్కల కూడా పోలీస్ భద్రత పెంచాలన్నారు. సిటీ అంతటా సిసిటివి కెమెరాలు కావాలన్నారు. మొట్టమొదట అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే శిక్షలు వేయాలని, అధికార దుర్వినియోగంతో వాటిలోని నిజాలను మాయం చేయకూడదని కోరారు.
- మహిళల పట్ల నేరాలు చేసిన వారికి కఠినమైన శిక్షలు వేయాలన్నారు. తమకు సరైన న్యాయం జరగాలన్నారు.
- వీధి దీపాలు వెలగాలన్నారు. పెప్పర్ స్ప్రే కావాలన్నారు. వర్క్‌షాపులను పెట్టి తమకు ఆత్మరక్షణ విద్యలను నేర్పించాలని కోరారు.
- సిపోడియా అమ్మాయిల అభిప్రాయాలు, డిమాండ్ల పట్ల పాజిటివ్‌గా స్పందించారు. ఆనంద్ పర్‌బాత్ ప్రాంతంలో ఒక అమ్మాయిని 32సార్లు పొడిచి చంపారని, కానీ అది చివరిదశ అని వేధింపులు మొదటి దశల్లో ఉండగానే చర్యలు తీసుకుంటే అలాంటి ఘాతుకాలను నివారించవచ్చని అన్నారు. మహిళల భద్రతకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి హింస వేధింపులను అయినా మొగ్గలోనే తుంచేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యులకోసం స్థాపించిన ఆమ్ఆద్మీ పార్టీ అయినా, ఆ సామాన్యుల్లో మహిళలు కూడా ఒక భాగమని, వారి భద్రతను ప్రభుత్వాలు, ఒక జాతీయ సమస్యగా తీసుకోవాలని గుర్తిస్తే మంచిదే.