Telugu Global
National

తాను ముక్క‌లైనా...ప‌క్క‌వారికోసం ఆలోచించాడు!

ఈ సంఘ‌ట‌న‌ని అత్యంత విషాదం అనాలో, అద్భుతం అనాలో తెలియ‌ని స్థితి. బెంగ‌ళూరు తుమ‌కూరు రోడ్డ‌మీద జ‌రిగిన ప్ర‌మాదంలో హ‌రీష్ నంజ‌ప్ప అనే 23ఏళ్ల యువ‌కుడు రెండు ముక్క‌ల‌య్యాడు. అత‌ని బైక్‌ని ఒక లారీ గుద్ద‌డ‌మే కాకుండా, లారీ అత‌ని మీద‌నుండి వెళ్లింది. దాంతో హ‌రీష్‌ శ‌రీరం తీవ్ర‌మైన గాయాల పాలైంది. ఆసుప‌త్రికి తీసుకువెళ్లిన నిముషాల్లోనే అత‌ను ప్రాణాలు వ‌దిలేశాడు. అయితే ఆ కొద్దిపాటి స‌మ‌యంలో అత‌ను త‌న‌వారి గురించి ఆలోచించ‌లేదు, ప్రాణాలు పోతున్నాయ‌ని భ‌య‌ప‌డ‌లేదు. త‌న […]

తాను ముక్క‌లైనా...ప‌క్క‌వారికోసం ఆలోచించాడు!
X

ఈ సంఘ‌ట‌న‌ని అత్యంత విషాదం అనాలో, అద్భుతం అనాలో తెలియ‌ని స్థితి. బెంగ‌ళూరు తుమ‌కూరు రోడ్డ‌మీద జ‌రిగిన ప్ర‌మాదంలో హ‌రీష్ నంజ‌ప్ప అనే 23ఏళ్ల యువ‌కుడు రెండు ముక్క‌ల‌య్యాడు. అత‌ని బైక్‌ని ఒక లారీ గుద్ద‌డ‌మే కాకుండా, లారీ అత‌ని మీద‌నుండి వెళ్లింది. దాంతో హ‌రీష్‌ శ‌రీరం తీవ్ర‌మైన గాయాల పాలైంది. ఆసుప‌త్రికి తీసుకువెళ్లిన నిముషాల్లోనే అత‌ను ప్రాణాలు వ‌దిలేశాడు. అయితే ఆ కొద్దిపాటి స‌మ‌యంలో అత‌ను త‌న‌వారి గురించి ఆలోచించ‌లేదు, ప్రాణాలు పోతున్నాయ‌ని భ‌య‌ప‌డ‌లేదు. త‌న శ‌రీరంలో ఏ అవ‌య‌వం ప‌నిచేస్తున్నా దాన్ని తీసి, అవ‌స‌రంలో ఉన్న‌వారికి అందించాల‌ని కోరుకున్నాడు. త‌న‌ని ఆసుప‌త్రికి తీసుకువెళుతున్న వారితో ప‌దేప‌దే ఇదే వేడుకున్నాడు హ‌రీష్‌.

లారీ శ‌రీరంమీద నుండి వెళ్ల‌డంతో అత‌ని శ‌రీరంలోని కింద‌భాగం ఎగిరి దూరంగా ప‌డింది. అలాంటి స్థితిలో కూడా హ‌రీష్ ఆ దారిన‌పోయే వాహ‌నాల‌ను స‌హాయం కోసం అర్థించాడు. కొంత‌మంది అత‌ని స్థితిని త‌మ సెల్‌ఫోన్లో ఫొటోలు తీసుకున్నారే కానీ ప‌ట్టించుకోలేదు. చివ‌రికి పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో హ‌రీష్‌ని ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. కానీ కొన్ని నిముషాల‌కే అత‌ను మ‌ర‌ణించాడు. డాక్ట‌ర్లు హ‌రీష్‌ కోరిక మేర‌కు అత‌ని క‌ళ్ల‌ను తీసి భ‌ద్ర‌ప‌ర‌చారు.

హ‌రీష్ తుమ‌కూరు జిల్లాలో ఉన్న త‌న సొంతూరు గుబ్బిలో పంచాయితీ ఎన్నిక‌ల్లో ఓటు వేసి బెంగ‌ళూరు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. హ‌రీష్ ఒక ప్ర‌యివేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. అత‌నికి త‌ల్లిదండ్రులు సోద‌రుడు ఉన్నారు. శ‌రీరం రెండు ముక్క‌ల‌యినా అత‌ను అంత స్ప‌ష్టంగా ఆలోచించ‌డం ప‌ట్ల చాలామంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో హ‌రీష్ గురైన ప‌రిస్థితిని క్ర‌ష్ ఇంజురీ అంటార‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌మాద బాధితుల‌ను ఆదుకొమ్మ‌ని సుప్రీం కోర్టు చెప్పినా మ‌న‌వాళ్లు విన‌డం లేద‌ని, హ‌రీష్ ఎంత‌గా ప్రాధేయ‌ప‌డినా చాలామంది వాహ‌నాల్లో వెళ్లేవారు ప‌ట్టించుకోలేద‌ని అత‌డిని చేర్పించిన ఆసుప‌త్రి వైద్యులు వాపోయారు. హెల్మెట్ ధ‌రించ‌డం వ‌ల‌న హ‌రీష్ త‌ల‌కు గాయాలు కాలేదు. ఇలా ప్ర‌మాదాల్లో శ‌రీరం ముక్క‌లైన‌పుడు స‌కాలంలో తీసుకుని వ‌స్తే శ‌రీరం రెండు భాగాల‌ను అతికించే చికిత్స‌కు అవకాశం ఉంటుంద‌ని వైద్యులు తెలిపారు. అలాంటి స్థితిలోనూ హ‌రీష్ అవ‌య‌వ‌దానం గురించి ఆలోచించ‌డాన్ని వైద్యులు ఎంతో ధీరోదాత్త‌మైన చ‌ర్య‌గా పేర్కొన్నారు. లారీ డ్రైవ‌ర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  17 Feb 2016 8:33 AM IST
Next Story