Telugu Global
Others

ఫ్రీబేసిక్స్‌ను అడ్డుకోవాల్సిందే ... కానీ అది కావాల్సిందే! 

‘నెట్‌ న్యూట్రాలిటీ’ విషయంలో ట్రాయ్‌ తీసుకున్న తాజా నిర్ణయం సాహసోపేతమైనదనే చెప్పాలి. స్పెక్ట్రమ్‌ కుంభకోణం తరువాత టెలికమ్‌ రంగంలో జోరు తగ్గుతుందేమోనన్న భయాలు కొద్దికాలం వెంటాడినా, అనంతర పరిణామాలు భారత్‌కు మేలుమలుపులుగానే మారాయి. గత రెండేళ్లుగా టెలికమ్‌ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లో వేగంగా విస్తరిస్తుండడం మొదలైన అంశాలను దగ్గరగా గమనిస్తున్నవారికి ట్రాయ్‌ తాజా నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. టెలికమ్‌ రంగాన్ని బలమైన ఆదాయ వనరుగా చూస్తూనే, ఇందులో గుత్తాధిపత్యానికి తావుండబోదని […]

ఫ్రీబేసిక్స్‌ను అడ్డుకోవాల్సిందే ... కానీ అది కావాల్సిందే! 
X
‘నెట్‌ న్యూట్రాలిటీ’ విషయంలో ట్రాయ్‌ తీసుకున్న తాజా నిర్ణయం సాహసోపేతమైనదనే చెప్పాలి. స్పెక్ట్రమ్‌ కుంభకోణం తరువాత టెలికమ్‌ రంగంలో జోరు తగ్గుతుందేమోనన్న భయాలు కొద్దికాలం వెంటాడినా, అనంతర పరిణామాలు భారత్‌కు మేలుమలుపులుగానే మారాయి. గత రెండేళ్లుగా టెలికమ్‌ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్‌లో వేగంగా విస్తరిస్తుండడం మొదలైన అంశాలను దగ్గరగా గమనిస్తున్నవారికి ట్రాయ్‌ తాజా నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. టెలికమ్‌ రంగాన్ని బలమైన ఆదాయ వనరుగా చూస్తూనే, ఇందులో గుత్తాధిపత్యానికి తావుండబోదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ద్వారా ట్రాయ్‌ తన మార్గదర్శక సూత్రాలను తానే గౌరవించుకున్నట్లయింది.

నెట్‌న్యూట్రాలిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం లోకి వస్తున్న పేరు. ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ను ఉపయోగించుకుంటూ వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవడానికి కొన్ని పదుల యాప్స్‌ సిద్ధంగా వుండగా, ఏటా వీటి సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటివల్ల ప్రభుత్వ రంగంలో సేవలందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ప్రయివేటు టెలికమ్‌ ఆపరేటర్ల ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. పైగా ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ఒక్క పైసా కూడా చెల్లించకుండా తమ సేవల్ని దుర్వినియోగం చేస్తున్నారనే ‘పాత కోపాలూ’ వున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ తొలుత ఈ తరహా యాప్స్‌ పై కొంత చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. టెలికమ్‌ ఆపరేటర్లు కూడా ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఎప్పుడైతే ఫేస్‌బుక్‌ ‘ఫ్రీ బేసిక్స్‌’ పేరుతో రంగంలోకి దిగిందో, వెంటనే పరిణామాలు వేరే రూపం తీసుకున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో నెంబర్‌వన్‌గా నిలబడిన ఫేస్‌బుక్‌ ఈ ‘ఫ్రీ బేసిక్స్‌’ తోనే తొలిసారిగా గుత్తాధిపత్యపు ధోరణిని ప్రదర్శించే పనిచేసింది. ప్రపంచానికి ఇంటర్‌నెట్‌ను ఉచితంగా అందించాలన్న ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలొచ్చాయి. కానీ మన దేశంలో రెండు అంశాలు దీనిమీద వ్యతిరేకంగా పనిచేశాయి.

