ఫేస్ కనిపించని బుక్...బుక్ చేస్తోంది అడ్డంగా!
మన భౌతిక రూపాన్ని అద్దం చూపిస్తే, మన మనసుల రూపాలను ఫేస్‌బుక్ చూపిస్తోంది. దీన్ని అతిపెద్ద సామాజిక మానసిక చిత్రంగా చెప్పవచ్చు. భార్యతో ఏదో విషయం మీద బాగా గొడవ పడుతున్నాడు ఓ భర్త. అప్పుడే ఫోన్ వచ్చింది. వెంటనే ఆ మూడ్‌లోంచి బయటకు వచ్చి అతను నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇళ్లల్లో ఆప్తుల వద్ద ప్రదర్శించే యధార్థ రూపాన్ని బయట వారి వద్ద ఎవరూ ప్రదర్శించరు. […]
మన భౌతిక రూపాన్ని అద్దం చూపిస్తే, మన మనసుల రూపాలను ఫేస్‌బుక్ చూపిస్తోంది. దీన్ని అతిపెద్ద సామాజిక మానసిక చిత్రంగా చెప్పవచ్చు.
భార్యతో ఏదో విషయం మీద బాగా గొడవ పడుతున్నాడు ఓ భర్త. అప్పుడే ఫోన్ వచ్చింది. వెంటనే ఆ మూడ్‌లోంచి బయటకు వచ్చి అతను నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇళ్లల్లో ఆప్తుల వద్ద ప్రదర్శించే యధార్థ రూపాన్ని బయట వారి వద్ద ఎవరూ ప్రదర్శించరు. అది మనిషి నైజం. అసలు మనలోని బలహీనతలతో యధాతథంగా బతకడానికి ఇంట్లో వారి అవసరం ఉన్నట్టుగానే, ప్రశంసలు, పొగడ్తలు అందుకుంటూ ఆనందించడానికి బయట వ్యక్తుల పరిచయాలూ మనకు కావాలి. ఈ మనిషి నైజం ఫేస్‌బుక్ విజయం వెనుక ఉన్న ముఖ్య కారణాల్లో ఒకటి. అందుకే ఫేస్‌బుక్ వింతలు ఇంతింత కాదయా… అనేంతగా విచిత్రాలు, విశేషాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.
దీని పేరు ఫేస్ బుక్కే అయినా ఫేస్ కనిపించకుండానే మనిషి తనను తాను పూర్తిగా ఆవిష్కరించుకునే వీలున్న బుక్ ఇది. అందుకే నిజజీవితంలో తెలిసినవారే ఫేస్‌బుక్‌లో అపరిచితులుగా కలుసుకుని, మాట్లాడుకుని, ప్రేమించుకుని తీరా కలుసుకున్నాక నాలుక కరుచుకున్న కథలను మనం వింటున్నాం. ఉత్తర ప్రదేశ్‌లో అయితే ఏకంగా ఓ భార్యాభర్తల జంట ఫేక్ ఐడిలు సృష్టించుకుని ఫేస్‌బుక్‌లో ఒకరికి ఒకరు అపరిచితుల్లా పరిచయం అయ్యారు, అభిప్రాయాలు కలబోసుకున్నారు, మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు…ఇక పెళ్లికూడా చేసేసుకుందాం…అని కలుసుకుని, ఒకరిమొహం ఒకరు చూసుకుని, ఇద్దరూ తెల్లమొహాలు వేశారు. ఒకరినొకరు నిందించుకోలేని పరిస్థితి. కలిసి సర్దుకుపోలేని దుస్థితి. చివరికి వారు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
ఫేస్ బుక్ ఇంట్లోంచి తప్పిపోయినవారిని తీసుకువచ్చి కలుపుతోంది. అలాగే ఇంట్లో కలిసి ఉన్నవారిని ఇలా విడగొడుతోంది కూడా. ఇంట్లోంచి వెళ్లిపోయినవారిని, తప్పిపోయినవారిని సంవత్సరాల తరువాత సోషల్ మీడియా అత్యంత ప్రభావవంతంగా వెతికిపెడుతోంది. ఈ మధ్య ఢిల్లీకి చెందిన ఒక వృద్ధురాలి విషయంలో ఇలాగే జరిగింది. గుడికి వెళ్లిన 80ఏళ్ల కమలా గుప్తా మతిమరుపు కారణంగా ఇంటికి తిరిగి రాలేకపోయింది. పోలీసులు ఆమె ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో, అది రీట్వీట్లు జరిగి, ఫేస్‌బుక్‌లోకి వెళ్లి, చివరికి ఆమె తన వారిని చేరేలా చేసింది. ఇలాంటివి బాగానే ఉన్నా ఫేస్‌బుక్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడమే బాధాకరం.
అమెరికన్ అకాడమీ ఆఫ్ మ్యాట్రిమోనియల్ లాయర్స్ నిర్వహించిన ఒక సర్వేలో అమెరికాలో 66శాతం విడాకులకు ఫేస్ బుక్కే కారణమని తేలింది. 80శాతం మంది లాయర్లు భార్యాభర్తలు విడాకులకు అప్లయి చేసిన సందర్భాల్లో వారు సోషల్ మీడియాలోని వ్యవహారాలను సాక్ష్యంగా చూపడం ఈ మధ్యకాలంలో పెరిగిపోయిందని వెల్లడించారు. భార్యాభర్తలు ఫేస్‌బుక్ అనుబంధాలు పెంచుకుంటే వారి కాపురాన్ని అది డైనమైట్‌లా పేల్చేస్తుందని మానవసంబంధాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఉన్నపుడు కనీసం కాస్త కామన్‌సెన్స్‌తో వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. వారు ఇస్తున్న సూచనలు.
- భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అనేది ఎప్పటినుండో వస్తున్న మాట. ఎవరి స్పేస్ వారికి ఉండాలి అనేది ఇప్పటి బాట. అయితే పదికాలాలు కలిసి ఉండాలంటే నిజాయితీ అనేది ఒకటి తప్పని సరి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఉన్నపుడు ఒకరి పాస్‌వర్డ్ ఒకరికి తెలిసి ఉంటే మంచిదని లేదా ఇద్దరూ కలిసి ఒకే పేజిని నిర్వహించుకున్నా మంచిదేననేది నిపుణుల సూచన. దీన్ని అనుమానించే స్వభావంగా చూడాల్సిన పనిలేదని ఒక నిజాయితీకి, అనుబంధంలో పారదర్శకతకు నిదర్శనంగా చూడవచ్చని వారు అంటున్నారు.
- ఏముంది కాస్త చిలిపిగా, సరదాగా మాట్లాడుతున్నాం అంతే కదా…అనిపించేలా ఫేస్‌బుక్‌లో ఛాట్ చేయవద్దని, ఫ్లర్టింగ్ అనేది తరువాత వేరే రూపాల్లోకి మారవచ్చని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఒక మనిషిని మనకు అందుబాటులో ఉంచే సాధనం ఫేస్‌బుక్… ఇలాంటపుడు అనుబంధాల్లో చాలా జాగ్రత్తగా, స్పష్టంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌తో ఉండవద్దంటున్నారు. అదేపనిగా గంటల తరబడి ప్రొఫైల్స్, పిచ్చర్స్ చూస్తూ ఉంటే అనవసరమైన, అవాంఛితమైన వ్యక్తులు, విషయాల వైపు మనసు మళ్లుతుందని, దీన్ని నివారించాలంటే ఫేస్‌బుక్‌తో గడిపే సమయాన్ని కుదించాలని వారు సలహా ఇస్తున్నారు.