'గరం' సినిమా రివ్యూ
రేటింగ్ : 2.5/5 విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016 దర్శకత్వం : మదన్ ప్రొడ్యూసర్ : సాయి కుమార్ బ్యానర్ : ఆర్.కె. స్టూడియోస్ సంగీతం : అగస్ధ్యా నటీనటులు : ఆది, ఆదాశర్మ, బ్రహ్మానందం ఒక మంచి లైన్ అనుకున్నంత మాత్రాన దాన్ని సినిమాగా తీయడం సాధ్యంకాదు. ఎందుకంటే రెండున్నర గంటలు ప్రేక్షకుడిని కూర్చునేలా చేయడం అంత సులభంకాదు. గరం సినిమాది కూడా ఇదే పరిస్థితి. మంచి దారాన్ని ఎంచుకున్నారు గాని మాల కట్టడం చేతకాలేదు. […]
రేటింగ్ : 2.5/5
విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016
దర్శకత్వం : మదన్
ప్రొడ్యూసర్ : సాయి కుమార్
బ్యానర్ : ఆర్.కె. స్టూడియోస్
సంగీతం : అగస్ధ్యా
నటీనటులు : ఆది, ఆదాశర్మ, బ్రహ్మానందం
ఒక మంచి లైన్ అనుకున్నంత మాత్రాన దాన్ని సినిమాగా తీయడం సాధ్యంకాదు. ఎందుకంటే రెండున్నర గంటలు ప్రేక్షకుడిని కూర్చునేలా చేయడం అంత సులభంకాదు. గరం సినిమాది కూడా ఇదే పరిస్థితి. మంచి దారాన్ని ఎంచుకున్నారు గాని మాల కట్టడం చేతకాలేదు. కనబడిన పువ్వులన్ని తెచ్చి దండగా మార్చారు. అనేక అనవసరమైన సీన్లతో సినిమాలో వేడి లేకుండా చేశారు.
ఇద్దరు స్నేహితులు తనికెళ్ళ భరణి, సీనియర్ నరేష్. భరణి కొడుకు హీరో ఆది. నరేష్ కొడుకు రవి. ఆది అల్లరి చిల్లరగా తిరుగుతూవుంటాడు. రవి సిన్సియర్ స్టూడెంట్. అతను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. చిన్నప్పటినుంచి అతనితో పోల్చి ఆదిని తండ్రి తిడుతూ ఉంటాడు. ఈ బాధపడలేక ఆది హైదరాబాద్ వెళతాడు. అక్కడ ఉద్యోగ ప్రయత్నంలో హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమె ఒక ముస్లిం అమ్మాయి. ప్రేమ పేరుతో హీరో ఆ అమ్మాయి వెంటపడుతుంటాడు. మధ్యలో విలన్ మనుషులు పాత సినిమాల్లోలాగా ఒక ఫొటో పట్టుకుని సిటీ అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా ఫొటోలు పట్టుకుని వెతుకుతున్నారా ఏ కాలంలో ఉన్నారు మీరు అని ఒక కుర్రాడు ఎగతాళి చేస్తే వాడిని చంపేస్తారు.
ఫస్టాఫ్‌లో కథలేక, ఏంచేయాలో తెలియక షకలక శంకర్, పోసాని, బ్రహ్మానందం వచ్చారు. వీళ్ళకు తోడు పృథ్వి ఎపిసోడ్ ఒకటి. హీరోయిన్‌ని లవ్‌చేస్తూ ఒకటిరెండుపాటలు తరువాత కథ మలుపుతిరుగుతుంది. హీరో వచ్చింది ఉద్యోగం కోసం కాదు, కనబడకుండా పోయిన నరేష్ కొడుకు కోసమని. అక్కడనుంచి ఫైట్లు, సుఖాంతం.
ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వాడి కుటుంబంకోసం రిస్క్ చేయడమనేది మంచి పాయింట్. అయితే మిగతా సీన్స్ అన్ని కూడా మూలకథనే బలపరిచేవిగా ఉండాలి. అవన్నీ తలాతోకా లేని కామెడీ సీన్స్‌గా రాసుకుంటే ప్రేక్షకుడికి ఫీల్‌రాదు. పికె సినిమాకి పేరడిగా బ్రహ్మానందం ఎపిసోడ్‌ని తయారుచేసి చివరలో అతను పిచ్చివాడని చెప్పడం ప్రేక్షకులను ఫూల్స్‌ని చేయడానికే కదా!
గతంలో దర్శకుడు మదన్ మంచి సినిమాలు తీసాడు. మంచి సినిమా తియ్యాలనే ఇది కూడా మొదలుపెట్టి ఏదేదో తీసాడు. ఆదిలో స్టామినా ఉంది కానీ అతను ఫైట్ల జోలికి వెళ్ళకుండా లవర్‌బాయ్‌గా ఉంటేనే సినిమాకి బలం.
రెండు పాటలు బావున్నాయి. అయితే వీటికోసం ఇటలీ వెళ్ళాల్సిన అవసరం ఏమిటో? హీరోయిన్ ఆదాశర్మ బురఖాలోంచి హీరోని పిచ్చిచూపులు చూడ్డం తప్ప చేసిందేమిలేదు.
పంచ్ డైలాగులు వేస్తూ, మందుతాగే హీరోలు ప్రస్తుతం బ్రాండెడ్‌గా మారుతున్నారు. కష్టపడి సిన్సియర్‌గా పనిచేసే హీరోని చూసి ఎంతకాలమైందో?
– జి ఆర్. మహర్షి
Adah Stills