ఒకటి – వినియోగదారుడికి ఇంటర్‌నెట్‌లో తనకేం కావాలో ఎంచుకునే స్వేచ్ఛ లేకపోవడం; రెండోది – చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి రంగంలోకీ అడుగుపెట్టి దేశాన్ని అడ్డంగా దోచేస్తున్న సంస్థగా రిలయన్స్‌ మీద జనంలో వున్న తీవ్ర వ్యతిరేకత. ఈ రెండంశాలనూ సామాజిక కోణం నుంచి చూస్తే ఫేస్‌బుక్‌ ప్రయోగానికి తొలిదశలోనే ఎందుకు అవాంతరాలొచ్చాయో అర్థమైపోతుంది. సాధారణంగా తన ప్రతి చర్యలోనూ సామాజిక కోణాన్ని గుర్తించే జుకర్‌బర్గ్‌ ఫ్రీబేసిక్స్‌ విషయంలో మాత్రం మార్కెటింగ్‌ కోణం ఒక్కదాన్నే చూసినట్లు అర్థమవుతుంది.

నెట్‌న్యూట్రాలిటీని ఫ్రీబేసిక్స్‌కి అనుసంధానిస్తూ ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ దురదృష్టవశాత్తూ సరైన దారిలో నడవడం లేదు. గుత్తాధికార కార్పోరేట్‌ కంపెనీగా రిలయన్స్‌ మీద వున్న వ్యతిరేకతను ప్రదర్శించడంలో చూపిస్తున్నంత ఉత్సాహం … ఫ్రీబేసిక్స్‌ను సానుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనే కోణం నుంచి కనిపించడం లేదు. మన మేధావులు ఈ ‘రెండో కోణం మిస్‌ కావడం’ ద్వారా అనేక సందర్భాల్లో దేశం ఎంత నష్టపోయిందీ మన వెనుక సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనేవున్నాయి. ​​

‘ఫ్రీ బేసిక్స్‌’ మంచిదే – ఆచరణ మార్గమే తప్పు

125 కోట్ల జనాభా వున్న భారత్‌ లాంటి దేశాల్లో ఇంటర్‌నెట్‌ ఇవ్వాళ్టికీ కొంచెం ఖరీదైన వ్యవహారమే! దేశమంతా సాంకేతికాభివృద్ధి ఒకే స్థాయిలో జరగలేదు. దక్షిణ భారతంలో ఇంటర్‌నెట్‌ వినిమయం చూసి, బీహార్‌, యూపీల్లో చూస్తే ఆ స్పష్టమైన తేడా విస్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధారణ పౌరుడి దాకా తీసుకువెళ్లగలిగినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుంది.

కాల్‌సెంటర్ల ఆవిర్భావం తర్వాత రైతులు మొదలుకుని అన్ని రంగాలవారికీ మొబైల్‌ఫోన్‌ అవసరాలు బాగా పెరిగిపోయాయి. కానీ, గ్రామీణ ప్రాంతాలవారిని, పెద్దగా చదువు లేనివారిని స్మార్ట్‌ఫోన్లు గందరగోళానికి గురిచేస్తాయి. వారి అవసరాలు తీరడానికి సాధారణ ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లు మాత్రమే పనికొస్తాయి. భారత్‌లోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి జుకర్‌బర్గ్‌ తొలుత చూసింది ఇదే! ఆఫ్రికన్‌ దేశాలతో ప్రారంభించి నెమ్మదిగా మన ఉపఖండంలోకి అడుగుపెట్టాలనుకున్నాడు. కానీ డబ్బులు సంపాదించిపెట్టగల గొప్ప ఆలోచనలున్న చోట అందరికంటే ముందు తుండుగుడ్డ పడేసే అలవాటున్న రిలయన్స్‌ తానే చక్రం తిప్పి జుకర్‌బర్గ్‌ బృందంతో సంప్రదింపులు జరిపి, భారత్‌లో కూడా ఫ్రీబేసిక్స్‌ను ప్రారంభించాలని ఒప్పించింది. ఇప్పటికే పెద్ద టెలికం ఆపరేటర్లలో ఒకటిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించడంతోపాటు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామంది. బేసిక్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ ఫోన్ల దాకా అన్నిటికీ తగిన అప్లికేషన్లను అభివృద్ధి చేసిచ్చే బాధ్యతను కూడా భుజానికెత్తుకుంటానంది. అలా ఫ్రీబేసిక్స్‌ భారత్‌ లోకి అడుగుపెట్టే ప్రయత్నం మొదలైంది. ఇక మళ్లీ ఫోన్ల దగ్గరికి వద్దాం. ​​

