ఆ మేకని అరెస్టు చేశారు...బెయిల్ కూడా ఇచ్చారు!
మేకల్ని మనం ఎడాపెడా వండుకుని తినవచ్చు…అంతేకానీ అవి మనం పెంచుకుంటున్న పూలమొక్కల్ని తాకనైనా తాకకూడదు. ఇదీ మన నీతి. ఆ జడ్జిగారు కూడా అదే ఫాలో అయ్యారు. తన తోటలో నాలుగు పూల మొక్కలు తొక్కిన మేకపై కేసులు పెట్టారు, అరెస్టు చేయించారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సమీపంలోని కొరియాలో ఈ విచిత్రం జరిగింది. అక్కడి జిల్లా జడ్జి హేమంత్ రాత్రే తోటమాలి, ఒక మేకమీద కేసుపెట్టాడు. అది తమ యజమాని పూల తోటని పాడు చేసిందని. […]
మేకల్ని మనం ఎడాపెడా వండుకుని తినవచ్చు…అంతేకానీ అవి మనం పెంచుకుంటున్న పూలమొక్కల్ని తాకనైనా తాకకూడదు. ఇదీ మన నీతి. ఆ జడ్జిగారు కూడా అదే ఫాలో అయ్యారు. తన తోటలో నాలుగు పూల మొక్కలు తొక్కిన మేకపై కేసులు పెట్టారు, అరెస్టు చేయించారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సమీపంలోని కొరియాలో ఈ విచిత్రం జరిగింది. అక్కడి జిల్లా జడ్జి హేమంత్ రాత్రే తోటమాలి, ఒక మేకమీద కేసుపెట్టాడు. అది తమ యజమాని పూల తోటని పాడు చేసిందని. పోలీసులు వచ్చారు. మేకనీ దాని యజమాని అబ్దుల్ హసన్‌ని కూడా అరెస్టు చేశారు. ఒక్కసారయితే ఊరుకుంటాం…అది మళ్లీ మళ్లీ జడ్జిగారి ఇనుపగేటు దాటి వచ్చి పూలతోటలో పడి తినేది… మరి ఎలా ఊరుకుంటాం… అని దాన్ని అరెస్టు చేసిన అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ అన్నాడు. చాలాసార్లు మేక యజమానిని తాము హెచ్చరించామని, కానీ అతను దాన్ని అదుపులో పెట్టలేదని అందుకే ఇద్దరినీ అరెస్టులు చేశామని పోలీసులు వివరంగా చెప్పుకొచ్చారు.
గేటు దూకుట, పూలమొక్కలు పాడు చేయుట…అంటూ అది చేసిన నేరాలను సైతం వారు వరుసగా రాసుకొచ్చారు. జడ్జిగారు స్వయంగా తమను పిలిచి మరీ కేసుని పెట్టినట్టుగా పోలీసులు చెప్పారు. మేక యజమాని అయిన అబ్దుల్ హసన్ మీద రెండు నుండి ఏడు సంవత్సరాల శిక్షలు విధించగల నేరాలను మోపారు. మొత్తానికి కోర్టులో హాజరుపరిచాక అతనికి, పోలీసుల భాషలో నేరస్తురాలయిన మేకకు సైతం బెయిల్ లభించింది. చెంగుచెంగున దూకుతూ ఏ గేటు బడితే ఆ గేటు దూకకూడదని ఆ బుజ్జిమేకకి ఇప్పుడైనా అర్థమైందో లేదో మరి.