Telugu Global
Others

ఇక డబ్బున్న వాళ్ళే డాక్టర్లు

ఇక కష్టపడిచదువుకున్న విద్యార్ధులకు మెడిసిస్‌లో సీట్లు వచ్చే అవకాశాలు దాదాపు లేనేలేవు. తల్లిదండ్రులు అడ్డగోలుగా సంపాదించిన కుటుంబాల్లో పిల్లలకు ఇక వద్దన్నా మెడికల్‌ సీట్లే! చంద్రబాబు గారు అధికారానికి వచ్చీరాగానే చేసిన మహా ఘనకార్యాల్లో ఇదీ ఒకటి. దీనికి న్యాయస్థానం అమోదముద్ర కూడా లభించింది కాబట్టి ఇక ఎవరేమీ చెయ్యగలిగింది ఏమీలేదు. ఇక సబ్జెక్ట్‌లోకి వస్తే మెడికల్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరించే సమయం ఆసన్నం అయింది.ఇపుడు ఎంసెట్ సమయం..దీన్ని ఎవరు ఎంతగా క్యాష్ చేసుకోవాలో ఇప్పటికే […]

ఇక డబ్బున్న వాళ్ళే డాక్టర్లు
X

ఇక కష్టపడిచదువుకున్న విద్యార్ధులకు మెడిసిస్‌లో సీట్లు వచ్చే అవకాశాలు దాదాపు లేనేలేవు. తల్లిదండ్రులు అడ్డగోలుగా సంపాదించిన కుటుంబాల్లో పిల్లలకు ఇక వద్దన్నా మెడికల్‌ సీట్లే! చంద్రబాబు గారు అధికారానికి వచ్చీరాగానే చేసిన మహా ఘనకార్యాల్లో ఇదీ ఒకటి. దీనికి న్యాయస్థానం అమోదముద్ర కూడా లభించింది కాబట్టి ఇక ఎవరేమీ చెయ్యగలిగింది ఏమీలేదు.

ఇక సబ్జెక్ట్‌లోకి వస్తే మెడికల్ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరించే సమయం ఆసన్నం అయింది.ఇపుడు ఎంసెట్ సమయం..దీన్ని ఎవరు ఎంతగా క్యాష్ చేసుకోవాలో ఇప్పటికే నిర్ధారించుకున్నారు. ఉన్నత విద్యకు పేదలను దూరంగా ఉంచే ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి. ఇకముందు కూడా జరిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీన్లో భాగంగానే గత ఏడాది నుంచి ఎంసెట్ లో బి కేటగిరి సీట్ల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. కేవలం డబ్బున్న వర్గాల వారికి మేలు చేయడం కోసమే బి కేటగిరి సీట్ల అంశాన్ని తీసుకొచ్చారు. పేదలకు మెడిసిన్లో అవకాశాలు లేకుండా చేయడం కోసమే ఈ కుట్ర చేసినట్లు రుజువవుతోంది.

ఎంబిబిఎస్,బిడిఎస్ లలో ప్రవేశించే వారికి బి కేటగిరీ లో లభించే సీట్లకు ఫీజు ఏడాదికి గతంలో 2.50 లక్షల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని11 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. ఐదేళ్లలో 55 లక్షల రూపాయల మేర ఫీజు అవుతుంది. మిగిలిన ఖర్చులు అదనం. మొత్తం కలిపి 65 నుంచి 70 లక్షల రూపాయల మేర బి కేటగిరి సీటుకు ఖర్చు అవుతుంది. ఈమొత్తం చెల్లించి సీటు పొంది చదివే వారు ఆర్దికంగా వెనుకబడినవారిలో చాలా తక్కువగానే ఉంటారు. కానీ ఇప్పుడు బి కేటగిరీ సీటు ఏకంగా 11 లక్షల రూపాయలు కావడం, మేనేజ్ మెంట్ అవసరాన్ని బట్టి ఫీజును పెంచుకునే అవకాశాన్ని కూడా మేనేజ్ మెంట్ కు ఇవ్వడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ధనవంతుల పిల్లలకే మెడిసిన్ చదవివే అవకాశం ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాయి.

రాష్ట్రంలో విద్యావ్యాపారం మూడు పూవులూ ,ఆరు కాయలుగా సాగుతోంది. అందులోనూ మెడిసిన్ సీట్ల వ్యాపారం అయితే మరింత క్రేజ్ ఉంది. ఇప్పటి వరకూ మెడిసిన్ సీటు 50 నుంచి 70 లక్షలు ఉంటే ఇపుడు ఏకంగా 1.50 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలకు పెంచేశారు. బి కేటగిరి సీట్ల వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాతనే యాజమాన్యాలు అన్నీ కలిసి సిండికేట్ గా మారి సీట్ల ధరలను పెంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్‌ విద్య మరింతగా వ్యాపార వస్తువుగా మారింది. దీంతో గతంలో ఉన్న నిబంధనలు, సీట్ల కేటాయింపులు, ఫీజుల అమలు వంటి అన్ని అంశాలూ ఇపుడు మారిపోయాయి. ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాల కనుసన్నల్లోనే నడిచే పరిస్థితివచ్చింది.

ఎన్నారై మాయాజాలం ఎన్నారై కోటాలో మెడిసిన్ సీట్ల వ్యవహారం కూడా అంతా గందరగోళమే. యాజమాన్యాల ధనదాహం తీర్చుకోవడానికి మాత్రమే ఈ కోటా ఉపయోగపడుతుంది. 100 సీట్లు ఉన్న మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఎంసెట్ మెరిట్ మీద కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. 35 సీట్లను బి కేటగిరి కింద ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహించే ఎంసెట్ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన 15 సీట్లు ఎన్నారై కోటాలో కేటాయిస్తారు. అయితే ఈ ఎన్నారై కోటా సీట్ల ధరల్ని ఇపుడు విపరీతంగా పెంచేశారు. 1.50 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల వరకూ పెంచేశారు.దీంతో ఎన్నారై కోటాలోనూ కింది వర్గాలకు మెడిసిన్ చదివే అవకాశం లేకుండా పోయింది.

అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయమేమిటంటే ప్రైవేట్‌ యాజమన్యాలు సొంతంగా ఎంసెట్‌ నిర్వహించుకునే అవకాశం ప్రభుత్వం, కోర్టులు ఇవ్వడం వల్ల ఇక్కడకూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. బి క్యాటగిరి సీట్లనుకూడా పెద్దమొత్తాలకు ముందే అమ్ముకుని, తమకు కావలసిన అభ్యర్ధులకు పేపర్‌ లీక్‌ చేస్తే చేయగలిగింది ఏముంది? 11 లక్షల బి క్యాటగిరి సీటునుకూడా రెండుకోట్లకు అమ్ముకోరా?

-కె. సిద్ధార్ధ రాయ్‌

First Published:  4 Feb 2016 6:01 AM IST
Next Story