టివి డ్యాన్స్ రియాల్టీ షో పిచ్చితో రెండు హత్యలు చేసిన టీనేజి కుర్రాడు!
హత్య చేసి బాల నేరస్తుడిగా జైల్లో ఉన్న 17 ఏళ్ల కుర్రాడు, మంచి ప్రవర్తన కారణంగా బయటకివచ్చాడు. అలా వచ్చిన కొన్ని నెలలకే మరో హత్య చేశాడు. నిర్భయ హత్యకేసు విషయంలో పాశవిక నేరాలు చేసిన 18 ఏళ్లలోపు పిల్లలను బాల నేరస్తులు అనవచ్చా అనే ప్రశ్న చెలరేగి, ఆ వయసుని 16కి కుదించేలా చేసింది. అత్యంత దారుణమైన నేరాలు చేసిన 16 నుండి 18ఏళ్ల లోపు పిల్లలను బాలనేరస్తులుగా కాక సాధారణ నేరస్తులుగానే పరిగణించే విధంగా జువనైల్ జస్టిస్ యాక్ట్‌లో సవరణ తెచ్చిన విషయం […]
హత్య చేసి బాల నేరస్తుడిగా జైల్లో ఉన్న 17 ఏళ్ల కుర్రాడు, మంచి ప్రవర్తన కారణంగా బయటకివచ్చాడు. అలా వచ్చిన కొన్ని నెలలకే మరో హత్య చేశాడు. నిర్భయ హత్యకేసు విషయంలో పాశవిక నేరాలు చేసిన 18 ఏళ్లలోపు పిల్లలను బాల నేరస్తులు అనవచ్చా అనే ప్రశ్న చెలరేగి, ఆ వయసుని 16కి కుదించేలా చేసింది. అత్యంత దారుణమైన నేరాలు చేసిన 16 నుండి 18ఏళ్ల లోపు పిల్లలను బాలనేరస్తులుగా కాక సాధారణ నేరస్తులుగానే పరిగణించే విధంగా జువనైల్ జస్టిస్ యాక్ట్‌లో సవరణ తెచ్చిన విషయం తెలిసిందే.
ఒక బాలుడిని కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సదరు కుర్రాడిని పోలీసులు మంచి ప్రవర్తనని కారణంగా చూపిస్తూ నేరం చేసిన రెండునెలలకే, గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేశారు. అదే కుర్రాడు జైల్లోంచి విడుదలైన కొన్నినెలలకే మరొక హత్య చేసినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో నివసించే మిథిలేష్ జైన్ అనే 65 సంవత్సరాల మహిళను అతను గొంతునులిమి చంపినట్టుగా పోలీసులు అభియోగం మోపారు. రిటైర్డ్ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఆఫీసర్ అయిన ఆ మహిళను చంపి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్, కొంతనగదు, బంగారాలను నిందితుడు దొంగిలించినట్టుగా పోలీసులు తెలిపారు.
నిందితుడు లోగడ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఒక బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఆ బాలుడి తండ్రిని 60వేలు డిమాండ్ చేయగా, అతను ఇవ్వకపోవడంలో బాలుడిని చంపేశాడు. ఆ డబ్బుని ఒక టివి డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొనేందుకు ఖర్చుచేయాలని అతను భావించాడు. టివి రియాలిటీ షోలో పాల్గొనాలనే అతని పిచ్చి, ఇప్పుడు తిరిగి దొంగతనం, హత్య చేసేలా పురికొల్పిందని పోలీసులు తెలిపారు. జైన్ ఒంటరిగా ఇంట్లో ఉండగా ఈ కుర్రాడు తలుపు కొట్టి ఆమెను మంచినీళ్లు అడిగాడు. మొదట ఆమె కాళ్లకు దణ్ణంపెట్టి మంచివాడిగా నమ్మించాడు. ఆమె వెంట లోపలికి వెళ్లి గొంతునులిమి చంపేశాడు. తరువాత వస్తువులతో పరారయ్యాడు. మొదట పోలీసులు ఆమెది సహజమరణంగా భావించారు. తరువాత పోస్ట్ మార్టమ్‌లో హత్యగా తేలింది. నిందితుడు దొంగిలించిన ఫోన్‌నుండి ఒక కాల్ చేయగా, దాని ఆధారంగా పోలీసులు అతడిని ఫరీదాబాద్‌లో పట్టుకున్నారు.