‘లోకల్‌’ కాలేకపోవడం …

ఇప్పుడొస్తున్న స్మార్ట్‌ ఫోన్లకు అసలు ఫ్రీ బేసిక్స్‌ అవసరమే లేదు. 100 రూపాయలతో నెలంతా ఇంటర్‌నెట్‌ ను ఫోన్లోనే స్వేచ్ఛగా ఉపయోగించుకోగల వెసులుబాటును అన్ని కంపెనీలూ కల్పిస్తున్నాయి. కానీ, ఇవ్వాళ్టికీ దేశ జనాభాలో 60 శాతం మంది వాడుతున్న ఫీచర్‌ఫోన్స్‌ సెక్టార్‌ మాత్రమే ఫేస్‌బుక్‌ / రిలయన్స్‌ దృష్టి పెట్టిన మార్కెట్‌ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ రిలయన్స్‌తో టైఅప్‌ లేకుండా మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థలు, సర్వీస్‌ ఆపరేటర్లతో ఫేస్‌బుక్‌ నేరుగా టైఅప్‌ పెట్టుకున్నట్లయితే విషయం ఇంకోలా వుండేది.

ఉదాహరణకు భారతీయ మొబైల్‌ లోకల్‌ బ్రాండ్‌ ‘జెన్‌’ను తీసుకోండి. జెన్‌ ఫీచర్‌ ఫోన్‌ కొనుకున్నవారికి అందులో ‘జెన్‌ లైవ్‌’ పేరుతో ఒక ఫీచర్‌ కనిపిస్తుంది. జెన్‌ కంపెనీ అందించే సర్వీసులన్నీ మొబైల్‌ సర్వీస్‌ ఆపరేటర్లతో కనెక్ట్‌ అయివుంటాయి. వినియోగదారుల వాడుక మేరకు జెన్‌ తన వాటాను తాను తీసుకుంటుంది. ఈ తరహా ఫీచర్లు దాదాపు అన్ని ఫీచర్‌, స్మార్ట్‌ ఫోన్లలోనూ వుంటాయి. ఆపరేటర్లు కూడా ఇదే తరహా ఫీచర్లను అందిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ కూడా ఈ నమూనానే ఎంచుకుని, తన ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫారానికి ఈ యాప్‌ను అసోసియేట్‌ (ఎఫ్‌బి, మెసెంజర్‌లను విడదీసినట్లుగా) చేసివుంటే వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చివుండేది, జుకర్‌బర్గ్‌ ఆశించిన ఫలితాలు మొగ్గతొడిగివుండేవి. కానీ జుకర్‌ వలచిందీ, అంబానీలు తలచిందీ రెండూ వేర్వేరు కావడంతో విషయం ‘సమస్య’గా మారికూర్చుంది. ఫేస్‌బుక్‌ చేష్టలను ఎండగట్టడానికి జనం ఫేస్‌బుక్‌నే వేదిక చేసుకోవడం జుకర్‌బర్గ్‌కి మింగుడు పడుతుందేమో కానీ, రిలయన్స్‌కి మాత్రం మింగుడుపడదు.

ఇంటర్‌నెట్‌ సదుపాయం వుండడం అంటే మనకు నచ్చిన విధంగా దానిని ఉపయోగించుకోగల అవకాశం వుండడం. కానీ ఫ్రీబేసిక్స్‌లో ఆ ఛాన్స్‌ వుండదు. ఒక్కసారి ‘ఫ్రీబేసిక్స్‌’ ఫీచర్‌/ యాప్‌కి కనెక్ట్‌ అయితే దాని సొంత బ్రౌజర్‌లో అది ఏం చూపిస్తే అది చూడాల్సిందే! ఏది చూపిస్తే అదే మంచి ప్రాడక్ట్‌ అని నమ్మాల్సిందే!

