ఎయిర్‌పోర్టు దగ్గర మసీదు కట్టలేదని నోటీసు
జిఎమ్మార్ కంపెనీకి మైనారిటీ సంస్థ షోకాజ్ నోటీస్ ఎయిర్‌పోర్టుకి సమీపంలో మసీదుకోసం స్థలం కేటాయించినా ఇంతవరకు ఎందుకు నిర్మించలేదో తెలపాలని రాష్ట్ర మైనారిటీల కమిషన్, జిఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌కి షోకాజ్ నోటీసు పంపింది. మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి గతనెలలో ఈ విషయంపై స్పందించాల్సిందిగా కమిషన్‌ని ఆశ్రయించడంతో ఈ నోటీసుని జారీ చేసింది. టాక్సీడ్రైవర్లు, పోర్టర్లు, ఇంకా పలురకాల పనుల్లో ఉన్న ముస్లింలు బహిరంగ ప్రదేశంలో, ఎండావానలకు గురవుతూ ప్రార్థనలు చేయాల్సి వస్తోందని ఈ […]
జిఎమ్మార్ కంపెనీకి మైనారిటీ సంస్థ షోకాజ్ నోటీస్
ఎయిర్‌పోర్టుకి సమీపంలో మసీదుకోసం స్థలం కేటాయించినా ఇంతవరకు ఎందుకు నిర్మించలేదో తెలపాలని రాష్ట్ర మైనారిటీల కమిషన్, జిఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌కి షోకాజ్ నోటీసు పంపింది. మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి గతనెలలో ఈ విషయంపై స్పందించాల్సిందిగా కమిషన్‌ని ఆశ్రయించడంతో ఈ నోటీసుని జారీ చేసింది.
టాక్సీడ్రైవర్లు, పోర్టర్లు, ఇంకా పలురకాల పనుల్లో ఉన్న ముస్లింలు బహిరంగ ప్రదేశంలో, ఎండావానలకు గురవుతూ ప్రార్థనలు చేయాల్సి వస్తోందని ఈ విషయంలో కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అతను కోరాడని, కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం 300మంది, సాధారణ రోజుల్లో 60మంది ఈ ప్రాంతంలో ప్రార్థనలు చేస్తారని వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమకు తెలిసిందని మైనారీటీల కమిషన్ షోకాజ్ నోటీస్‌లో వివరించింది.
అలాగే జిఎమ్మార్ యాజమాన్యానికి మైనారిటీల కమిషన్ కొన్ని ప్రశ్నలను వేసింది. గెజిటెడ్ వక్ఫ్ బోర్డు ఆస్తిని ఇందుకోసం మీరు తీసుకున్నారా అని అడిగింది. అలాగే జిఎమ్మార్ సంస్థ, తమ ఉద్యోగులకోసం టెర్మినల్ బయట ఏమైనా ప్రార్థనా స్థలాలు కేటాయించిందా, దీని గురించి ఎవరైనా ప్రజాప్రతినిధులు మిమ్మల్ని సంప్రదించారా తెలపాలంటూ కోరింది.
అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కి రాసిన లేఖలో ఎయిర్‌పోర్టు ఎంట్రెన్స్‌లో ఉన్న 2000 చదరపు గజాల నేలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని కోరింది. ఇదే భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అయిదేళ్ల క్రితం మసీదు నిర్మాణంకోసం ఆ భూమిని కేటాయించినా ఇంతవరకు దాన్ని సంబంధితులు స్వాధీనం చేసుకోలేదని, దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదని, మసీదు నిర్మాణంకోసం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఖాన్ కోరారు.
అయితే జిఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ అధికారులు మాత్రం సివిల్ ఏమియేషన్ సెక్యురిటీ విధానాల ప్రకారం ఎయిర్‌పోర్టుకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలుగా గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను ఎయిర్‌పోర్టు అభివృద్ధికి తప్ప మరే ఇతర అవసరాలకు వినియోగించలేమని, ఎయిర్‌పోర్టు సమీపంలో శాశ్వత ప్రార్థనా మందిరాలు నిర్మించలేమని చెబుతున్నారు.