ఉదాహరణకు మనం ఒక ఇస్త్రీ పెట్టె కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో వంద బ్రాండ్లున్నాయి. కానీ, ఫ్రీబేసిక్స్‌లో ఇవన్నీ కనిపించవు. రిలయన్స్‌ తనకు ఎక్కువ కమీషన్‌ ఇచ్చే కంపెనీ బ్రాండ్ల వస్తువులను మాత్రమే తన ఫీచర్లలో పెడుతుంది. ఉచితంగా ఇంటర్‌నెట్‌ వస్తుంది కదా అని ఆశపడితే మనకు నిరుపయోగమైన వస్తువు కొనాల్సివస్తుంది. వినియోగదారులుగా ఇది మన స్వేచ్ఛకు విరుద్ధమైన అంశం. ​​

భయాలూ, భ్రమలూ అక్కర్లేదు …

ఫ్రీబేసిక్స్‌ గురించిన చర్చ మొదలైనప్పటినుంచీ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఉదారవాదులెవరూ దీని గురించి మాట్లాడకపోవడం కనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానాల మీద తరచూ మండిపాటును ప్రకటించే మేధావులు, ప్రజాహక్కుల సంఘాలు మాత్రమే ఎక్కువగా స్పందిస్తుండడం గమనించవచ్చు. వీరిలో చాలామంది ఫ్రీబేసిక్స్‌ సిద్ధాంత కోణాన్ని రిలయన్స్‌ దృష్టికోణం నుంచి మాత్రమే చూసి స్పందిస్తున్నారు తప్ప ఎవరినుంచీ సారవంతమైన పరిష్కారాల్లేవు, కేవలం అది రాకూడదని అడ్డుకోవడమే తప్ప. 1990ల్లో కమ్యూనిస్టులు కంప్యూటర్ల రాకను అడ్డుకున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఫ్రీబేసిక్స్‌ విషయంలో పునరావృతం కాబోతోంది. కొన్ని సవరణలతోనైనా ఖచ్చితంగా ఫ్రీబేసిక్స్‌ ఇండియాలో అమలు కావడం తథ్యంగా కనిపిస్తోంది. ​​

ఫ్రీబేసిక్స్‌ ఖచ్చితంగా అవసరం

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఫ్రీబేసిక్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి రావడం ఖచ్చితంగా అవసరమే! రైతులు మొదలుకుని అన్ని రంగాలవారికీ ఉపయోగపడే ఫీచర్లను ‘సూచిస్తూ’, వినియోగదారులు కోరుకునే చోటికి వెళ్లగల స్వేచ్ఛనందించే ఫ్రీబేసిక్స్‌ తప్పకుండా కావాలి. కానీ ఇందుకు రిలయన్స్‌ లాంటి మోనోపలియస్‌ కార్పోరేట్స్‌ కాకుండా, కేంద్రప్రభుత్వమే చొరవ చూపాల్సివుంటుంది. టెలికమ్‌ రంగంలో గొప్ప మార్పుల కోసం అంటూ వసూలు చేస్తున్న సేవాపన్నులు నిజానికి ఇలాంటి ప్రయోజనాల కోసమే ఉపయోగపడాలి. పౌర సదుపాయాల కల్పనలో ఫ్రీబేసిక్స్‌ను అందించగలిగితే జుకర్‌బర్గ్‌ కూడా కేంద్రప్రభుత్వంతో కలిసి ముందుకు రావచ్చు.

ట్రాయ్‌ తాజా నిర్ణయం ఇందుకు దోహదపడే అవకాశాలున్నాయి. కానీ, రాజకీయ సంకల్పమే ప్రధానమైన అవరోధంగా వున్న మన దేశంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పడం అసాధ్యం. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన అనేక ఉత్పత్తులు (మ్యాగీతో సహా) మళ్లీ సగర్వంగా మార్కెట్‌ లోకి అడుగుపెట్టిన స్వేచ్ఛను మన కళ్లతోనే చూశాం.

ఫ్రీబేసిక్స్‌ విషయంలో అలా కాకుండా వుండాలంటే … మేధావులతో సహా అందరూ దీనిని వ్యతిరేకించే ధోరణిలో కాకుండా, జనం మేలు కోసం సానుకూలంగా దీనిని ఎలా ఉపయోగించుకోవాలో కొత్త ఆలోచనలను సూచిస్తే బావుంటుంది. ఆల్‌ ది బెస్ట్‌ ఇండియా!

​​

– సురేశ్‌ వెలుగూరి
ఫోన్‌: 8125968527

First Published:  10 Feb 2016 8:36 AM IST
Next Story